క‘న్నీళ్ల్లు’ | Public water taps | Sakshi
Sakshi News home page

క‘న్నీళ్ల్లు’

Published Fri, Jan 24 2014 4:08 AM | Last Updated on Sat, Sep 2 2017 2:55 AM

క‘న్నీళ్ల్లు’

క‘న్నీళ్ల్లు’

  •      తీరని పేదల దాహార్తి
  •      తగ్గిపోతున్న పబ్లిక్ కుళాయిలు
  •      కేంద్రం ఆదేశాలూ బేఖాతర్
  •      జలమండలి తీరుపై ఆందోళన
  •  
     సాక్షి, సిటీబ్యూరో: హైటెక్ సిటీలో పేదల దాహార్తిని తీర్చేందుకు అందుబాటులో ఉన్న పబ్లిక్ ట్యాప్స్ 2559 మాత్రమే అంటే ముక్కున వేలేసుకోవాల్సిందే. గత ఐదేళ్లుగా ప్రజాకుళాయిలకు దశలవారీగా మంగళం పాడడంతో నగరంలో గుక్కెడు మంచి నీళ్లు దొరక్క పేదలు విలవిల్లాడుతున్నారు. ఒకవైపు దారిద్య్ర రేఖకు దిగువనున్న నిరుపేదలకు కుళాయి కనెక్షన్ ఇవ్వడానికి సవాలక్ష నిబంధనలు పెడుతున్న జలమండలి... మరోవైపు నిరుపేదలు గొంతు తడుపుకొనేందుకు అవసరమైన ప్రజా నల్లాలను సైతం కనుమరుగు చేసేస్తోంది.
     
     దేశరాజధాని ఢిల్లీలో నిరుపేద కుటుంబాలకు నెలకు 20 వేల లీటర్ల చొప్పున ఉచితంగా మంచినీటిని సరఫరా చేసేందుకు ఢిల్లీ జలబోర్డు ముందుకు రాగా.. రాష్ట్ర రాజధానిలో మాత్రం పేదల దాహార్తిని తీర్చే విషయాన్ని గాలికొదిలి నీటిచార్జీలను పలుమార్లు పెంచేందుకు జలమండలి తహతహలాడుతుండడం దారుణం. ప్రపంచ బ్యాంకు మార్గదర్శకాల మేరకు పేదల నల్లాలను తొలగిస్తున్న జలమండలి తీరుపై ప్రజాసంఘాలు, విపక్షాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.
     
     కాగితాలపైనే మార్గదర్శకాలు
      ‘ది హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ యాక్ట్, 1989’ సెక్షన్-28 ప్రకారం..పేదల బస్తీలు, పబ్లిక్ ప్రదేశాల్లో ప్రజా కుళాయిల ఏర్పాటు బాధ్యత జలమండలిదే.
     
      నగరపాలక సంస్థ చట్టం ప్రకారం 200 పేద కుటుంబాలు నివసించే చోట విధిగా ప్రజా కుళాయి ఉండాలి.
     
     తొలినాళ్లలో ఈ నిబంధన నగరంలో బాగానే అమలైనా ప్రస్తుతం దశలవారీగా కనుమరుగవుతోంది.
     
     ఐదేళ్ల క్రితం జీహెచ్‌ఎంసీ పరిధిలో 6559 పబ్లిక్ కుళాయిలుండేవి.
     
     వీటి ద్వారా నిత్యం 3 మిలియన్ గ్యాలన్ల మంచినీటిని సరఫరా చేసేవారు.
     
     వీటిలో సుమారు 2000 కుళాయిలు అవసరం లేని చోట ఉన్నాయంటూ దశలవారీగా తొలగించారు.
     
     మరో 2000 కుళాయిలకు మరమ్మతులు చేపట్టకపోవడంతో శిథిలావస్థకు చేరుకున్నాయి.
     
      తెల్ల రేషన్‌కార్డున్న పేదలు రూ.200 చెల్లిస్తే అదీ పైప్‌లైన్ అందుబాటులో ఉంటే కనెక్షన్ ఇస్తామంటోంది జలమండలి.
     
     ఫలితంగా సుమారు 460 మంది పేదలు ఆరునెలలుగా కుళాయి కనెక్షన్ కోసం ఎదురు చూస్తున్నారు.
     
     అన్నీ కుంటిసాకులే
     పబ్లిక్ కుళాయిలపై నియంత్రణ సరిగా లేకపోవడంతో భారీగా మంచినీరు వృథా అవుతోందంటూ జలమండలి గతఐదేళ్లుగా సుమారు రెండువేలకుళాయిలను దశలవారీగా తొలగించింది.
     
     అసలు విషయం ఏమిటంటే.. వేళాపాళా లేకుండా అర్ధరాత్రి నీటిసరఫరా అవుతుండడంతో నీరు వృథా అవుతోంది.
     
     మరికొన్ని చోట్ల చెత్తకుప్పలు, అపరిశుభ్ర పరిస్థితులుండటంతో స్థానికులు పబ్లిక్ కుళాయి వద్దకు వెళ్లక నీరు వృథా అవుతోంది.
     
      ఇక మరో రెండు వేల కుళాయిలకు మరమ్మతులు చేపట్టకపోవడం వల్ల దీనావస్థకు చేరుకున్నాయి.
     
     నగరంలో రహదారుల విస్తరణ, విద్యుత్, టెలిఫోన్ కేబుల్‌వైర్ల కోసం తవ్వకాలు చేపట్టడం, బహుళ అంతస్తుల భవన నిర్మాణం సమయంలో  చెత్త, మట్టి పడవేయడంతో కొన్ని భూమిలో కూరుకుపోయాయి.
     
     వీటిని పునరుద్ధరణను అధికారులు విస్మరించారు.
     
     దీంతో ప్రస్తుతం పూర్తిస్థాయిలో పనిచేస్తున్న స్థితిలో ఉన్నవి 2559 మించి లేవని బోర్డు వర్గాలే అంగీకరిస్తుండడం గమనార్హం.
     
     పాతనగరం, బాలానగర్, జీడిమెట్ల, మెహిదీపట్నం, సికింద్రాబాద్, మలక్‌పేట్, చంచల్‌గూడా, సైదాబాద్ తదితర ప్రాంతాల్లోని బస్తీల్లోని ప్రార్థనాస్థలాలు, ప్రభుత్వ పాఠశాలలున్న చోట కూడా పబ్లిక్ నల్లాలను పునరుద్ధరించాలన్న విషయాన్ని జలమండలి విస్మరించింది.
     
     ఉచిత నీటి సరఫరా సాధ్యమే
     జీహెచ్‌ఎంసీ ఏటా వసూలు చేస్తున్న ఆస్తిపన్ను సుమారు రూ.1500 కోట్లలో 20 శాతం జలమండలికి చెల్లిస్తే గ్రేటర్ పరిధిలోని అల్పాదాయ, మధ్యాదాయ వర్గాలకు చెందిన 4 లక్షల గృహ వినియోగ కుళాయిలకు ఉచితంగా మంచినీరు సరఫరా చేయవచ్చు. వాటర్‌బోర్డుకు రావాల్సిన రూ.870 కోట్ల పెండింగ్ నీటి బిల్లు బకాయిలను తక్షణం వసూలు చేయాలి. మంచినీటి సరఫరాకు అవసరమైన విద్యుత్‌కు గృహవినియోగ చార్జీ మాత్రమే వసూలు చేస్తే నెలకు జలమండలి రూ.30 కోట్ల లాభం గడిస్తుంది.     

    - పద్మనాభరెడ్డి, ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ ప్రతినిధి
     
     పబ్లిక్ కుళాయిలు ఉండాల్సిందే
     ప్రపంచ బ్యాంకు మార్గదర్శకాలు, మంచినీటి వృథా అన్న సాకులు చూపుతూ జలమండలి ప్రజా కుళాయిలకు దశలవారీగా మంగళం పాడుతుండటం దారుణం. బస్తీల్లో రెండు వందల కుటుంబాలు నివాసం ఉండే వీధులు, ప్రార్థనాస్థలాలు, పార్క్‌లు, ప్రభుత్వ ఆస్పత్రులు, బస్టాండ్లు, సాధారణ జనసంచారం అధికంగా ఉండే ఇతర పబ్లిక్ ప్రదేశాల్లో విధిగా పబ్లిక్ కుళాయిలు ఉండాల్సిందే. సరఫరా నష్టాలు కట్టడి చేస్తే మేలు జరుగుతుంది తప్ప పబ్లిక్ కుళాయిలు తొలగించడం సరికాదు.
     - ప్రొఫెసర్ డి.నరసింహారెడ్డి, చేతన సొసైటీ చీఫ్ మెంటార్
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement