హైదరాబాద్లో పట్టపగలే రియల్ ఫైట్..
హైదరాబాద్ : హైదరాబాద్లో పట్టపగలు సినిమా ఫైట్ను తలపించేలా శనివారం ఇరువర్గాలు దాడులు చేసుకున్నారు. ఒకరిపై ఒకరు రాళ్లు, కర్రలు, సోడా బుడ్డిలతో ఫైట్ చేసుకున్నారు. మాదన్నపేట దోభీ ఘాట్ విషయంలో ఇరు వర్గాల మధ్య జరిగిన గొడవ...చిలికి చిలికి గాలివానగా మారింది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. కర్రలు, రాళ్లతో పరస్పర దాడులకు దిగడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
దోభిఘాట్ ప్రభుత్వ స్థలాన్ని కొందరు కబ్జా చేస్తున్నారని స్థానికులు అడ్డుకోవడంతో వివాదం చెలరేగింది. స్థలాన్ని కబ్జా చేసేందుకు మాఫీయ యత్నాలను స్థానికులు అడ్డుకున్నారు. అయితే అప్పటికే సమాచారం అందుకున్న కబ్జారాయుళ్ల అనుచరులు అక్కడ వీరంగం సృష్టించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఇరువర్గాలను శాంతింపచేసేందుకు ప్రయత్నించినా ఎవరూ వెనక్కి తగ్గలేదు. పోలీసుల ఎదుటే... కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి నిలకడగానే ఉన్నా స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. గతంలో స్థానిక బస్తివాసులు ఈ వ్యహహారంపై గవర్నర్‌కు సైతం ఫిర్యాదు చేశారు.