‘ప్రైవేటు’లోనూ రిజర్వేషన్లు అవసరం
కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయు
హైదరాబాద్: ప్రైవేటు రంగంలోనూ ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు అవసరమని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. ఆలిండియా ఎస్సీ, ఎస్టీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో ఉన్న విశ్వేశ్వరయ్య భవన్‌లో జరిగిన సెమినార్‌లో ఆయన మాట్లాడారు. ‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో 85 శాతం మంది దళితులకు ఏ రకమైన భూమి లేదు. ఎన్నో ఏళ్లుగా వీరంతా అసమానతకు గురవుతున్నారు. ఎస్సీ, ఎస్టీలకు చేయూతనిచ్చేందుకు, వారిని పారిశ్రామికంగా ముందుకు తీసుకు వెళ్లేందుకు కృషి చేస్తున్నాం.’ అని అన్నారు.
న్యాయ వ్యవస్థలోనే రిజర్వేషన్లు అమలు కావడం లేదని, కుల ధ్రువీకరణ పత్రాల కోసం అవస్థలు పడాల్సి వస్తోందని సొసైటీ అధ్యక్షుడు మురళీధర్‌రావు మంత్రి దృష్టికి తీసుకురాగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే 24 గంటల్లో సర్టిఫికెట్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలకు సూచిస్తామన్నారు. మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ హాస్టళ్లలో అన్ని సౌకర్యాలు, ఎస్సీలకు మూడు ఎకరాల భూమి, డబుల్ బెడ్‌రూం ఇళ్లు వంటివి చేపడుతున్నామని చెప్పారు. సెమినార్‌లో టీఆర్‌ఎస్ చీఫ్‌విప్ కొప్పు ల ఈశ్వర్, మాజీ మంత్రి గీతారెడ్డి, ప్రజాగాయకుడు గద్దర్, వేములపల్లి వెంకట్రామయ్య, ఎం.జానయ్య పాల్గొన్నారు.