
హార్లీ డేవిడ్‌సన్ బైక్ దొంగ దొరికాడు..
హైదరాబాద్ : ట్రయిల్ రన్ అంటూ ఖరీదైన ..హార్లీ డేవిడ్‌సన్ బైక్‌తో ఉడాయించిన దొంగను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. అతడిని ముంబైలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా నిందితుడు ఓఎన్జీసీలో సబ్ మెరైన్ ఇంజినీర్గా పని చేస్తున్నట్లు సమాచారం. అతడిని ముంబై నుంచి హైదరాబాద్ తరలిస్తున్నారు.
రెండు రోజుల క్రితం బంజారాహిల్స్ సాగర్ సొసైటీ చౌరస్తాలో ఉన్న హార్లీ డేవిడ్‌సన్ షోరూంకు మంగళవారం ఆధునిక దుస్తుల్లో వచ్చిన ఓ యువకుడు ....టెస్ట్ డ్రైవ్ అంటూ ఆ బైక్తో పరారైన విషయం తెలిసిందే. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-23లో తన నివాసమని పేరు సయ్యద్ తాహెర్ అని పరిచయం చేసుకున్న ఆ యువకుడు కొత్తగా వచ్చిన రూ.6 లక్షల విలువైన హార్లే డేవిడ్సన్ స్ట్రీట్-750 మోడల్ బైక్ కావాలంటూ బేరమాడాడు.
తనతోపాటు తెచ్చిన క్రెడిట్ కార్డులను చూపించాడు. ట్రయల్ వేస్తానని బైక్‌తో బయటకు వెళ్లిన తాహెర్ మూడు గంటలు గడిచినా తిరిగి రాకపోయేసరికి అనుమానం వచ్చిన షోరూం నిర్వాహకులు అతడు ఇచ్చిన నంబర్‌కు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ అని వచ్చింది. దీంతో షోరూం మేనేజర్ షీలా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు...నాలుగు బృందాలుగా ఏర్పడి బైక్ దొంగను ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.