అపోలోలో అరుదైన చికిత్స
ఛాతీపై కత్తిగాటు లేకుండానే గుండెవాల్వ్ రీప్లేస్‌మెంట్
- 80 ఏళ్ల వృద్ధుడికి విజయవంతంగా చికిత్స
- దేశంలోనే ఈ తరహా చికిత్స తొలిదని వైద్యుల వెల్లడి
సాక్షి, హైదరాబాద్: కొంతకాలంగా హృద్రోగ సమస్యతో బాధపడుతున్న 80 ఏళ్ల వృద్ధునికి ఛాతీపై కత్తిగాటు పెట్టకుండా గుండె వాల్వ్‌ను విజయవంతంగా మార్చారు హైదరాబాద్‌లోని హైదర్‌గూడ అపోలో ఆస్పత్రి వైద్యులు. చికిత్స తర్వాత రెండో రోజే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. సోమవారం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ సూర్యప్రకాశ్‌రావు,డాక్టర్ పీఎస్‌ఎన్ కపర్థి, డాక్టర్ శ్రీవాస్తవ్, డాక్టర్ విశ్వనాథ్, డాక్టర్ కాంతిలాల్ షా, డాక్టర్ సత్యజిత్ మహేత్రి, సీటీ సర్జన్ డాక్టర్ వెంకట్‌రెడ్డి, అనస్తీషియన్ డాక్టర్ శ్యామ్ చికిత్సవివరాలను వెల్లడించా రు. హైదరాబాద్ గాంధీనగర్‌కు చెందిన ప్రభాకర్ కొంత కాలంగా తీవ్ర హృద్రోగ సమస్యతో బాధపడుతున్నాడు. ఇటీవల ఆయనకు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో హైదర్‌గూడ అపోలోలో చేర్పించారు. కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ సూర్యప్రకాశ్‌రావు నేతృత్వంలోని వైద్య బృందం ఆయన్ను పరీక్షించింది.
కాల్‌స్పిక్‌స్టేనోసిస్ బైకస్పిడ్ అరోటిక్ వాల్వ్(కాల్షియంతో నిండిన బృహద్ధ మని గుండె కవాటం గట్టిపడి కుంచించుకుపోవడం)వంటి సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించారు. అప్పటికే ఒక సారి బైపాస్ సర్జరీ చేయడం, వయసు పైబడటం, కిడ్నీ, ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలతో బాధపడుతుండ టంతో మళ్లీ సర్జరీ చేయడం ఆయన ఆరోగ్యానికి శ్రేయస్కరం కాదని భావించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞా నం ‘పర్క్యుటినియస్ టెక్నిక్’(సూదితో తొడ భాగంలో రంధ్రం చేయడం ద్వారా) సాయంతో బాధితుడికి విజయవంతంగా ఆరోటిక్ వాల్వ్‌ను మార్చారు. తక్కువ కోత, మత్తు మందును ఉపయోగించి చికిత్స చేశామన్నారు. ఈ తరహా చికిత్స దేశంలోనే తొలిదని కపర్థి వెల్లడించారు.