తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు చేసిన ప్రసంగాలు
ప్రసంగ పాఠాల పుస్తకావిష్కరణ సభలో సీఎం చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు చేసిన ప్రసంగాలు ప్రజలను చైతన్య పర చటంతోపాటు, ఆలోచింపచేసి కర్తవ్యోన్ముఖులను చేశాయని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఆయన మరణించి 20 ఏళ్లు గడిచినా ఆయన జ్ఞాపకాలు ప్రజల్లో సజీవంగా ఉన్నాయన్నారు. ఆయన సేవలను రెండు తరాల ప్రజలు గుర్తుంచుకున్నారని చెప్పారు. అసెంబ్లీలో ఎన్‌టీఆర్ చేసిన ప్రసంగ పాఠాలతో కూడిన పుస్తకాన్ని మంగళవారం సాయంత్రం అసెంబ్లీ కమిటీ హాలులో సీఎం ఆవిష్కరించారు.
సీఎం మాట్లాడుతూ.. శాసనసభలో గతంలో ప్రతిపక్ష నేతలుగా పనిచేసిన పుచ్చలపల్లి సుందరయ్య, వావిలాల గోపాలకృష్ణయ్య, చెన్నమనేని రాజేశ్వరరావు లాంటివారు అసెంబ్లీలో ప్రసంగించటానికి ముందు విస్తృత అధ్యయనం, సుదీర్ఘ కసరత్తు చేసేవారన్నారు. ఎన్టీ రామారావు తన ప్రసంగాల ద్వారా ప్రజలను చైతన్యం చేశారన్నారు. భాషపై ఎన్‌టీఆర్‌కు విపరీతమైన పట్టుండేదని, ప్రజలకు చెప్పదలచుకున్న సమాచారాన్ని సూటిగా చెప్పేవారన్నారు. స్పీకర్ కోడెల ప్రసంగిస్తూ శాసనసభలో ప్రముఖులు చేసిన ప్రసంగాలను గతంలో పుస్తక రూపంలో తీసుకొచ్చామన్నారు. ప్రస్తుతం ఎన్‌టీఆర్ ప్రసంగాలను పుస్తక రూపంలో తీసుకొస్తున్నామని, ఇవి భావితరాలకు ఉపయోగపడతాయన్నారు. కార్యక్రమంలో స్పీకర్ కోడెల, యనమలతోపాటు పలువురు మంత్రులు, చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు, అసెంబ్లీ ఇన్‌చార్జి కార్యదర్శి సత్యనారాయణ పాల్గొన్నారు.