కొత్తగా 22 వేల మందికి ‘ఆసరా’
- నవంబర్, డిసెంబర్‌లలో వచ్చిన దరఖాస్తులకు మోక్షం
- కొత్త లబ్ధిదారులకు జనవరి నుంచి పింఛన్
సాక్షి, హైదరాబాద్: ఆసరా పథకం కింద సామాజిక పింఛన్ల కోసం గత నవంబర్, డిసెంబర్‌ల్లో ప్రభుత్వానికి అందిన దరఖాస్తులకు మోక్షం లభించింది. అర్హులైన 22,001 మందికి కొత్తగా ఆసరా పెన్షన్లు మంజూరు చేసి నట్లు ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. తాజాగా మంజూరైన వాటితో లబ్ధిదారుల సంఖ్య 35,95,778కి చేరింది. కొత్తగా మంజూరైన పింఛన్లలో 6,204 వృద్ధాప్య, 10 వేల వితంతు, 2,998 వికలాంగ, 335 గీత కార్మిక, 156 చేనేత, 2,308 హెచ్‌ఐవీ బాధితులకు(ఆర్థిక భృతి) ఉన్నాయి. కొత్త పింఛన్లను జనవరి నుంచి లబ్ధిదారులకు అందించనున్నట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులు తెలిపారు. అర్హుౖలందరికీ ఆసరా పింఛన్ ఇవ్వాలని గ్రామీణాభివృద్ధి శాఖ అధికా రులను మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు.
ఆసరా పింఛన్లకు రూ.396 కోట్లు
రాష్ట్రంలో సుమారు 36 లక్షల మంది లబ్ధిదారులకు ఆసరా పింఛన్ల పంపిణీ నిమిత్తం ప్రభుత్వం శుక్రవారం రూ.396 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులు ఆర్థికశాఖ నుంచి సెర్ప్ ఖాతాకు చేరినట్లు అధికారులు తెలిపారు. పూర్తిస్థాయిలో నిధులు అందినందున ఈ నెల 13 నుంచి లబ్ధిదారుల బ్యాంక్, పోస్టాఫీసు ఖాతాలకు సొమ్మును జమ చేయనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో 45% మందికి పింఛన్ సొమ్మును బ్యాంకు ఖాతాలకు, 55% మందికి వారి పోస్టాఫీసు ఖాతాలకు జమ చేస్తున్నారు. కేవలం 300 మంది లెప్రసీ వ్యాధిగ్రస్తులకు సొమ్మును స్థానిక సంస్థల సిబ్బంది వారి చేతికి అందజేస్తున్నారు. ఆసరా పింఛన్ పంపిణీ చేసే సమాచారాన్ని లబ్ధిదారుల మొబైల్‌కు ఎస్‌ఎంఎస్ ద్వారా పంపే విధానాన్ని ఏప్రిల్ 1 నుంచి అమలు చేయనున్నట్లు సెర్ప్ అధికారులు పేర్కొన్నారు.