
ఆదివారం చాకలి పోరు గర్జన సభలో అభివాదం చేస్తున్న చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర కన్వీనర్ కొత్తకొండ శ్రీలక్ష్మి తదితరులు
హైదరాబాద్: 18 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో రజకులు ఎస్సీ జాబితాలో కొనసాగుతున్నారని, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం వారు బీసీ–ఏలో ఉండటం ఎంత వరకు సమంజసమని చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర కన్వీనర్ కొత్తకొండ శ్రీలక్ష్మి ప్రశ్నించారు. చాకలి కులస్తులను ఎస్సీ జాబితాలో చేర్చాలని, అందుకోసం అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధమని ప్రకటించారు. శ్రీలక్ష్మి నాయకత్వంలో జూలై 2న భద్రాచలంలో చేపట్టిన పాదయాత్ర ముగింపు కార్యక్రమం ‘చాకలి పోరు గర్జన’ఆదివారం సరూర్‌నగర్ స్టేడియంలో జరిగింది.
ఈ గర్జనకు బిహార్ మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే శ్యామ్ రజక, అఖిల భారత దోభీ మహాసంఘం అధ్యక్షుడు వి.చంద్రశేఖర్, హరియాణా ప్రతినిధి అమిత్ ఖత్రీ, రజక జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అంజయ్య హాజరయ్యారు. బహిరంగ సభలో శ్రీలక్ష్మి మాట్లాడుతూ.. ఒక దేశం, ఒకే వృత్తి, ఒకే రాజ్యాంగ పద్ధతిలో రజకులకు ఎస్సీ హోదా కల్పించాలని 70 ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నా పాలకులు పట్టించుకోవటం లేదన్నారు. ఎస్సీ జాబితాలో ఉంటేనే రజకులకు విద్య, ఉద్యోగ, ఉపాధి సాధ్యమన్నారు. రాష్ట్రంలో 30 లక్షల మంది రజకులు ఉంటే ఒక్క ఎమ్మెల్యే కూడా లేరని, ఎస్సీ రిజర్వేషన్లు ఉంటేనే చట్టసభల్లో ప్రాతినిథ్యం లభిస్తుందన్నారు. మూడున్నరేళ్లు గడుస్తున్నా రజక సహకార సంఘం నియామకం ఊసే లేదని, నిరుద్యోగ యువతకు రజక సహకార సంఘం ద్వారా నేరుగా ఒక్కో ఇంటికి రూ.5 లక్షల రుణాలు ఇవ్వాలని, ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
రజకుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకే..
రజకులకు ఎస్సీ హోదా కోసం 190 రోజుల పాటు 31 జిల్లాల్లో పాదయాత్ర చేశానని, విజయానికి దగ్గర్లో ఉన్నామని శ్రీలక్ష్మి పేర్కొన్నారు. తన పాదయాత్ర రాజకీయ లబ్ధి కోసం కాదని, రజకులను ఏకతాటిపైకి తీసుకురావటానికి.. వారిని చైతన్యపరచటానికే అని చెప్పారు. రజకుల సమస్యల పరిష్కారానికి ఏకైక మార్గం ఎస్సీ హోదానే అని తెలంగాణ ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్నామన్నారు. రజకుల రక్షణ కోసం అట్రాసిటీ చట్టం అవసరమన్నారు. అన్ని రాజకీయ పార్టీలకు సేవలందిస్తున్నామని, ఈ గర్జనకు ఆహ్వానం పలికితే ఒక్క పార్టీ స్పందించలేదని, తమకు గెలిపించే దమ్ము లేకపోయినా.. ఓడించే సత్తా ఉందని హెచ్చరించారు. రజకుల హక్కుల సాధనకు ఉద్యమమే శరణ్యమని, నిరంతర పోరాటానికి సిద్ధంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు.
గ్రామీణ ప్రాంతాల్లో నేటికీ అవమానాలే..
గ్రామీణ ప్రాంతాల్లో నేటికీ రజకులు అవమానాలు ఎదుర్కొంటున్నారని, రజకుల్లో ఐక్యత లేకపోవడమే దీనికి కారణమని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం చేసిన వీరవనిత చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకుని ఒక రాజకీయ శక్తిగా ఎదగాలని పిలుపునిచ్చారు. రజకుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని, ట్యాంక్‌బండ్‌పై ఐలమ్మ విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు రజకులను వెంటనే దళితులుగా గుర్తించి ఎస్సీ హోదా కల్పించాలని శ్యామ్ రజక డిమాండ్ చేశారు. రజకులకు న్యాయం జరగకపోతే 2019 ఎన్నికల్లో సత్తా చాటుతామన్నారు.