ప్రకృతి సేద్యం బాగుంటే అమలు చేస్తాం
- పెట్టుబడి లేని ఈ సేద్యాన్ని సమర్థిస్తున్నా
- రైతులపై బలవంతంగా రుద్దం: మంత్రి పోచారం
- పాలేకర్ పద్ధతి పాటిస్తే.. రైతు ఆత్మహత్యలుండవు
- 17,18 తేదీల్లో మహారాష్ట్రకు చెరకు రైతుల బృందం
సాక్షి, హైదరాబాద్: పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్న రైతుల పొలాలకు వెళ్లి క్షుణ్ణంగా అధ్యయనం చేస్తామని, రైతులకు ప్రయోజనకరమని రుజువైతే ఈ పద్ధతిని ప్రభుత్వపరంగా అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం వెనుకాడబోదని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. ఆదివారం హైదరాబాద్‌లో సేవ్ స్వచ్ఛంద సంస్థ అధినేత విజయరామ్ ఆధ్వర్యంలో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంపై రైతుల శిక్షణా శిబిరం జరిగింది. ప్రకృతి వ్యవసాయ పితామహుడు సుభాష్ పాలేకర్‌తోపాటు తొలిసారిగా మంత్రి పోచా రం, పలువురు ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు ఈ శిబిరంలో పాల్గొనడం విశేషం.
ఈ సందర్భంగా మంత్రి పోచారం మాట్లాడుతూ ఈ జీరో బడ్జెట్ వ్యవసాయ పద్ధతిపై రైతుగా తన పూర్తి మద్దతు ఉందన్నారు. విజయరామ్ ఆధ్వర్యంలో తన పొలంలో ప్రకృతి వ్యవసాయం చేయిస్తున్నానన్నారు. అయితే, రైతులందరికీ ఇది ప్రయోజనకరమని తేలితే తప్పకుండా ప్రభుత్వ విధానంగా చేపడతామన్నారు. దీన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి, ప్రకృతి వ్యవసాయ భగీరథుడైన సుభాష్ పాలేకర్‌తో సమావేశం ఏర్పాటు చేయిస్తామన్నారు.
పాలేకర్ వ్యవసాయ పద్ధతి పాటిస్తే రైతులకు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం రాదన్నారు. రైతులకు రుణాలివ్వడం గొప్పకాదని .. రైతులు అప్పుల కోసం ఎదురుచూడాల్సిన అవసరంలేని వ్యవసాయ పద్ధతిని అందించడమే గొప్ప అన్నారు. ప్రకృతి వ్యవసాయంలో 80 టన్నుల దిగుబడి సాధిస్తున్న చెరకు తోటల పరిశీలనకు జనవరి 17,18 తేదీల్లో రైతుల బృందాన్ని మహారాష్ట్ర పంపనున్నట్లు తెలిపారు.
ఇది ఆత్మహత్యలకు పరిష్కారం: పాలేకర్
తెలంగాణ, విదర్భతోపాటు దేశంలో తిష్టవేసిన వ్యవసాయ సంక్షోభానికి కారణం రసాయనిక, సేంద్రియ వ్యవసాయ పద్ధతులేనని సుభాష్ పాలేకర్ అన్నారు. రసాయనిక ఎరువులు, సేంద్రియ ఎరువులతో కూడా పని లేకుండా 90% సాగునీటిని, విద్యుత్‌ను ఆదా చేసుకుంటూ కచ్చితంగా దిగుబడులు పెంచుకోవడానికి పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో అవకాశం ఉందన్నారు. ఇది కల కా దని, దేశంలో 40 లక్షల మంది రైతులు ఇప్పటికే ఈ పద్ధతిని అనుసరిస్తున్నారన్నారు.
ఈ పద్ధతిని ప్రభుత్వం అధికారిక వ్యవసాయ విధానంగా ప్రకటిస్తే రైతుల ఆత్మహత్యలకు తావు లేదని, కేన్సర్, మధుమేహం వంటి వ్యాధులకు అడ్డుకట్ట వేయడానికీ ఇదే మార్గమని పాలేకర్ స్పష్టం చేశారు. తెలంగాణలో త్వరలో 8 రోజులపాటు ప్రత్యేక రైతు శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ శిబిరంలో జయశంకర్ వ్యవసాయ వర్సిటీ పరిశోధన సంచాలకులు డాక్టర్ రాజిరెడ్డి, పశుసంవర్థక శాఖ డెరైక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు, వ్యవసాయ శాఖ అదనపు సంచాలకులు ధర్మానాయక్, ఆత్మ డెరైక్టర్ విజయకుమార్ , 1500 మంది రైతులు పాల్గొన్నారు.