మత సమైక్యత, సుహృద్భావానికి తూట్లు పడేలా కొందరి చర్యలు సమాజంలో కల్లోలానికి కారణమవుతున్నాయి. వట్టి వదంతులతోనే అల్లర్లకు దిగడం, ఆస్తి నష్టానికి పాల్పడడం, ఆపై రావణకాష్టంలా అది కొనసాగడం కొన్ని జిల్లాలకు సమస్యగా మారింది. మల్నాడు, కోస్తా, పలు ఉత్తర కర్ణాటక జిల్లాల్లో కలహాల బెడద ఎక్కువగా ఉంటోంది.
బనశంకరి: రౌడీయిజంలో ఉడుపి, కోలారు, అగ్రస్థానంలో నిలిచాయి. ఈ జిల్లాల్లో అత్యధికంగా రౌడీయిజం ఆధారిత కేసులు నమోదు కాబడ్డాయి. ఉడుపి జిల్లాలో గత ఐదేళ్లలో 431 కేసులు నమోదు కాగా, కోలారు జిల్లాలో 165, ఆ తరువాత దక్షిణ కన్నడ జిల్లాలో 152 కేసులు, బెంగళూరు నగర 60, కలబురిగి 97, శివమొగ్గ 156 నేరాలు జరిగాయి.
అత్యధికంగా శివమొగ్గ జిల్లాలో..
- గత ఐదేళ్లలో రాష్ట్రంలో మత ఘర్షణలు కేసులు 242 నమోదయ్యాయి. వీటిలో శివమొగ్గ జిల్లాలో 57 కేసులు, దక్షిణ కన్నడ జిల్లాలో 46 నేరాలు జరిగాయి. బాగల్‌కోటెలో 26, దావణగెరెలో 18, హావేరి 18 ఘటనలు సంభవించాయి.
- గత మూడేళ్లలో నాలుగు మత ఘర్షణలతో కూడిన హత్యలు జరిగాయి. మంగళూరులో 1, దక్షిణ కన్నడ జిల్లాలో 1, గదగ (నరగుంద)లో 1, శివమొగ్గలో 1 హత్య జరిగాయి.
- మత ఘర్షణల ఆస్తినష్టం కేసులు శివమొగ్గలో 31 నమోదయ్యాయి. ఇదే అత్యధికం.
సోషల్ మీడియా ఎఫెక్టు ..
ఇందులో సోషల్ మీడియా ప్రభావం అధికంగా ఉంది. ఎక్కడో జరిగిన సంఘటనలను ఇక్కడే జరిగాయని కొందరు మసిపూసి పోస్ట్ చేయడం, అవి వైరల్‌గా మారి కల్లోలం చెలరేగడం పరిపాటిగా మారింది. అవి ఫేక్ వీడియోలు అని చెప్పినప్పటికీ ఆవేశంలో యువత నమ్మడం లేదు. మరో వర్గానికి చెందినవారిని దారి కాచి దాడి చేయడం ఆస్తులను ధ్వంసం చేయడంతో ఉద్రిక్తతలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించే ప్రమాదముంది.
గొడవల్లో 380 మంది పోలీసులకు గాయాలు
- గొడవలు, మత ఘర్షణలను నియంత్రణ చేయడం పోలీసులకు సవాల్‌తో కూడుకున్నది. ఈ ఘర్షణలను అడ్డుకునే క్రమంలో 380 మంది పోలీసులు గాయపడ్డారు. ఇందులో సీఐ, ఆపై అధికారులు 107 మంది, ఎస్‌ఐలు 49 మంది, హెడ్‌కానిస్టేబుల్స్ 96, కానిస్టేబుళ్లు 128 మంది ఉన్నారు.
- ఘర్షణల కేసుల్లో విచారణ జరిపి 3,489 మందిపై చట్టపరంగా చర్యలు తీసుకున్నారు. వీరిలో ఉత్తర కన్నడ జిల్లాలో 802, దావణగెరెలో 465, మంగళూరులో 501, బెంగళూరునగర 493 మందిపై చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వం ఎంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లుచెబుతున్నప్పటికీ మత ఘర్షణలకు బ్రేక్ పడటం లేదు.
(చదవండి: పేసీఎం పోస్టర్‌పై ఫోటో.. కాంగ్రెసకు వార్నింగ్ ఇచ్చిన నటుడు)
Comments
Please login to add a commentAdd a comment