జలమండలి వినతి
నేడు తెలంగాణ ఈఆర్‌సీతో అధికారుల భేటీ
సిటీబ్యూరో: రూకల్లోతు ఆర్థిక కష్టాల్లో ఉన్న జలమండలికి విద్యుత్ టారిఫ్ తగ్గించాలని కోరుతూ బోర్డు అధికారులు శనివారం తెలంగాణ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్‌కు విన్నవించనున్నారు. ప్రస్తుతం కృష్ణా, మంజీర, సింగూరు, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌ల నుంచి సేకరిస్తున్న 340 మిలియన్ గ్యాలన్ల జలాలను గ్రేటర్ నలుమూలలకు సరఫరా చేసేందుకు నెలకు 110 మెగావాట్ల విద్యుత్ వినియోగిస్తున్నారు. దీనికి ప్రతి నెలా జలమండలి రూ.45 కోట్లు బిల్లులు చెల్లిస్తోంది. బోర్డును పరిశ్రమ కేటగిరీగా (హెచ్‌టీ) పరిగణిస్తూ యూనిట్‌కు రూ.5.70 వంతున వసూలు చేస్తున్నారు. ఇక నుంచి యూనిట్‌కు రూ.3.70కే సరఫరా చేయాలని జలమండలి అధికారులు ఈఆర్‌సీని కోరనున్నారు.
దీంతో బోర్డుకు నెలకు రూ.10 కోట్ల వంతున ఆదా అవుతుందని.. ఈ నిధులు శివార్లలో మంచినీటి సరఫరా వ్యవస్థ ఏర్పాటు, స్టోరేజి రిజర్వాయర్ల నిర్మాణం, మరమ్మతులకు వినియోగించే అవకాశం ఉంటుందని ఈఆర్‌సీకి వివరించనున్నారు.బెంగళూరులో జలబోర్డుకు సరఫరా చేస్తున్న విద్యుత్ యూనిట్‌కు రూ.3.70 మాత్రమే వసూలు చేస్తున్నారని, మరోవైపు గ్రామీణ నీటి సరఫరా విభాగానికి సైతం రాయితీపై విద్యుత్ అందిస్తున్నారని బోర్డు అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. జలమండలి వాదనకు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వంటి స్వచ్ఛంద సంస్థలు సైతం మద్దతు పలుకుతుండడం విశేషం.
రెట్టింపు భారం
ఈ ఏడాది జూన్‌కు పూర్తి కానున్న కృష్ణా మూడోదశ నీటి పంపింగ్, సరఫరాకు 36 మెగావాట్లు, ఆగస్టు చివరికి పూర్తి కానున్న గోదావరి మంచినీటి పథకానికి మరో 72 మెగావాట్ల విద్యుత్‌అవసరమవుతుందని జలమండలి అంచనా వేస్తోంది. ఈ రెండు పథకాలు పూర్తయితే ప్రతినెలా రూ.90 కోట్ల మేర విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి వస్తుందని బోర్డు వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.
ప్రస్తుతం బోర్డుకు నెలకు రూ.90 కోట్ల ఆదాయం వస్తుండగా.. విద్యుత్ బిల్లుల చెల్లింపు, ఉద్యోగుల జీతభత్యాలు, రుణ వాయిదాల చెల్లింపు, మరమ్మతులకు రూ.93 కోట్లు వ్యయమవుతోంది. ఈ రెండు మంచినీటి పథకాలు పూర్తయితే బోర్డుకు వచ్చే ఆదాయమంతా విద్యుత్ బిల్లులకే సరిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో సర్కారు జోక్యం చేసుకొని విద్యుత్ టారిఫ్ తగ్గించాలని బోర్డు వర్గాలు కోరుతున్నాయి. ఈఆర్‌సీ సానుకూలంగా స్పందిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
విద్యుత్ టారిఫ్ తగ్గించండి
Published Sat, Mar 14 2015 12:09 AM | Last Updated on Wed, Sep 5 2018 1:46 PM
Advertisement
Advertisement