రీ...టర్న్!
ఫ్లిప్‌కార్ట్‌కు టోకరా వేసిన యువకుడు
దాదాపు రెండేళ్లుగా రూ.లక్షల్లో మోసం
వనస్థలిపురం పోలీసులకు సంస్థ ఫిర్యాదు
అదుపులో నిందితుడు వీర రాఘవరెడ్డి
తక్కువ ధరకు వస్తువులంటూ ఇంటర్‌నెట్‌లో ప్రకటనలు ఇవ్వడం... వీటిని నమ్మి... ఆన్‌లైన్‌లో డబ్బు చెల్లించిన వారికి రాళ్లు.. సబ్బు బిళ్లలు పార్శిల్‌లో పంపి మోసం చేయడం..వంటి కేసులు ఎన్నో చూశాం. వనస్థలిపురం ఠాణా పరిధిలో దీనికి భిన్నమైన ‘సీన్’ వెలుగులోకి వచ్చింది. ఆన్‌లైన్‌లో వ్యాపారం చేసే ప్రముఖ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌కే ఓ యువకుడు టోకరా వేశాడు. దాదాపు రెండేళ్లలో రూ.10 లక్షలకు పైగా స్వాహా చేశాడు. ఈ మోసగాడిని గుర్తించిన సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. - తుర్కయంజాల్
వృత్తిరీత్యా హార్డ్‌వేర్ ఇంజినీరైన వీర రాఘవరెడ్డి (25) సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని జీడిమెట్లలో నివసిస్తున్నాడు. వివిధ పేర్లు, చిరునామాలతో ఆయన అనేక సిమ్‌కార్డులు తీసుకున్నాడు. ఇంటర్‌నెట్‌లో వివిధ పేర్లతో ఈ-మెయిల్ ఐడీలు సృష్టించాడు. ఆన్‌లైన్‌లో వ్యాపారం నిర్వహించే ఫ్లిప్‌కార్ట్‌కు గడిచిన రెండేళ్లుగా కంప్యూటర్ మదర్‌బోర్డులు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు ఆర్డర్ చేస్తున్నాడు. ఈ సంస్థ వినియోగదారులకు ఇచ్చే ‘ఈజీ రిటర్న్’ సదుపాయాన్ని తనకు అనుకూలంగా వినియోగించుకున్నాడు.
ఆర్డర్... రిటర్న్..
రాఘవరెడ్డి ఫ్లిప్‌కార్ట్‌కు వివిధ ప్రాంతాల బోగస్ చిరునామాను డెలివరీ అడ్రస్‌గా ఇచ్చేవాడు. ఒక్కోసారి ఒక్కో ఈ-మెయిల్ ఐడీ వినియోగించి ఆర్డర్ చేస్తూ వేర్వేరు ఫోన్ నెంబర్లు, అడ్రస్ ఇస్తూ వచ్చాడు. పార్శిల్ తీసుకువచ్చిన డెలివరీ బాయ్స్‌కు ఈ చిరునామా
దొరక్కపోవడంతో రాఘవరెడ్డిని ఫోన్‌లో సంప్రదించేవారు. దీంతో వారి వద్దకే వె ళ్లి వస్తువులు తీసుకునేవాడు. ఆ మదర్ బోర్డుల్లో ఉండే విలువైన చిప్స్‌ను కాజేసి, బోర్డు సరిగ్గా పని చేయట్లేదంటూ సంస్థకు రిటర్న్ చేసి మరోటి తెప్పించుకునేవాడు.
డెలివరీ బాయ్స్‌ను అప్రమత్తం చేసి...
సుమారు రెండేళ్ల పాటు వీర రాఘవరెడ్డి ఆటలునిరాటంకంగా సాగాయి. ఇదే పంథాను అనుసరిస్తూ దాదాపు రూ.10 లక్షలకు పైగా విలువైన చిప్స్, ఎలక్ట్రానిక్ వస్తువులను కాజేశాడు. రెండేళ్లుగా బోగస్ చిరునామాలతో సాగిన ‘ఆర్డర్-డెలివరీ-రిటర్న్’ అంశాన్ని ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన ఉన్నతోద్యోగి వీరేందర్ కుమార్ ఇటీవల గుర్తించారు. తన డెలివరీ బాయ్స్ అందరినీ అప్రమత్తం చేసి మోసగాడిని పట్టుకునేందుకు రంగంలోకి దింపారు.
వనస్థలిపురం చిరునామా ఇచ్చి...
వీర రాఘవరెడ్డి తాజాగా మరోసారి మరికొన్ని వస్తువులను ఆన్‌లైన్‌లో ఫ్లిప్‌కార్ట్‌కు ఆర్డర్ ఇచ్చాడు. వీటిని డెలివరీ చేయడానికి వనస్థలిపురంలోని చిరునామా ఇచ్చాడు. ఈ ‘ఆర్డర్‌గాడే’ మోసగాడని గుర్తించిన సంస్థ డెలివరీ బాయ్స్ ద్వారా వలపన్నింది. సుష్మా థియేటర్ సమీపంలోని చిరునామాలో డెలివరీ తీసుకున్న రాఘవరెడ్డి... వాటి చిప్స్‌ను తస్కరించి... వస్తువులు బాగాలేవంటూ పాత
పాటే పాడి రిటర్న్ చేశాడు.
పోలీసుల అదుపులో నిందితుడు...
డెలివరీ బాయ్స్ నిఘాతో వీర రాఘవరెడ్డే మోసగాడని గుర్తించిన ఫ్లిప్‌కార్ట్ నిర్వాహకులు వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆయనను వివిధ కోణాల్లో విచారిస్తున్న పోలీసులు... రికవరీ పైనా దృష్టి పెట్టారు. ఇదే పంథాలో మరేదైనా కంపెనీని మోసం చేశాడా? అనే కోణంలోనూ
ఆరా తీస్తున్నారు.