
పరిచయస్తులే కాలనాగులు!
కన్నుమిన్నూ కానక అత్యా చారానికి పాల్పడే దుర్మార్గుల్లో 99 శాతం ఇరుగు పొరుగువారు, పరిచయస్తులేనని పోలీసు శాఖ స్పష్టంచేసింది.
⇒ 12 జిల్లాల్లో అత్యాచార ఘటనలపై పోలీసుల విశ్లేషణ
⇒ 418 కేసుల్లో 416 మంది నిందితులు ఇరుగుపొరుగువారే
⇒ బాధితుల్లో అధికశాతం 15 నుంచి 18 ఏళ్లలోపు వారే
⇒ నిందితుల్లో ఎక్కువ మంది 18 నుంచి 25 ఏళ్ల వారు
⇒ ఇండియన్ పోలీస్ జర్నల్, అమెరికన్ జర్నల్‌కు స్టడీ రిపోర్ట్!
సాక్షి, హైదరాబాద్: కన్నుమిన్నూ కానక అత్యా చారానికి పాల్పడే దుర్మార్గుల్లో 99 శాతం ఇరుగు పొరుగువారు, పరిచయస్తులేనని పోలీసు శాఖ స్పష్టంచేసింది. ఈమేరకు రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచార కేసులపై ఇటీవల ఓ విశ్లేషణ చేసింది. బాధితులిచ్చిన ఫిర్యాదు కాపీల నుంచి పోలీసులు వేసిన చార్జిషీట్లదాకా అధ్యయనం చేసి.. జరిగిన ఘటనలు, నిందితుల విషయాలతో ఒక నివేదికను రూపొందించింది. 2016లో హైదరాబాద్ జోన్ పరిధిలోని 12 జిల్లాల్లో నమోదైన అత్యాచార కేసులపై ఈ అధ్యయనం జరిగింది. బాధితుల సామాజిక వర్గాలు, నిందితుల వివరాలన్నింటినీ సేకరించి ఏటా ప్రచురించే ఇండియన్ పోలీస్ జర్నల్, అమెరికన్ జర్నల్‌కు ఈ నివేదికను పంపించినట్టు తెలిసింది.
15 నుంచి 18 ఏళ్ల మధ్య వారే అధికం!
అత్యాచార ఘటనల్లో అధిక శాతం బాధితులు 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వారే ఉన్నారు. పోలీసులు విశ్లేషించిన 418 కేసుల్లో 203 మంది ఈ వయసు వారే. బాధితుల్లో 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారు 80 మంది, 10 నుంచి 15 ఏళ్ల వయసున్న బాలికలు 77 మంది ఉన్నారని అధ్య యనంలో తేలింది. అంతేకాదు బాధితుల్లో అధిక శాతం (దారిద్య్రరేఖకు దిగువన ఉన్న (బీపీఎల్) పేదవారేనని వెల్లడైంది. పరిశీలించిన 418 కేసుల్లో 354 మంది బాధితులు పేదవారుకాగా.. 64 మంది మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారిగా గుర్తించారు.
అధికశాతం నిందితులు యువకులే
అత్యాచార కేసుల్లో నిందితులుగా ఉన్న వారిలో 18–25 ఏళ్లలోపు వారే ఎక్కువగా ఉన్నట్టు అధ్యయనంలో తేలింది. తర్వాతి స్థానంలో 25–30 ఏళ్లలోపు వారున్నారని గుర్తించారు. 50 ఏళ్లకు పైన వయసున్న 10 మంది సైతం అత్యాచార కేసుల్లో నిందితులుగా ఉండటం గమనార్హం. ఇక నిందితుల ఆర్థిక పరిస్థితులపైనా పోలీసులు అధ్యయనం చేశారు. నిందితుల్లో 323 మంది పేదవారేనని, 91 మంది మధ్యతరగతి కుటుంబీ కులని గుర్తించారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లోని 2 కేసుల్లో ఇద్దరు నిందితులు ఆర్థికంగా ఉన్నవారిగా తేలిందని నివేదికలో పేర్కొన్నారు.
సామాజికపరంగా బాధితులు–నిందితులు
అత్యాచార బాధితుల సామాజిక స్థితిగతులపైనా పోలీస్ ఉన్నతాధికారులు అధ్యయనం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారిపై అధికంగా అత్యాచారాలు జరుగుతున్నాయని గుర్తించారు. ఓసీ సామాజిక వర్గాల్లోని మహిళలపైనా లైంగిక దాడులు జరిగినట్టు నివేదికలో పేర్కొన్నారు. 418 కేసుల్లో.. 204 మంది ఎస్సీ/ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన బాధితులుండగా, బీసీలు 189, ఓసీ వర్గాలకు చెందిన వారు 25 మంది ఉన్నారు. అదే విధంగా నిందితుల సామాజిక వర్గాలపైనా పోలీసులు అధ్యయనం చేశారు. నిందితుల్లో అధిక శాతం బీసీ సామాజిక వర్గాల వారే ఉన్నట్టు గుర్తించారు. 418 కేసుల్లో 212 మంది నిందితులు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారని, 181 మంది ఎస్సీ/ఎస్టీ, 23 మంది ఓసీ వర్గాలకు చెందినవారని నివేదికలో పేర్కొన్నారు.
చదువుపరంగా కూడా..
బాధితులు, నిందితుల విద్యాస్థాయిని కూడా పోలీసులు పరిశీలించారు. బాధితుల్లో పదో తరగతి లోపు చదువుకున్న వారు 259 మంది ఉన్నారని, 133 మంది ఇంటర్, 25 మంది డిగ్రీ, ఒకరు పీజీ చదివినవారు ఉన్నారని గుర్తించారు. అదే నిందితుల్లో పదో తరగతిలోపు చదువుకున్న వారే 239 ఉన్నారని, 129 మంది ఇంటర్, 42 మంది డిగ్రీ, ఆరుగురు పీజీ చేసిన వారున్నారని నిర్ధారించారు. ఈ 418 కేసుల్లో 244 కేసులు దర్యాప్తులో ఉన్నాయని.. 166 విచారణ కొనసాగుతున్న కేసులని, 4 తప్పుడు కేసులు, మరో 4 కేసులు చార్జిషీట్ దశలో ఉన్నాయని పోలీసులు తమ నివేదికలో పేర్కొన్నారు.