
సాక్షి, హైదరాబాద్ : గోల్కొండ కోట చూద్దామని వెళ్లారు.. ఎంట్రీ టికెట్ తీసుకున్నారు.. ప్రవేశ ద్వారం దగ్గరకు వచ్చారు.. ఆగండాగండి.. చేతిలో ప్లాస్టిక్ నీళ్ల బాటిల్ ఉందా.. అయితే రూ.20 కట్టాల్సిందే.. అదేంటి?.. ఎందుకు కట్టాలి అనుకుంటున్నారా.. అయితే మీకు ‘స్టిక్కరింగ్’ ప్రయోగం గురించి వివరించాల్సిందే..
అంతర్జాతీయ పర్యాటకులు ఎక్కువగా సందర్శించే గోల్కొండ కోటలో గతంలో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ నీళ్ల బాటిళ్లే కనిపించేవి. కోట పరిసరాలు శుభ్రం చేసే సిబ్బంది తక్కువగా ఉండటంతో వ్యర్థాల నియంత్రణ, తొలగింపు సవాల్‌గా మారింది. దీనికి చెక్ పెట్టేందుకు కేంద్ర పురావస్తు సర్వేక్షణ (ఏఎస్‌ఐ) విభాగానికి వచ్చిన కొత్త అధికారి ‘స్టిక్కరింగ్’ విధానం తీసుకొచ్చారు. ఇప్పుడు ప్లాస్టిక్ వ్యర్థాలే కోటలో కనిపించడం లేదంటే ఆ చిట్కా ఎలా పని చేసిందో అర్థమైపోయుంటుంది.
ఖాళీ బాటిల్‌ను పడేశారో..
గోల్కొండ కోటను ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా గతంలోనే ప్రకటించారు. కానీ ప్లాస్టిక్ వ్యర్థాలు పడేయకుండా పర్యాటకులను నిరోధించటం సాధ్యం కాకపోవటంతో అది ఫలితమివ్వలేదు. దీంతో ఏఎస్‌ఐ తెలంగాణ సర్కిల్ సూపరింటెండెంట్ ఆర్కియోలజిస్ట్ మిలన్ కుమార్ చావ్లే స్టిక్కరింగ్ విధానం ప్రవేశపెట్టారు. ఆ విధానం ప్రకారం పర్యాటకులు వెంట తెచ్చుకున్న మంచి నీళ్ల బాటిల్‌కు సిబ్బంది స్టిక్కర్ అతికించి రూ.20 వసూలు చేస్తారు. సందర్శన పూర్తయ్యాక తిరిగి వెళ్లే సమయంలో స్టిక్కర్ వేసిన బాటిల్ ఇస్తే రూ.20 తిరిగి ఇస్తారు. ఖాళీ బాటిల్‌ను ఎక్కడైనా పడేశారో.. ఆ రూ. 20 ఇవ్వరు.
స్టిక్కర్ వద్దనుకుంటే..
గోల్కొండ క్యాంటిన్లలోనూ నీళ్ల బాటిల్ కొని వెంట తీసుకెళ్తే బాటిల్ ధరకు రూ.20 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఖాళీ బాటిల్ ఇచ్చి రూ.20 తిరిగి తీసుకోవచ్చు. కోట ప్రవేశ ద్వారం వద్ద స్టిక్కర్ అతికిస్తారు. ఖాళీ బాటిళ్లు ఇచ్చేందుకు 3 చోట్ల ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్టిక్కర్ వద్దనుకుంటే మాత్రం బాటిల్‌ను లోనికి అనుమతించరు. అక్కడే నిలబడి నీళ్లు తాగి బాటిల్‌ను చెత్తబుట్టలో పడేస్తేనే లోనికి అనుమతి ఉంటుంది. గతంలో కోట లోపల నిత్యం 250 ఖాళీ సీసాలు దర్శనమిచ్చేవి. తాజా విధానం బాగా పని చేసింది. ఎక్కడపడితే అక్కడ ఖాళీ బాటిళ్లు విసిరేసే నిర్లక్ష్యానికి చెల్లుచీటి పడింది.
తినుబండారాలకూ..
బాటిళ్లే కాదు.. ప్లాస్టిక్ కవర్లలో తినుబండారాలుంటే వాటినీ అనుమతించడం లేదు. వెంట తెచ్చుకున్న ఆహార పదార్థాలు లోనికి తీసుకెళ్లాలంటే కవర్‌ను చించి తినుబండారాలను అందుబాటులో ఉంచిన కాగితం కవర్లో వేసుకుని తీసుకెళ్లాలి. ఒక్కో కాగితం కవర్‌కు రూ.1 చొప్పున చెల్లించాలి. ఈ రెండు విధానాలనూ ఇటీవలే అమల్లోకి తీసుకొచ్చారు. దీంతో కోటలో ప్లాస్టిక్ నిషేధం ఠంచన్‌గా అమలవుతోంది.
నిర్బంధం తప్పదు
‘ప్లాస్టిక్ నిషేధించినా పర్యాటకులు పెడచెవిన పెడుతున్నారు. దీంతో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలు పోగై కట్టడం చెత్తమయంగా కనిపిస్తోంది. అందుకే ఈ విధానాన్ని అమలు చేస్తున్నాం. తొలుత పర్యాటకులు వ్యతిరేకించినా ఇప్పుడు అలవాటు పడ్డారు. మిగిలిన ప్రాంతాల్లోనూ ఈ విధానం అమలు చేస్తే పర్యాటక ప్రాంతాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలుండవు’
– ఏఎస్‌ఐ ఎస్‌ఏ మిలన్ కుమార్ చావ్లే