ఊకదంపుడు ఉపన్యాసాలు కాకుండా..పురుషులతో సమానంగా అవకాశాలు కల్పిస్తేనే మహిళా సాధికారత సాధ్యమవుతుంది. మహిళలు విద్య, ఆర్థిక, సామాజిక రాజకీయరంగాల్లో ఎదగాలని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ ఆకాంక్షించారు. ఆడపిల్లల పెంపకంపై తల్లిదండ్రులు, సమాజంలో మార్పు రావాలని కోరారు. గద్వాల ఎమ్మెల్యేగా మూడుసార్లు వరుసగా విజయం సాధించి, గద్వాల నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం తపిస్తూనే.. రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకస్థానం సంపాదించుకున్న ఆమె శనివారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
సాక్షి, గద్వాల: ఆడపిల్లలను మగపిల్లలతో సమానంగా చూడాలి. నేటి సమాజంలో మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తున్నారు.. అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నారు.. అన్నిరంగాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు. అంతరిక్షంలోనూ అడుగుపెడుతున్నారు. అయినప్పటికీ మహిళలు వివక్ష ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజు ఏదో మూలన దాడులు, అత్యాచారాలు, హింస, వేధింపులు చోటుచేసుకుంటున్నాయి. స్త్రీలను బలహీనులుగా చూడడం సమాజానికి అలవాటుగా మారింది. అసమానతలకు అడ్డుకట్టవేయాలంటే మహిళలు నిర్ణయాత్మకశక్తిగా అవతరించాలి.
పుట్టినిల్లు, మెట్టినిల్లు రాజకీయ నేపథ్యమే..
పుట్టినిల్లు, మెట్టినిల్లు రెండూ కూడా రాజకీయ నేపథ్యం ఉన్నవే. మా నాన్న దివంగత నర్సిరెడ్డి మక్తల్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే నక్సల్స్ కాల్పుల్లో చనిపోయారు. నేను మొదటి సంతానం కాబట్టి నాన్న చాలా గారాబంగా పెంచారు. పెంపకంలోనూ మా తమ్ముళ్లతో సమానంగా చూశారు. ఇంటర్‌మీడియెట్ చదివేటప్పుడు భరతసింహారెడ్డితో నా వివాహమైంది. అప్పటికే మామ సత్యారెడ్డి, బావ సమరసింహారెడ్డి రాజకీయాల్లో ఉన్నారు. భరతసింహారెడ్డి గద్వాల ఎమ్మెల్యేగా పనిచేశారు. నా భర్త ప్రోత్సాహంతోనే రాజకీయాల్లో రాణిస్తున్నాను. ప్రతి నిర్ణయంలోనూ ఆయన సలహాతో పాటు నియోజకవర్గ ప్రజలతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటాను.
రాజకీయ రంగప్రవేశం
1999లో మొదటగా జెడ్పీచైర్మన్ అభ్యర్థిగా పాన్‌గల్ నుంచి జెడ్పీటీసీగా పోటీచేసి విజయం సాధించాను. రెండుసీట్ల తేడాతో జెడ్పీచైర్మన్ కాలేపోయాను.. జెడ్పీటీసీగా ఉన్నప్పుడే జిల్లా ప్రాజెక్టుల కోసం పాదయాత్ర చేశాను.. హైదరాబాద్ వరకు జరిగిన ఈ యాత్రలో అప్పట్లో వైఎస్సార్ కూడా పాల్గొన్నారు. వేలాది మంది ప్రజలు, మహిళలు ఇందులో భాగస్వాములయ్యారు. ఆర్డీఎస్‌పైనా ఆరురోజుల పాటు ఆమరణదీక్ష చేపట్టాను. 2004లో ఇండిపెండెంట్‌గా గద్వాల ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందాను. ప్రాజెక్టుల కోసం చేసిన పాదయాత్ర, నిరాహారదీక్ష చేయడంతోనే ప్రజలు ఆదరించారు. అలాగే 2009, 2014లోనూ వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాను.. మంత్రిగా పనిచేశాను.
ఎన్నో సాధించా..
జిల్లాకు నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేయించి 2012నుంచి సాగుకు నీళ్లు ఇస్తున్నా.. హైడల్ పవర్ ప్రాజెక్టులు, మహిళా డిగ్రీ, జూనియర్ కళాశాలలు, పాఠశాలలు, అన్ని మండలాలకు జూనియర్ కళాశాలలు, హాస్టళ్లు, ఇంటిగ్రేటెడ్ హాస్టళ్లు. బాలికల కోసం ప్రత్యేకంగా పాఠశాలలు ఏర్పాటు చేయించాం. మహిళా ప్రజాప్రతినిధిని అయినప్పటికీ నిబద్ధత, పట్టుదలతో పనిచేసి అన్నిరంగాల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాను.
కుటుంబ వ్యవస్థలో మార్పురావాలి
కుటుంబ వ్యవస్థ నుంచే మార్పు రావాలి. కొడుకులతో సమానంగా కూతుళ్లను తల్లిదండ్రులు చదివించాలి. ఆసక్తి ఉన్న రంగంలో రాణించే విధంగా ప్రోత్సహించాలి. సమాజంలోనూ మార్పురావాలి. ‘మహిళల కోసం అది చేస్తున్నాం.. ఇది చేస్తున్నాం..’ అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలతో ఒరిగేదేమీ ఉండదు. కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించింది. కాబట్టే నేడు మహిళలు రాజకీయాల్లో రాణించగలుగుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కేబినెట్‌లో ఆరుగురు మంది మహిళా మంత్రులుగా ఉన్నాం. కానీ ప్రస్తుత ప్రభుత్వంలో ఒక్క మహిళా మంత్రి కూడా లేరు. ప్రభుత్వ ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు.
చట్టాలను పకడ్బందీగా అమలుచేయాలి
దేశంలో మహిళల కోసం ఎన్నోచట్టాలు ఉన్నా వాటిని అమలు చేయడంలోనే నిర్లక్ష్యం ఉంది. ఎన్ని బలమైన చట్టాలు వచ్చినా మహిళలపై ప్రతి రోజూ ఎక్కడో అక్కడ దాడులు, హత్యలు, అత్యాచారాలు, అఘాయిత్యాలు చోటుచేసుకుంటున్నాయి. వీటిని అరికట్టాలంటే వ్యవస్థ, సమాజంలోని అందరి ఆలోచనల్లో మార్పురావాలి. విద్యార్థి దశనుంచే మగపిల్లల ఆలోచనల్లో స్త్రీపట్ల గౌరవాన్ని పెంపొందించే విధంగా విద్యావ్యవస్థను రూపొందాలి. మహిళలను ప్రోత్సహిస్తే మహిళలు సమాజంలో పురుషులతో సమానంగా రాణిస్తారు.
మహిళలు రాజకీయాల్లోకి రావాలి
మహిళలు, ప్రధానంగా యువ మహిళలు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది. పురుషులతో పోలిస్తే మహిళలకు నిబద్ధత, అంకితభావం ఎక్కువగా ఉంటాయి. మహిళ తన కుటుంబాన్ని చక్కదిద్దుకున్నట్లుగానే రాజకీయాల్లోకి వస్తే తన పరిధిలో ఉన్న వ్యవస్థనూ చక్కదిద్దుతారు. దీనిని ఎంతో మహిళామూర్తులు నిరూపించారు. చక్కటిపాలన అందించే శక్తి ఉం దని నిరూపించారు. చట్టసభల్లో మహిళల సంఖ్యాబలం ఉన్నప్పుడే హ క్కులు సాధించుకోవడానికి వీలవుతుంది. నేను మహిళా ప్రజాప్రతినిధిగా ఉండటంతో ఎంతోమంది మహిళలు రాజకీయాల్లోకి వస్తున్నారు. పాల నావ్యవస్థలో మహిళలు భాగస్వాములైతేనే వ్యవస్థలో మార్పు వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment