సాక్షి, హైదరాబాద్: గిరిజన భూములు సాగు చేసే గిరిజనేతర రైతులకు కూడా రైతు బంధు పథకం కింద పెట్టుబడి సాయం చేసే విష యాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. అటవీ భూములకు మాత్రం పెట్టుబడి సాయం చేయడం కుదరదని తేల్చిచెప్పారు. శాసనమండలిలో బుధవారం ‘రెవె న్యూ రికార్డుల దిద్దుబాటు, పట్టాదారు పాసు పుస్తకాల జారీ, రైతులకు ఎకరానికి రూ.8 వేల పెట్టుబడి సాయం’పై జరిగిన లఘు చర్చలో పోచారం మాట్లాడారు.
రెండేళ్లకు పైగా ఉన్న ఉద్యాన పండ్ల తోటలకు ఏడాదికి ఎకరానికి రూ.8 వేల చొప్పున సాయం అందజేస్తామన్నారు. విత్తనోత్పత్తి చేసే రైతులకు కూడా పెట్టుబడి సాయం అందుతుందన్నారు. రాష్ట్రంలో 1.62 కోట్ల సర్వే నంబర్లు ఉంటే, వాటిలో 1.49 కోట్ల సర్వే నంబర్ల (93%) భూమిపై స్పష్టత వచ్చిం దని తెలిపారు.
దీన్ని పార్ట్–ఎగా పేర్కొంటున్నామని, పార్ట్–బిలో 7 శాతం భూమి వివాదాస్పదంగా ఉందని వివరించారు. పార్ట్–ఎలో భూమి ఉన్న రైతులందరికీ పట్టాదారు పాసుపుస్తకాలు, పెట్టుబడి సాయం అందుతాయన్నారు. 10,823 గ్రామాల్లో 7 వేల గ్రామాల భూముల వివరాలను రెవెన్యూ శాఖ వ్యవసాయ శాఖకు అందజేసిందన్నారు.
రాజకీయపరంగా ట్రాక్టర్ల పంపిణీ: రామచందర్‌రావు విమర్శ
రాజకీయపరంగా ట్రాక్టర్లు పంపిణీ చేస్తున్నారని మండలిలో బీజేపీ నేత రామచందర్‌రావు ఆరోపించారు. తన వద్ద లేఖలు తీసుకున్న వారికి ట్రాక్టర్లు ఇవ్వలేదన్నారు. రైతు సమన్వయ సమితులు రైతుల మధ్య చిచ్చుపెట్టేలా తయారు కాకూడదని సూచించారు. రాష్ట్రంలో భూమి శిస్తు ప్రవేశపెట్టాలని అధికార సభ్యుడు కృష్ణారెడ్డి కోరారు. రాష్ట్రంలో ఒకే వ్యక్తికి ఎన్ని చోట్ల భూమి ఉన్నా ఒకే పాస్‌బుక్ ఇవ్వాలని మరో సభ్యుడు భానుప్రసాద్ కోరారు.
ప్రతి రైతు భూమిలో భూసార పరీక్ష
ప్రతి రైతు భూమిలో భూసార పరీక్ష చేయాలని కేంద్రానికి విన్నవించామని, ఆ ప్రకారం రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టనున్నామని పోచారం తెలిపారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకం ద్వారా కరువు, ఇతర నష్టాలకు గ్రామం యూనిట్‌గానే నష్టపరిహారం ఇస్తున్నారని, రైతు యూనిట్‌గా బీమాను వర్తింపజేయాలని కేంద్రానికి విన్నవించామని చెప్పారు.
2014–15 నుంచి ఈ ఆర్థిక సంవత్సరం వరకు 28.41 లక్షల మంది రైతులు బీమా ప్రీమియం చెల్లించారన్నారు. వీరిలో 10.79 లక్షల మంది లబ్ధి పొందారన్నారు. రూ.791 కోట్లు అందిందని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ రాష్ట్రంలో 74 వేల ఎకరాల దేవాలయ, 45 వేల ఎకరాల వక్ఫ్ భూములన్నాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment