‘ఫిరాయింపు’పై జానా వర్సెస్ ఉత్తమ్
సీఎల్పీ సమావేశంలో వాడీవేడి చర్చలు
* గాంధీభవన్ నుంచి లీకులు వస్తున్నాయి: జానారెడ్డి
* పీసీసీ చీఫ్ ఎందుకు ఖండించరంటూ ఆగ్రహం
* నాకేం సంబంధం అని ప్రశ్నించిన ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: పార్టీ మారుతున్నారంటూ వస్తున్న వార్తలపై సీఎల్పీ నేత కె.జానారెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. అసెంబ్లీలోని పార్టీ కార్యాలయంలో జానారెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన సీఎల్‌పీ సమావేశంలో ఫిరాయింపుల అంశం చర్చకు వచ్చింది.
ఈ సందర్భంగా వారిద్దరి మధ్య మాటామాటా పెరిగినట్లు సమాచారం. పార్టీ ఫిరాయింపులు, దానికి కారణాలు, వలసలను అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలు, నాయకత్వం బాధ్యత, పార్టీలో అంతర్గత విభేదాలు, పార్టీ పటిష్టత, పాలేరు ఉప ఎన్నికపై ఈ సమావేశంలో చర్చించారు. భేటీలో సీఎల్పీ నేత జానారెడ్డి మాట్లాడుతూ... తాను టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టుగా వార్తలు రావడం బాధాకరమన్నారు. ఇలాంటి వార్తలు గాంధీభవన్ నుంచి, పీసీసీ ఆఫీసు బేరర్ల నుంచి వస్తున్నాయన్నారు. గాంధీభవన్ నుంచి ఇలాంటి తప్పుడు లీకులు ఇస్తుంటే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ ఎందుకు ఖండించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీనిపై ఉత్తమ్ స్పందిస్తూ.. ‘‘ఆఫీసు బేరర్లు ఎవరు లీక్ చేశారో నాకెలా తెలుస్తుంది? ఎవరైనా పార్టీ ఫిరాయిస్తున్నారని వార్తలు వస్తే ఇతరులెలా ఖండిస్తారు..’’ అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య వాగ్వాగం జరిగింది. పార్టీ సీనియర్ నేతలు జీవన్‌రెడ్డి, డీకే అరుణ తదితరులు జోక్యం చేసుకుని వారిని సముదాయించారు. అనంతరం జానా మాట్లాడుతూ... సీఎల్పీ నేతగా తాను కొనసాగడం ఇష్టం లేకుంటే తప్పుకుంటానని, ఈ బాధ్యతలను ఎవరైనా తీసుకోవచ్చన్నారు. దాంతో ఇప్పుడు నాయకత్వ బాధ్యతల నుంచి వైదొలగడం, మార్పుపై చర్చ అనవసరమని సీనియర్లు అభిప్రాయపడ్డారు.
సొంత ప్రయోజనాల కోసమే వీడుతున్నారు
కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలు ఎందుకు ఫిరాయింపులకు దిగుతున్నారనే అంశంపై భేటీలో తీవ్ర చర్చ జరిగింది. సొంత ప్రయోజనాలకు ప్రాధాన్యమిచ్చి కాంగ్రెస్‌ను వదిలి అధికార పార్టీలోకి వెళ్తున్నారని పలువురు ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన తర్వాత కాంగ్రెస్ నాయకత్వం సరిగా లేదని నోటికొచ్చినట్టుగా మాట్లాడితే పట్టించుకోవాల్సిన అవసరం లేదని సూచించారు. నాయకత్వం అంటే ఎలా ఉండాలి, ఏం చేయాలని కూడా పలువురు ప్రశ్నించారు.
పార్టీ టికెట్ ఇచ్చి, గెలవడానికి వనరులను సమీకరించిన తర్వాత కూడా పార్టీ మారితే ఇక ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి అర్థం ఏముంటుందని ప్రశ్నించారు. పార్టీ మారుతామంటే ముందుగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వెళ్లాలని జానారెడ్డి అన్నారు. పార్టీలో నేతలపై పరస్పరం నమ్మకం ఉండాలన్నారు. ఈ మధ్య పార్టీ మారిన పువ్వాడ అజయ్‌కు కాంగ్రెస్‌తో అనుబంధం లేదన్నారు. పాలేరు ఉప ఎన్నికలో అంతా ఏకమై పనిచేయాలని ఈ సమావేశంలో తీర్మానించారు. పాలేరు ఎన్నిక వ్యయం కోసం పార్టీ ఎమ్మెల్యేలంతా ఒకనెల జీతాన్ని విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారు.
ఎమ్మెల్సీలకు నో ఎంట్రీ
కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షం సమావేశం అంటూ విప్ సంపత్ కుమార్ నుంచి, సీఎల్పీ కార్యాలయ సిబ్బంది నుంచి ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఎంపీలకు సమాచారం అందింది. అయితే సమావేశం ప్రారంభానికి ముందు ఎమ్మెల్యేలకు మాత్రమే ఈ సమావేశం పరిమితమని సిబ్బంది చెప్పారు. దీంతో ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యేల సమావేశమే అయితే ఎమ్మెల్సీలను ఎందుకు ఆహ్వానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో జానా, ఉత్తమ్ బయటకు వచ్చి షబ్బీర్ అలీని, పొంగులేటి సుధాకర్ రెడ్డిని విశ్రాంతి గదిలోకి తీసుకువెళ్లారు. కాగా, నల్లగొండ డీసీసీ అధ్యక్షుడి నియామకం, అయోమయ నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ సమావేశం నుంచి అలిగి వెళ్లిపోయారు.