
మృత్యువుతో పోరాడి ఓడిన రమ్య
హైదరాబాద్: పంజాగుట్ట కారు ప్రమాదంలో గాయపడ్డ చిన్నారి రమ్య శనివారం మృతి చెందింది. కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ రమ్య గత 9 రోజులుగా కోమాలో ఉంది. రమ్య ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శనివారం మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు.
బంజారాహిల్స్ రోడ్ నంబర్-3లోని పంజగుట్ట హిందూశ్మశాన వాటికముందు పమ్మి రాజేష్(34) కుటుంబసభ్యులతో కలిసి కారులో వెళ్లాడు. సరిగ్గా అదే సమయంలో అవతలి వైపు నుంచి పీకలదాకా మద్యం సేవించిన యువకులు వస్తున్న కారు డివైడర్‌ను ఢీకొని రాజేష్ కారుపై పడటంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. పక్కనే కూర్చున్న తండ్రి మధుసూదనాచారి(65) వెన్నుపూస విరగడంతో ఆయనను యశోద ఆస్పత్రిలో చేర్చారు. కారులో ఉన్న చిన్నారి రమ్య(8)కి తీవ్ర గాయాలు కావడంతో కేర్ ఆస్పత్రిలో చేర్చగా బ్రెయిన్ డెడ్ అయి కోమాలోకి వెళ్లి 9 రోజుల పాటూ మృత్యువుతో పోరాడి ఓడింది. పాప పక్కనే కూర్చొని మొదటి రోజు స్కూల్ కబుర్లు వింటున్న తల్లి రాధిక(32) ఈ ప్రమాదంలో కుడి కాలు విరిగి యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. డ్రైవర్ సీటు పక్కన కూర్చున్న మరో సోదరుడు రమేష్(40) ఈ ప్రమాదంలో వెన్నెముక విరిగి యశోదలో చికిత్స పొందుతున్నారు.