హైదరాబాద్‌సిటీ (మలేసియా టౌన్‌షిప్): హిజ్రాల కారణంగానే భార్య ఇంటినుంచి వెళ్లిపోయిందనే కోపంతో హిజ్రాలను వేధించడం, దాడులు చేయడమే కాకుండా హత్యకు పాల్పడిన నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 16వ తేదీన హిజ్రా ప్రవల్లికను హత్య చేశారు. ఈ కేసును కేపీహెచ్‌బీ పోలీసులు ఛేదించారు. హత్య వివరాలను కూకట్‌పల్లి ఏసీపీ గురువారం వివరించారు.
వివరాల్లోకి వెళితే అనంతరంపురం జిల్లా రాప్తాడు గ్రామానికి చెందిన కుర్మ వెంకటేశ్వర్లు అలియాస్ చిన్నా, అలియాస్ వెంకటేష్ (24) అనిత అనే అమ్మాయిని ఐదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. కూకట్‌పల్లి మూసాపేటలో నివసించేవాడు. ఓ ప్రైవేటు ట్రావెల్స్‌లో ఉద్యోగం చేసేవాడు. ఈ క్రమంలోనే వెంకటేశ్వర్లుకు దివ్య అనే హిజ్రాతో సేహ్నం ఏర్పడింది. విషయం తెలిసిన భార్య అతన్ని అసహ్యించుకొని పుట్టింటికి వెళ్లిపోయింది.
తన భార్య దూరం కావడానికి హిజ్రాలే కారణమని వారిపై పగ పెంచుకున్నాడు. నిరంతరం వారిని వేధించి, దాడులు చేసేవాడు. ఈ నేపథ్యంలో గత నెల 16వ తేదిన వెంకటేశ్వర్లు, అతని స్నేహితులు కొడుమూరి రాముడు(25), రాయపర్తి రాజశేఖర్‌రెడ్డి (28), కాకర్ల తిరుమలేశ్వర్‌రెడ్డి (32)లతో కలిసి కేపీహెచ్‌బీ బస్టాప్ వద్ద ఉన్న కుమ్మరి సురేష్ అలియాస్ ప్రవల్లిక అనే హిజ్రాతో ఒప్పందం కుదుర్చుకున్నారు.టాటా సుమోలో ఎల్లమ్మబండలో గల జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం నివాసాల వద్దకు తీసుకువెళ్లారు. వెళ్లిన వెంటనే వెంకటేశ్వర్లు ప్రవళికను తన వద్ద ఉన్న డబ్బును సెల్‌ఫోన్ ఇవ్వమని బెదిరించాడు. నువ్వు నాకు తెలుసునని ప్రవల్లిక అనడంతో బండారం బయటపడుతుందని వెంకటేశ్వర్లు, రాముడులు రాతితో తలపై బలంగా మోదారు. దీంతో హిజ్రా తీవ్రగాయాల పాలై అపస్మాకర స్థితిలోకి వెళ్లింది. ఆమెవద్ద గల రూ. 1600, సెల్‌ఫోన్‌ను తీసుకొని వెంకటేశ్వర్లు, అతని స్నేహితులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు గురువారం కేపీహెచ్‌బీకాలనీలోని రాజశేఖర్‌రెడ్డి నివాసంలో వెంకటేశ్వర్లు, తిరుమలేశ్వర్‌రెడ్డిలను అదుపులోకి తీసుకుని విచారించగా నిందితులు పోలీసులు ముందు నేరాన్ని అంగీకరించారు. ఈ మేరకు వెంకటేశ్వర్లు, రాజశేఖర్‌రెడ్డి, తిరుమలేశ్వర్‌రెడ్డిలను రిమాండ్‌కు తరలించారు. రెండో నిందితుడు కొడుమూరి రాముడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదిలా ఉంటే హిజ్రా ప్రవల్లికను నిజామాబాద్ జిల్లా దారుపల్లి మండలం, అనుసాన్‌పల్లి గ్రామానికి చెందిన కుమ్మరి సురేష్ (25)గా గుర్తించారు. సురేష్ ఎంబీఏ పూర్తిచేసి బేగంపేటలో నివాసం ఉంటూ ప్రవల్లిక పేరుతో కూకట్‌పల్లి ప్రాంతంలో రాత్రివేళలో హిజ్రా వేషంలో తిరిగేవాడని పోలీసులు తెలిపారు.