కేసులు సరే.. ఆధారాలేవి? | police fail to produce evidence for various cases | Sakshi
Sakshi News home page

కేసులు సరే.. ఆధారాలేవి?

Published Tue, Dec 15 2015 2:03 AM | Last Updated on Tue, Aug 21 2018 5:52 PM

police fail to produce evidence for various cases

* సేకరించడంలో పోలీసులు విఫలం
* సులువుగా తప్పించుకుంటున్న నిందితులు


 సాక్షి, హైదరాబాద్: దర్యాప్తు అధికారులు చేసే చిన్న పొరపాటు నిందితుడికి అనుకూలంగా మారుతోంది. ఘటన అనంతరం నిందితుడ్ని పట్టుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసే పోలీసులు... అదే సమయంలో కోర్టులో కేసు నిలదొక్కుకునేందుకు జాగ్రత్తలు తీసుకోకపోవడం నేరగాళ్లకు వరమవుతోంది. కోర్టుల్లో ఏళ్ల తరబడి విచారణ జరిగినా... చివరకు నేరం నిరూపించే ఆధారాలు లేకపోవడంతో నిందితులు సులువుగా బయటపడుతున్నారు. దీనిపై డీజీపీ అనురాగ్‌శర్మ దృష్టి సారించారు.  

 ఆ ఉత్సాహం ఏమవుతోంది!
గతంలో... హైదరాబాద్‌లో ఒకే కుటుంబంలో ఐదుగుర్ని హత్య చేసిన కేసులో పోలీసులు అరెస్టు చేసిన నిందితుడికి సంబంధించి ఆధారాలు లేవనే కారణంతో కోర్టు అతడిని నిర్దోషిగా ప్రకటించింది. 2006లో ఓడియన్ థియేటర్‌లో జరిగిన పేలుడులో పోలీసులు కీలక నిందితుడిగా పేర్కొన్న జియా ఉల్‌హక్ విషయంలోనూ ఇదే జరిగింది. సుదీర్ఘ విచారణ అనంతరం సరైన ఆధారాలు లేవన్న కారణంతో న్యాయస్థానం అతడిని నిర్దోషిగా పేర్కొంది. దేశ భద్రతకు సంబంధించిన సమాచారం బయటి వారికి చేరవేశాడనే అభియోగంపై గతంలో ఆర్మీ జవాన్ పతన్‌పై కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. పతన్ నుంచి స్వాధీనం చేసుకున్న కంప్యూటర్, ల్యాప్‌టాప్ ఇతర పరికరాలు దర్యాప్తు అధికారులు సీజ్ చేసి వాటిలో కొన్నింటిని వివరాల నిమిత్తం ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపించారు. అయితే వివరాల కోసం పంపిన సామగ్రికి... వారు అడుగుతున్న సమాచారానికి సంబంధం లేకుండా ఉండటంతో ఎఫ్‌ఎస్‌ఎల్ అధికారులు సరైన వాటిని పంపించాల్సిందిగా కోరారు. దీంతో పోలీసులు చేతులెత్తేశారు. ఇలాంటివెన్నో..!

 నిర్లక్ష్యం తగదు...: ఈ క్రమంలో... కేసుల్లో కీలకమైన ఆధారాల విషయంలో ఎటువంటి పొరపాట్లకూ తావివ్వద్దని సిబ్బందికి డీజీపీ అనురాగ్‌శర్మ ఆదే శాలిచ్చినట్లు సమాచారం. సైబర్ నేరాలకు సంబంధించిన ఫిర్యాదుల్లో కంప్యూటర్లు, హార్డ్‌డిస్క్‌ల నుంచి సేకరించాల్సిన ఫైల్స్ విషయంతో పాటు వాటిని భద్రపరచడంపై కూడా దృష్టి సారించాలన్నారు.ఆధారాలను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరెటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్)కి పంపేటప్పుడు నిర్లక్ష్యం వహించవద్దన్నట్టు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement