ఏడాది ముందే అభ్యర్థుల ప్రకటన
♦ టీపీసీసీ సమన్వయ కమిటీ భేటీలో నిర్ణయం
♦ జిల్లాల వారీగా పని విభజన, ఇన్‌చార్జీల నియామకం
♦ టికెట్ల కేటాయింపులో పీసీసీ, డీసీసీల అభిప్రాయం కీలకం
సాక్షి, హైదరాబాద్: సాధారణ ఎన్నికలకు ఏడాది ముందుగానే పార్టీ అభ్యర్థులను ప్రకటించాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) సమన్వయ కమిటీ, కార్యవర్గ సమావేశాల్లో నిర్ణయించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం ఈ సమావేశాలు జరిగాయి. ఏఐసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొప్పుల రాజు, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, ఏఐసీసీ నేత శ్రీనివాసన్, పార్టీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, జిల్లాల పార్టీ అధ్యక్షులు హాజరయ్యారు.
పార్టీలో సీనియ ర్లు, గెలిచే సత్తా ఉన్న అభ్యర్థులకు ఏడాది ముందుగానే టికెట్లను ఖరారు చేయాలని నిర్ణయించారు. క్షేత్రస్థాయిలో పనిచేసే నాయకులకే భవిష్యత్తులో టికెట్లు ఇవ్వాలని, టికెట్ల ఖరారులో పీసీసీ, డీసీసీల అభిప్రాయాలను కీలకంగా తీసుకోవాలని నిర్ణయించారు. వీటితోపాటు పార్టీ సంస్థాగత నిర్మాణం, శిక్షణా శిబిరాలు, క్రమశిక్షణ సంఘం పనితీరు వంటివాటిపై కీలక నిర్ణయాలను తీసుకున్నారు.
జూన్ నెలాఖరులోగా మండల కమిటీల నియామకం
ఈ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను టీపీసీసీ నేతలు మల్లు రవి, దాసోజు శ్రవణ్, మహేశ్‌కుమార్ గౌడ్‌లు మీడియాకు వివరిం చారు. వీరు వెల్లడించిన వివరాల ప్రకారం ఉపాధ్యక్షుడి నేతృత్వంలో ముగ్గురు ప్రధాన కార్యదర్శులను జిల్లాల ఇన్‌చార్జీలుగా నియమించారు. జూన్ నెలాఖరులోగా అన్ని మండ ల కమిటీల నియామకాలు పూర్తిచేయాలి. బూత్‌స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కార్యకర్తలకు కాంగ్రెస్‌పార్టీ విధానాలు, సిద్ధాంతాలపైన రాజకీయ శిక్షణ తరగతులను నిర్వహిస్తారు.
నియోజకవర్గానికి 30 మంది చొప్పున పూర్తికాలం పార్టీ కార్యకర్తల జాబితా రూపొం దించి, మొత్తం 3,600 మందికి ఒకరోజు శిక్షణ ఇస్తారు. శిక్షణ కార్యక్రమంలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పాల్గొంటారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసేవారు, పార్టీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడే వారిపై కఠినంగా వ్యవహరించడానికి క్రమశిక్షణ సంఘాన్ని పటిష్టం చేయాలని నిర్ణయించారు. 2019 ఎన్నికలు లక్ష్యంగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం, ప్రజా క్షేత్రంలో పనిచేయడం వంటి కీలక నిర్ణయాలను తీసుకున్నట్టుగా టీపీసీసీ నేతలు వెల్లడించారు.