
తెలంగాణపై చంద్రబాబు మరో కుట్ర
శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన చట్టంలో లొసుగులు ఉన్నాయంటూ.. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మరోకుట్ర పన్నుతున్నాడని, ఆయనకు కేంద్రమంత్రి వెంకయ్య వత్తాసు పలుకుతున్నాడని మండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. సీఎల్పీ కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పాటై ఆరు నెలలు గడిచాక ఇపుడు విభజన చట్టంలో లోపాలు వెదికి కాంగ్రెస్‌ను దోషిగా నిలబెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. ఖమ్మం జిల్లాలోని బూర్గంపాడు మండలంపై చంద్రబాబు కన్ను పడిందని, కిన్నెరసాని ప్రాజెక్టును కాజేయాలని చూస్తున్నాడని ఆరోపించారు. తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు మేల్కోవాలని, విహంగ వీక్షణం వదిలి భూప్రదక్షిణం చేపట్టాలన్నారు.