మహిళలకు సాధికారతను కట్టబెట్టాలి: ప్రణబ్
హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శనివారం హైదరాబాద్ లో మహిళా దక్షత సమితి స్థాపించిన బన్సీలాల్ మలానీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన దేశంలో ఆరోగ్య సంబంధిత మౌలిక సదుపాయాల కొరత పట్ల ఆందోళనను వ్యక్తం చేశారు. దీనికి ఒకే ఒక దీర్ఘకాలిక పరిష్కారం .. పౌర సమాజంతో పాటు ప్రభుత్వ, ప్రయివేటు స్టేక్ హోల్డర్లతో కూడిన సహకార వ్యవస్థల నిర్మాణమేనని రాష్ట్రపతి అభిప్రాయపడ్డారు. వాస్తవానికి ఆరోగ్యం, విద్య, జీవనోపాధి వంటి అభివృద్ధిదాయక లక్ష్యాలను ప్రభుత్వం ఒక్కటే సాధించజాదన్నారు. ఆ తరహా సహకార వ్యవస్థలు అందరికీ ఉపయుక్తంగా ఉంటాయని రాష్ట్రపతి వివరించారు.
దేశంలో దాదాపుగా 2.4 మిలియన్ మంది నర్సుల లోటు ఉందని, 2009లో సుమారు 1.65 మిలియన్ మంది నర్సులు ఉండగా 2015కల్లా ఈ సంఖ్య 1.56 మిలియన్ కు పడిపోయిందని ఆయన అన్నారు. ఇది కలత చెందవలసిన ధోరణిని సూచిస్తోందని చెప్పారు. అదే సమయంలో, మన మౌలిక సదుపాయాలను పరిశీలించినా కూడా 5000 పట్టణాలు, 4 లక్షల గ్రామాలలో 130 కోట్ల మంది ప్రజానీకం నివసిస్తుంటే కేవలం 1.53 లక్షల సబ్ సెంటర్లు, 85000 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఇంచుమించు ఐదువేల కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఉన్నాయని వివరించారు.
ప్రభుత్వం ఒక్కటే కృషి చేసే బదులు స్టేక్ హోల్డర్లు అందరూ ప్రాతినిధ్యం వహించగలిగిన నమూనాల వైపు చూడడం అత్యవసరం అని రాష్ట్రపతి సూచించారు. మహిళల సాధికారత దిశగా మహిళా దక్షత సమితి పోషిస్తున్న ప్రముఖ పాత్రను రాష్ట్రపతి ప్రశంసించారు. శ్రీమతి సుమన్ కృష్ణకాంత్, ప్రొఫెసర్ ప్రమీలా దండావతే, గోవా గవర్నర్ శ్రీమతి మృదుల సిన్హా ల వంటి సమితి వ్యవస్థాపక సభ్యుల సేవలను రాష్ట్రపతి గుర్తుచేశారు. విద్య, ఆర్థిక స్వీయ ఆధీనతను ప్రోత్సహించడం, వ్యక్తులకు వారి సంపూర్ణ సామర్థ్యాన్ని ఆవిష్కరించగలిగేటటువంటి అవకాశాలను కల్పించడం ద్వారా మాత్రమే మహిళల సిసలైన సాధికారత సాధ్యపడుతుందని ఆయన చెప్పారు. భారతదేశంలో మొత్తంమీద సగటు అక్షరాస్యత 74 శాతంగా ఉండగా, మహిళలకు సంబంధించినంతవరకు అక్షరాస్యత 65 శాతం కన్నా తక్కువగా ఉండడం దురదృష్టకరమని రాష్ట్రపతి అన్నారు.
మహిళలకు సాధికారతను కట్టబెట్టని సమాజం పరాజిత సమాజంగా మిగులుతుందన‍్న ఆయన మహిళలకు సాధికారత దిశగా చేసే ప్రయత్నాలను పెంచాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్తేయ, గవర్నర్ నరసింహన్, ఉప ముఖ్యమంత్రి మొహమద్ అలీ తదితరులు పాల్గొన్నారు.