కీలక ప్రాంతాలపై డేగకన్ను
కొన్ని చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు
సిటీబ్యూరో:రంజాన్ పండుగ సందర్భంగా శనివారం జరుగనున్న సామూహిక ప్రార్థనలకు నగర, సైబరాబాద్ పోలీసులు పటిష్ట బందోబస్తు, భద్రతా ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, అపశ్రుతులకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చార్మినార్‌లోని మక్కామసీద్, మీరాలమ్ ఈద్గా, సికింద్రాబాద్‌లోని జామే మసీద్‌తో పాటు జంటకమిషనరేట్ల పరిధిలోని అనేక ప్రార్థనా స్థలాల వద్ద పోలీసులు డేగకంటి నిఘా ఏర్పాటు చేస్తున్నారు. సున్నిత, అనుమానాస్పద ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి నుంచే ప్రత్యేక పికెట్లు ఏర్పాటు చేశారు. కమిషనరేట్లలోని సిబ్బంది, అదనపు బలగాలు కలిపి మొత్తమ్మీద 12 వేల మంది పోలీసులు విధుల్లో ఉండనున్నారు. జంట కమిషరేట్ల పరిధిలో స్టాండ్ టూ ప్రకటించిన కమిషనర్లు సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. మఫ్టీ పోలీసుల నిఘాతో పాటు నగర భద్రతా వి భాగాల ఆధీనంలో బాంబు నిర్వీర్య బృందాలు కూడా పని చేయనున్నాయి.హోంగార్డులు నుంచి అడిషనల్ సీపీ స్థాయి అధికారుల వరకూ కూడా బందోబస్తులో పాల్గొంటారు. బందోబస్తును జంట కమిషనర్లు ఎం.మహేందర్‌రెడ్డి, సీవీ ఆనంద్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
మీరాలం, సికింద్రాబాద్ ఈద్గాల వద్ద ట్రాఫిక్ ఆంక్షలు...
రంజాన్ సందర్భంగా మీరాలం ఈద్గా, సికింద్రాబాద్ ఈద్గాల వద్ద ట్రాఫిక్ పోలీసులు వన్‌వేను ప్రవేశపెట్టారు. శనివారం ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని ట్రాఫిక్ అదనపు పోలీసు కమిషనర్ జితేందర్ ఒక ప్రకటనలో తెలిపారు.మీరాలం ఈద్గాకు వెళ్లే వాహనాలను పురానాపూల్, కామాటిపురా, కిషన్‌బాగ్, బహదూర్‌పూరా ఎక్స్‌రోడ్డులో అనుమతిస్తారు. ఈద్గా నుంచి బహదూర్‌పురా క్రాస్ రోడ్డు వెళ్లే వాహనాలను కిషన్‌బాగ్, కామాటిపురాల వద్ద మళ్లిస్తారు. ఈద్గా క్రాస్ రోడ్స్ నుంచి ఈద్గా వరకు సైకిల్ రిక్షాలను అనుమతించరు.
{పార్థనల కోసం శివరాంపల్లి, ఎన్‌పీఏ నుంచి వచ్చే వాహనాలను ఈద్గా దారిలో అనుమతిస్తారు. ఇతర వాహనాలను దానమ్మ హట్స్ టీ- జంక్షన్ వద్ద దారి మళ్లించి అలియాబాద్ వయా అన్సారీ రోడ్డు, జహనుమ, బాయ్స్ టౌన్ స్కూల్ నుంచి అనుమతిస్తారు.
ఈద్గా ప్రార్థనలు ముగియగానే పురానాపూల్ నుంచి వచ్చే వాహనాలను సిటీ కాలేజీ వైపు మళ్లిస్తారు. మీరాలం వద్ద అందరూ వెళ్లిపోయిన తర్వాత ట్రాఫిక్‌ను యథావిధిగా అనుమతిస్తారు.సికింద్రాబాద్ ఈద్గా వద్ద ప్రార్థనల సందర్భంగా బ్రూక్ బండ్ సెంటర్, సీటీఓ ఎక్స్ రోడ్డు నుంచి వచ్చే వాహనాలను ఈద్గా క్రాస్ రోడ్డు వద్ద మళ్లించి తాడ్‌బంద్‌వైపు మళ్లిస్తారు.
రంజాన్‌కు భారీ బందోబస్తు
Published Sat, Jul 18 2015 12:29 AM | Last Updated on Sun, Sep 3 2017 5:41 AM
Advertisement
Advertisement