పోలీస్ రిపోర్ట్!
గత ఏడాది పనితీరుపై ప్రజలకు నివేదిక
ఠాణాల వారీగా సమావేశాల నిర్వహణ
ప్రజల ఆకాంక్షలూ తెలుసుకునేలా చర్యలు
ఆదేశించిన కొత్వాల్ మహేందర్‌రెడ్డి
సిటీబ్యూరో: నగర పోలీసులకూ ‘ప్రోగ్రెస్ రిపోర్ట్’ ఉండనుంది... దీన్ని అధికారులు తమ పరిధిలో నివసించే ప్రజలకు ‘అందించనున్నారు’... ఏడాదికి ఒకసారి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి వార్షిక పనితీరు నివేదికను వారి ముందు ఉంచడంతో పాటు భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తున్నారు. ప్రజల నుంచి వారి ఆకాంక్షలు, అవసరాలను తెలుసుకుంటూ అందుకు తగ్గట్టు చర్యలు తీసుకోనున్నారు. దీనికి సంబంధించి నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆయా సమావేశాల నిర్వహణ, ప్రగతిని ప్రతి రోజూ స్వయంగా పర్యవేక్షించాలనీ నిర్ణయించారు.
ఏళ్ళుగా మూసధోరణిలోనే...
ప్రతి ఏడాదీ డిసెంబర్ ఆఖరి వారంలో పోలీసు విభాగం వార్షిక నివేదికలు విడుదల చేస్తుంటుంది. రాష్ట్ర స్థాయిలో డీజీపీ, కమిషనరేట్లలో పోలీసు కమిషనర్లు యాన్యువల్ రౌండప్స్‌గా పిలిచే వార్షిక విలేకరుల సమావేశాలు నిర్వహిస్తుంటారు. వీటిలో గత ఏడాది పోలీసులు తీసుకున్న చర్యల్ని వివరిస్తూ ఆ కారణంగా నేరాల సంఖ్యలో నమోదైన హెచ్చుతగ్గుల్ని వివరిస్తారు. రాష్ట్ర, కమిషనరేట్ స్థాయిలో ప్రాథమిక భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికల్నీ ప్రకటిస్తుంటారు. ఏళ్ళుగా ఇదే మూసుధోరణిలో సాగుతున్న విధానానికి నగర పోలీసు కమిషనర్ స్వస్థి చెప్పారు. ఓపక్క నగర స్థాయిలో కమిషనర్ వార్షిక నివేదికలు, కార్యాచరణ ప్రణాళికలు ప్రకటించినప్పటికీ... మరోపక్క స్థానికుల మనోభావాలను అనుగుణంగా పని చేయడానికి ఈ విధానాన్ని వికేంద్రీకరించారు.
ఠాణాల వారీగా ప్రత్యేక మీటింగ్స్...
ఇందులో భాగంగా ప్రతి స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) తన ఠాణాకు సంబంధించి కమ్యూనిటీ సంఘాలు, వెల్ఫేర్ అసోసియేషన్లతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తారు. ఇందులో ఆ ప్రాంతానికి సంబంధించిన కీలక వ్యక్తులకూ ప్రాధాన్యం ఇస్తారు. ఆ సమావేశంలో గత ఏడాది పోలీసు పనితీరును ప్రజలకు నివేదిస్తారు. ఈ ఏడాది మరింత మెరుగైన పోలీసింగ్ కోసం తీసుకోనున్న చర్యల్నీ ప్రవేశపెడతారు. వీటికి అదనంగా ప్రాంతాల వారీగా స్థానికులకు ఉన్న సమస్యలు ఏంటన్నది తెలుసుకోవడంతో పాటు వాటి పరిష్కారానికి అవసరమైన చర్యల్ని భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికల్లో చేరుస్తారు. తమ విధి విధానాల్లో మార్పులకు సంబంధించి ఏవైనా సూచనలు, సలహాలు వస్తే వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తారు. తక్షణం అమలు చేసేవి, మార్పు చేర్పులకు అవకాశం ఉన్న వాటికి ప్రాధాన్యం ఇస్తూ అమలులోకి తీసుకువస్తారు. సిబ్బంది, ఆర్థిక భారాలతో కూడిన అంశాలను ఉన్నతాధికారులకు నివేదిక రూపంలో అందిస్తారు.
అన్నీ క్రోడీకరించి నగర స్థాయిలో...
సిటీ కమిషనరేట్ పరిధిలో రెండు రోజుల క్రితం ఈ విధానం ప్రారంభమైంది. ఇప్పటికే కొన్ని పోలీసుస్టేషన్ల పరిధిలో పూర్తికాగా.. గరిష్టంగా పది రోజుల్లో అన్నింటిలోనూ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. కమ్యూనిటీ హాళ్ళు, సమావేశ మందిరాలు వంటి బహిరంగ ప్రదేశాల్లో నిర్వహిస్తున్న ఈ మీటింగ్స్‌లో ప్రజల నుంచి వచ్చి సూచనలు, సలహాలతో పాటు ఫిర్యాదుల్నీ క్రోడీకరించి కమిషనరేట్‌కు పంపిస్తారు. వీటిని అధికారులకు అధ్యయనం చేయడం ద్వారా తమ దృష్టికి ఏవైనా లోపాలు వస్తే వాటిని సరిదిద్దడంతో పాటు నూతన విధానాలకు సంబంధించిన సలహాలు, సూచనలు తారసపడితే అన్నింటినీ క్రోడీకరిస్తారు. సిటీలోని అన్ని ఠాణాలను నుంచి వచ్చిన వాటిలో కీలకమైన, అచరణకు అనువైన వాటిని ఎంపిక చేసుకుని నగర వ్యాప్తంగా అమలయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేస్తారు.
కేస్ స్టడీస్‌తో అవగాహన పెంచేలా...
ప్రస్తుతం నగర పోలీసు విభాగం కమ్యూనిటీ పోలీసింగ్, కమ్యూనిటీ సీసీ కెమెరాలు వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తోంది. ప్రజా భద్రతా చట్టాన్ని పక్కాగా అమలు చేస్తున్న పోలీసులు వ్యాపార, వాణిజ్య సముదాయాలతో పాటు కాలనీల్లోనూ భారీగా సామూహిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. దీనికోసం పోలీసుస్టేషన్ల వారీగా ప్రయత్నాలు చేస్తూ ఏర్పాటయ్యేలా కృషి చేస్తున్నారు. ఈ వార్షిక సమావేశాలను సైతం ప్రజలకు ఈ కోణంలో అవగాహన కలిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా నగరంలో సీసీ కెమెరాలు, కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా కొలిక్కివచ్చిన కేసులు, ఒనగూడిన ప్రయోజనాలకు ప్రజలకు వివరిస్తున్నారు. ఈ ప్రత్యేక సమావేశాల నిర్వహణ తీరుతెన్నులపై నగర కొత్వాల్ ఎం.మహేందర్‌రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
గతేడాది నేరాల రేటు తగ్గింది
వెంగళరావునగర్: గడచిన రెండేళ్ళతో పోలిస్తే 2016 సంవత్సరం వెస్ట్‌జోన్ పరిధిలో చాలా వరకు నేరాల రేటు తగ్గిందని వెస్ట్‌జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు చెప్పారు. వెంగళరావునగర్ డివిజన్ పరిధిలోని మధురానగర్ కాలనీలో శుక్రవారం నేరాలు అరికట్టడంలో పోలీసులు, ప్రజల పాత్ర అనే విషయంపై ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన డీసీపీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ ప్రాంతంలోని ప్రజల సహకారం వల్లే నేరాలు తగ్గుముఖం పట్టినట్టు చెప్పారు. ఇటీవల టెక్నాలజీని సైతం వినియోగించుకుని నేరాలు అరికడుతున్నామన్నారు. ముఖ్యంగా సీసీ కెమెరాల ఏర్పాటుతో తాము నేరాల అదుపులో సఫలీకృతం అవుతున్నట్టు పేర్కొన్నారు. ఒకసారి నేరం చేసిన వానిని పట్టుకుని పీడీ యాక్ట్ ద్వారా జైల్లో ఉంచుతున్నామని, ఆ వ్యక్తి తిరిగి వచ్చిన తర్వాత అతనిపై నిఘాను ఉంచుతున్నట్టు చెప్పారు. ఎస్‌ఆర్‌నగర్ పీఎస్ పరిధిలో దాదాపు 137 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. 2015 కంటే గత ఏడాది చైన్ స్నాచింగ్స్ లాంటివి 90 శాతం తగ్గాయన్నారు. కార్యక్రమంలో పంజగుట్ట ఏసీపీ వెంకటేశ్వర్లు, ఎస్‌ఆర్‌నగర్ ఇన్‌స్పెక్టర్లు వాహిదుద్దీన్, సతీష్, పలువురు ఎస్‌ఐలు, కాలనీ ప్రతినిధులు కె.విశ్వప్రకాశ్, కోడె సాంబశివరావు, త్రిపురనేని సత్యనారాయణ, చిలకల వెంకటేశ్వరరావు, పీఎస్‌జీ కృష్ణశర్మ తదితరులు పాల్గొన్నారు.