హన్మకొండ/జనగామ: రాష్ట్ర రైతాంగానికి రెండో విడత పెట్టుబడి సాయం కోసం రూ.5,965 కోట్ల నిధులు విడుదల చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. శుక్రవారం వరంగల్‌లోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో వరినాటు యంత్రాల క్షేత్ర ప్రదర్శనతోపాటు జనగామ మండలం పెంబర్తి గ్రామంలో జరిగిన హరితహారం, రైతు బీమా బాండ్ల పంపిణీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పోచారం స్వయంగా యంత్రాన్ని నడిపి నాటు వేసి రైతులకు అవగాహన కల్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ మొదటి విడత పెట్టుబడి సాయం కోసం రూ.6 వేల కోట్లు కేటాయించగా, ఇందులో రూ.5,670 కోట్లను రైతులకు అందించినట్లు తెలిపారు. రూ.5 లక్షల బీమా వర్తించేలా 18 నుంచి 59 ఏళ్లు ఉన్న ప్రతి రైతుకు ఇన్సూరెన్స్ చేయిస్తున్నామని, ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల మంది రైతులకు రూ.636 కోట్ల బీమా డబ్బులు చెల్లించినట్లు వివరించారు. రైతుది కష్టపడే సంస్కృతి అని, భిక్షమెత్తే సంస్కృతి కాదని, ఇలాంటి రైతును చేయి చాపే పరిస్థితులను గత ప్రభుత్వాలు తీసుకొచ్చాయని దుయ్యబట్టారు.
రైతులను అప్పుల ఊబిలో నుంచి బయటపడేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయాన్ని ఒక క్రమపద్ధతిలో ఆవిష్కరిస్తున్నారన్నారు. రైతులు వ్యవసాయ యాంత్రీకరణను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి సాధించాలని ఆయన కోరారు. ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వ్యవసాయం వైపు యువత అడుగులు వేయడం మంచి పరిణామమన్నారు. కార్యక్రమాల్లో శాసనమండలి విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment