
'దానం’పై కేసులను దర్యాప్తు చేయండి
హైదరాబాద్: తాజా మాజీ మంత్రి దానం నాగేందర్‌పై నమోదైన కేసుల్లో ఇప్పటి వరకు ఎటువంటి పురోగతి లేదని, పోలీసులు ఉద్దేశపూర్వకంగా ఈ కేసులను దర్యాప్తు చేయడం లేదని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ వ్యాజ్యాన్ని న్యాయవాది ఎ.తిరుపతివర్మ దాఖలు చేశారు. ఇందులో హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, బంజారాహిల్స్ ఎస్‌హెచ్‌ఓ, తుకారంగేట్ ఎస్‌హెచ్‌ఓలను ప్రతివాదులుగా పేర్కొన్నారు.
గత మూడేళ్లలో దానంపై నాలుగు కేసులు నమోదయ్యాయని, ఈ కేసుల్లో ఇప్పటి వరకు దర్యాప్తు పూర్తి కాలేదని పిటిషనర్ తెలిపారు. దానం నాగేందర్ పోలీసులపై ఒత్తిడి తెస్తూ దర్యాప్తును అడ్డుకుంటున్నారని వివరించారు. 2013లో తనపై దాడి చేసినందుకు, 2011లో దళితుడిపై దాడి చేసినందుకు, మరో రెండు సందర్భాల్లో పోలీసులపై దాడికి దిగినందుకు దానంపై కేసులు నమోదయ్యాయని తెలిపారు.