రాష్ట్రంలో వరుసగా వెలుగుచూస్తున్న ర్యాగింగ్ ఘటనల్ని పోలీసు విభాగం సీరియస్‌గా తీసుకుంది.
* యోచిస్తున్న రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు
* ర్యాగింగ్ ఫ్రీ ఏపీపై త్వరలో నివేదిక
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వరుసగా వెలుగుచూస్తున్న ర్యాగింగ్ ఘటనల్ని పోలీసు విభాగం సీరియస్‌గా తీసుకుంది. ర్యాగింగ్ చేసిన వారిపై రౌడీషీట్ తెరవడంతో పాటు ఆ యా కళాశాలల యాజమాన్యాలనూ బాధ్యుల్ని చేయాలని భావిస్తోంది. ర్యాగింగ్ వ్యతిరేకంగా భారీగా ప్రచారం చేయడంతో పాటు రిషీ వ్యాలీ వంటి ప్రఖ్యాత స్కూళ్లలో ఉన్న మెంటారింగ్ విధానంపై కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో అవగాహన కల్పించాలని యోచిస్తోంది.
ర్యాగింగ్ ఫ్రీ ఏపీ స్థాపన కోసం రూపొందిస్తున్న కార్యాచరణ ప్రణాళికను త్వరలో ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయించింది. ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకూ సమన్లు జారీ చేయడం, భవిష్యత్తులో వీరికి పాస్‌పోర్ట్, ప్రభుత్వ ఉద్యోగం రాకుండా నివేదిక రూపొందించడం వంటి కఠిన నిర్ణయాలను ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. తీవ్రమైన స్థాయిలో ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థిని కాలేజీ నుంచి బహిష్కరించడం, మరోచోట అడ్మిషన్ లభించకుండా సర్టిఫికెట్లపై ‘ర్యాగర్’ స్టాంప్ వేయడం వంటి అంశాలనూ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని పోలీసు విభాగం నిర్ణయించింది.