మా కుమారులకు పునర్జన్మ
- ‘హిమాచల్ ’ ఘటనలో క్షేమంగా తిరిగొచ్చిన చేతన్ రమేశ్ చౌహాన్,సుహర్ష
- మా కుమారులకు పునర్జన్మని తల్లిదండ్రుల ఊరట
నల్లకుంట, ఆల్విన్‌కాలనీ : హిమాచల్‌ప్రదేశ్ ఘటనలో క్షేమంగా తిరిగొచ్చిన విద్యార్థులు తమ అనుభవాలను తల్లిదండ్రులతో పంచుకుంటున్నారు. ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకొని బయటపడ్డామని, లేకుంటే తాము కూడా వరదనీటిలో కొట్టుకపోయే వాళ్లమని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. స్లేట్ ది స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్న సుజాత,రమేశ్ చౌహాన్ దంపతులకు చేతన్ రమేశ్ చౌహాన్(17), ఆకాశ్‌లు ఇద్దరు కొడుకులు.
చేతన్మ్రేశ్ చౌహాన్ వీఎన్‌ఆర్ విజ్ఞానజ్యోతి కాలేజీలో సెకండియర్ చదువుతూ..నల్లకుంట రైల్వేట్రాక్ సమీపంలోని శ్రీసాయి రెసిడెన్సీలో అమ్మమ్మ వద్ద ఉంటున్నాడు. స్టడీ టూర్‌కు వెళ్లిన చేతన్ ‘హిమాచల్’ ఘటన నుంచి బయటపడి మంగళవారం తెల్లవారుజామున ఇంటికి చేరుకోవడంతో అతని కుటుంబసభ్యులు ఆనందంతో ఊపిరిపీల్చుకున్నారు.
టీవీల్లో చూసి భయపడ్డాం..: హిమాచల్‌ప్రదేశ్ ఘటనలో తమ కుమారుడు సురక్షితంగా తిరిగిరావడం ఆనందంగా ఉందని చేతన్ తల్లిదండ్రులు పేర్కొన్నారు. విద్యార్థులు వరదనీటి ప్రవాహంలో గల్లంతయ్యారని టీవీల్లో చూసి మాపై ప్రాణాలు పైనే పోయినంతపనైందని ఆవేదన వ్యక్తం చేశారు. తొలుత తమ కుమారుడి సెల్‌కు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చిందని..రాత్రి 11.30 గంటలకు క్షేమంగానే ఉన్నానని చెప్పడంతో ఊరట చెందామని చెప్పారు.
మిత్రులే బయటకు లాగారు : ‘కొండలు, లోయలు, పచ్చని అందాల నడుమ అందరం కలిసి ఫొటోలు దిగాలని ఆదివారం సాయంత్రం 6.30 గంటల సమయంలో బియాస్ నది వద్దకు చేరుకున్నాం. అప్పటివరకు ఫొటోలు దిగుతుండగా నీటిప్రవాహం నెమ్మదిగా పెరిగింది. దీంతో నేను నా స్నేహితులు బయటకు వెళ్దామని అడుగులు వేస్తుండగా కాలు జారి కిందపడ్డాను. వెంటనే స్నేహితులు చేయందించి ఒడ్డుకు లాగారు.
క్షణాల్లో నీటి ప్రవాహం పెరగడంతో ఫొటోల కోసం ఆ నదిలో ఉన్న వారు కొట్టుకపోవడం చూసి షాక్ అయ్యానని’ ప్రమాదం నుంచి బయటపడిన విద్యార్థి వి.సుహర్ష అన్నారు. తల్లిదండ్రులు రాజేశ్వరి, చలపతిరావులు మాట్లాడుతూ ‘టీవీలో వస్తున్న వార్తలు చూసి మా అబ్బాయి ఎలా ఉన్నాడో అని ఆందోళన చెందాము. వాడిని మా కళ్లతో చూసేదాక మా కంటికి కునుకులేదు. నిజంగా ఇది మా అబ్బాయికి పునర్జన్మే’ చెమ్మగిల్లిన కళ్లతో చెప్పారు.