
ధరల దరువు
- తెలంగాణ, ఏపీల్లో చుక్కలను తాకుతున్న నిత్యావసరాల ధరలు
- మార్కెట్‌కు వెళ్లాలంటేనే భయపడుతున్న జనం
- పేదలు రెండు పూటలా తినలేని దుస్థితి
- కిలో రూ. 200కు చేరిన పప్పుల ధరలు
- రెండింతలకుపైగా పెరిగిన కూరగాయలు
- సలసలా కాగుతున్న వంటనూనెలు
- వర్షాభావం, సాగు తగ్గడమే పెరుగుదలకు కారణం
- పేదలు విలవిల్లాడుతున్నా పట్టించుకోని ప్రభుత్వాలు
కొండెక్కిన పప్పులు.. భగ్గుమంటున్న కూరగాయలు.. మరుగుతున్న నూనెలు.. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ధరల దరువుకు సామాన్యులు విలవిల్లాడిపోతున్నారు. చుక్కలను తాకుతున్న నిత్యావసరాల ధరలతో అల్లాడుతున్నారు. నోట్లోకి ముద్ద దిగాలన్నా నోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితిలో పేద జనం లబోదిబోమంటున్నారు.
పప్పుల ధరలు 200 మార్కుకు చేరగా.. కూరగాయల ధరలు రెండింతలకు పైగా పెరిగాయి. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలు సరుకుల కోసం మార్కెట్‌కు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. గతంలో రూ. 1,500 ఖర్చుచేస్తే నెలకు సరిపడా సరుకులు వచ్చేవని... ఇప్పుడు రూ. 6 వేలు తీసుకెళితేగానీ చాలడం లేదని ప్రజలు వాపోతున్నారు. పేదలైతే పెరిగిన ధరలను చూసి పస్తులుండాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. ధరలు ఇంతగా పెరుగుతున్నా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నాయి. ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సి ఉన్నా కనీసం ఆ దిశగా ఆలోచన చేయడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు చుక్కలను తాకుతున్నాయి. డిమాండ్ మేరకు సరఫరా కాకపోవడంతో కూరగాయల ధరలు పెరుగుతూ పోతున్నాయి. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో ఆలుగడ్డ, బెండకాయ, చిక్కుడు, దొండకాయ ధరలు రూ. 20 నుంచి రూ.30 వరకు పలుకుతుండగా... టమాటా, వంకాయ, కాకర, బెండ, బీరకాయ కిలో రూ.30 నుంచి రూ.40 వరకు ఉన్నాయి. పచ్చిమిర్చి కిలో రూ. 42కి చేరింది. మొత్తంగా గత ఏడాదితో పోలీస్తే ఈ ధరలన్నీ రెండు నుంచి మూడు రెట్లు అధికంగా ఉండడం గమనార్హం.
రాష్ట్రంలో కూరగాయల సాధారణ సాగు 6 లక్షల ఎకరాలుకాగా... ఈ సారి 4 లక్షల ఎకరాలకు పడిపోయింది. మిరప 1.45 లక్షల ఎకరాలకుగాను ఇప్పటివరకూ పెద్దగా సాగు జరిగింది లేదు. దీంతో గత నెల కిలో రూ.25 పలికిన పచ్చిమిర్చి ధర అమాంతం రూ. 42కి పెరిగింది. అల్లం వెల్లుల్లి ధర పావుకిలోకే రూ.40 వరకు పలుకుతోంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా 4.67 లక్షల హెక్టార్లలో పప్పుధాన్యాలు సాగుకావాల్సి ఉండగా... ఈ సారి 3.17 లక్షల హెక్టార్లలోనే సాగయ్యాయి. దీంతో కందిపప్పు ధర ఏకంగా రూ.190కి చేరగా... మినపపప్పు ధర రూ.170కి పెరిగింది. పెసరపప్పు రూ. 135 నుంచి రూ. 150 మధ్య పలుకుతోంది. చివరికి ఆకుకూరల ధరలు కూడా రెండు మూడు రెట్లు పెరిగాయి. వంట నూనెల ధరలు కూడా గత ఏడాదితో పోలిస్తే 25% వరకు పెరిగాయి.
తగ్గిన దిగుమతులు: ఈ ఏడాది పొరుగు రాష్ట్రాల నుంచి కూరగాయల దిగుమతులు భారీగా తగ్గాయి. రాష్ట్రంలో వినియోగమయ్యే మొత్తం కూరగాయల్లో 32 శాతం మేర రాష్ట్రంలోనే ఉత్పత్తి అవుతుండగా... ఏపీ నుంచి 26 శాతం, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి 42 శాతం మేర దిగుమతి అవుతున్నాయి. కానీ ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పొరుగు రాష్ట్రాల్లో దిగుబడులు తగ్గాయి. దీంతో కర్నూలు, అనంతపురం, మదనపల్లిల నుంచి రాష్ట్రానికి రావాల్సిన టమాటా, ప్రకాశం, గుంటూరు, అనంతపురం నుంచి రావాల్సిన వంకాయ, బెంగళూరు, చిక్‌బళ్లాపూర్‌ల నుంచి రావాల్సిన బెండకాయ, చిక్కుడు, గోరుచిక్కుడు తదితరాల దిగుమతులు బాగా తగ్గిపోయాయి. గత ఏడాదిలో హైదరాబాద్ మార్కెట్‌లోకి 2,200 క్వింటాళ్ల మేర టమాటా రాగా ఈసారి 1,800 క్వింటాళ్లకు పడిపోయింది. వంకాయ, క్యాబేజీ, క్యారట్ సరఫరా సైతం గణనీయంగా తగ్గింది. ఇవన్నీ ధరల పెరుగుదలకు కారణమయ్యాయి.
ఖర్చులు బాగా పెరిగిపోయాయి..
‘‘ప్రతి నెలా ఇంటికి ప్రతి లెక్క రాసుకుని జాగ్రత్తగా ఖర్చుపెడతాం. కానీ కొద్ది రోజులుగా పప్పులు, కూరగాయల ధరలు పెరగడంతో ఖర్చులు బాగా పెరిగిపోయాయి. కనీసం ఉదయం పూట టిఫిన్ చేయడానికి ధైర్యం చాలడం లేదు.’’
- రచ్చ లావణ్య, బాగ్‌అంబర్‌పేట
కడుపునిండా తినలేని పరిస్థితి
‘‘రోజురోజుకూ ధరలు పెరిగిపోతుండడంతో ఏ వస్తువులూ కొనలేకపోతున్నాం. ప్రభుత్వం సబ్సిడీ ద్వారా అందిస్తామన్నా లాభం లేదు. మూడు పూటల సరిగ్గా తిండికూడా తినలేని పరిస్థితులు ఉన్నాయి.’’
- బి.అక్కమ్మ, బర్కత్‌పుర
ఏపీలో ధరాఘాతం!
సాక్షి, హైదరాబాద్: నిత్యావసర సరుకుల ధరలు అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోవడంతో ఆంధ్రప్రదేశ్‌లో పేద, దిగువ మధ్యతరగతి ప్రజలు సరుకుల కోసం మార్కెట్‌కు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. బియ్యం ధరలు కొత్త రికార్డులు సృష్టిస్తూ సామాన్యుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఉదాసీనంగా వ్యవహరించడం ద్వారా ధరల పెరుగుదలకు కారణమైన రాష్ట్రప్రభుత్వం వాటి నియంత్రణ దిశగా ఇప్పటికీ చర్యలు తీసుకోకుండా ప్రేక్షక పాత్ర పోషిస్తోంది.
దీంతో కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని గత వారం రోజులుగా రాష్ట్ర ప్రభుత్వాలతోనూ, ఉన్నతాధికారులతోనూ కలసి రోజూ సమీక్షలు నిర్వహిస్తోంది. పప్పుల ధరల కట్టడికి చర్యలు తీసుకోవాలని, అక్రమ నిల్వల వెలికితీతకు విజిలెన్స్ దాడులను ముమ్మరం చేయాలని కేంద్రం ఆదేశిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం చెవిటివాని చెవిలో శంఖం ఊదిన చందంగా తయారైంది. ఏపీ సీఎం చంద్రబాబు ఒక్కసారి కూడా వీటి గురించి కనీసం సమీక్షించిన దాఖలాలు లేకపోవడం ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం.
రూ. 200 దాటిన కందిపప్పు..
బహిరంగ మార్కెట్‌లో కిలో కంది పప్పు ధర రూ.200 దాటిపోయింది. కిలో మినప్పప్పు రూ.210కి చేరింది. ప్రస్తుతం మార్కెట్లో కందిపప్పు కంటే చికెన్ ధరే తక్కువగా ఉంది. కిలో చికెన్ రూ. 120 - 130 ఉంటే కంది, మినప్పప్పు ధరలు రూ. 200 పైగా ఉన్నాయి. జీలకర మసూర పాత బియ్యం కిలో రూ. 52 నుంచి రూ. 55 వరకూ ఉంది. కొత్త బియ్యం ధర కూడా నాణ్యతను బట్టి కిలో రూ. 40 నుంచి 46 వరకూ ఉంది. పల్లీలు, చింతపండు, ఎండుమిర్చి, వంట నూనెలతోపాటు అన్ని నిత్యావసరాల ధరలు 8 నెలల క్రితంతో పోల్చితే 40 నుంచి 50 శాతం వరకూ పెరిగాయి. జనవరి, ఫిబ్రవరి నెలల్లో కిలో రూ. 70 ఉన్న కందిపప్పు, మినప్పప్పు ధరలు ఇప్పుడు మూడు రెట్లు పెరిగాయి.
కూర‘గాయాలే’...: కూరగాయల ధరలూ అందుబాటులో లేకపోవడం ఇబ్బందిగా మారింది. కిలో ఉల్లిపాయల ధర మార్కెట్‌లో రూ. 35 నుంచి రూ. 40 వరకూ ఉంది. చింతపండు, మిరపకాయల ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. కిలో ఎండుమిర్చి రూ. 130పైగా ఉంది. నాణ్యమైన చింతపండు కిలో రూ. 130పైగా ఉంది. రూ. 25 నుంచి 30 వరకూ వెచ్చించనిదే కిలో పచ్చిమిర్చి రావడంలేదు.
భరించలేని భారం..
కొండెక్కిన రేట్లతో ఇంటిని నడపడం ఎంతో కష్టమవుతోంది. ఏడాదిలో బడ్జెట్ 50 శాతానికి పైగా పెరిగిపోయింది. ప్రభుత్వం పుణ్యమాని మినపపప్పు, కందిపప్పు రెట్టింపుకంటే పెరగడంవల్ల నచ్చిన టిఫిన్లు చేసుకోవడం మర్చిపోయాం. ఇడ్లీ, దోసెలు, పెసరట్లు చేయడమే లేదు. పప్పు వండడం తగ్గించుకున్నాం. రూ.50లకే రేషను కందిపప్పు ఇస్తామన్నారు... అదీ లేదు. రైతుబజార్లలో కుళ్లిపోయిన, నాణ్యతలేని కూరగాయలే దిక్కు.
- కె. రాజేశ్వరి, గృహిణి, విశాఖపట్నం