
సాక్షి, హైదరాబాద్: పౌర సరఫరాల శాఖలో చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలిచ్చాయి. కఠిన నిర్ణయాలు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో 14 నెలల్లో రూ.1,618 కోట్లు ఆదా అయ్యాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం వల్ల అక్రమాలు తగ్గాయి. రైస్ మిల్లర్లు, ఎఫ్‌సీఐ, కిరోసిన్ డీలర్ల వద్ద ఏళ్ల తరబడి పేరుకుపోయిన బకాయిలు వసూలయ్యాయి. మిల్లర్ల నుంచి కస్టమ్ మిల్లింగ్‌కు సంబంధించి రూ.575 కోట్ల బకాయిలు రాబట్టగా.. ఈ–పాస్ విధానంతో రూ.479 కోట్లు ఆదా అయ్యాయి.
ఆర్థిక విభాగం ఏర్పాటైన తర్వాత ఖాతాలను పునరు ద్ధరించుకోవడంతో రూ.75 కోట్ల వడ్డీ భారం తగ్గించగలిగారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు, టెక్నికల్ విభాగం ఏర్పాటు చేసి నిరంతర నిఘా పెంచడంతో మరో రూ.30 కోట్లు ఆదా చేయగలిగారు. ప్రభుత్వ వసతి గృహాలు, మధ్యాహ్న భోజన పథకానికి 1.20 లక్షల టన్నుల సన్న బియ్యం కొనుగోలు కోసం రైస్ మిల్లర్లతో కమిషనర్ చర్చలు జరపడం వల్ల రూ.30.18 కోట్లు, పీడీఎస్ బియ్యం ద్వారా రూ.80 కోట్లు ఆదా అయింది.
2008–09 నుంచి 2014–15 వరకు మిల్లర్ల వద్ద ఉన్న గోనె సంచుల రికవరీతో రూ.84.58 కోట్లు వసూలయ్యాయి. ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన నియామకాలు జరపడంతో రూ.10 కోట్లు.. కమాండ్ కంట్రోల్ సెంటర్, జీపీఎస్, సాంకేతిక విభాగాల ఏర్పాటు, పౌర సరఫరాలపై నిరంతర పర్యవేక్షణతో రూ.25 కోట్లు ఆదా చేయగలిగారు. అలాగే కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న రూ.249.72 కోట్ల బకాయిలూ రాబట్టగలిగారు.
పారదర్శకత, జవాబుదారీతనం..
ఆర్థిక నిర్వహణలో లోపాలు, 2011 నుంచి ఖాతాల ఆడిటింగ్ జరగకపోవడం, సిబ్బంది కొరత, జవాబుదారీతనం లేకపోవడం, ఆర్థిక లావాదేవీలను పర్యవేక్షించే సాఫ్ట్‌వేర్ లేకపోవడం సంస్థకు అవరోధంగా నిలిచాయి. ఆర్థిక వ్యవహారాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ నిఘా లేకపోవడంతో అధికారులు, సిబ్బందిలో భయం లేకుండాపోయింది.
అయితే సాంకేతిక పరిజ్ఞానం ద్వారా శాఖలోని అన్ని విభాగాల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించాం. సంస్థకు బకాయిపడిన వారి నుంచి సొమ్ము రాబట్టేందుకు కఠిన నిర్ణయాలు తీసుకున్నాం. 2011 నుంచి పెండింగ్‌లో ఉన్న అకౌంట్లను ఆడిట్ చేయించాం. రోజువారీ లావాదేవీలపై నిఘాకు అకౌంటింగ్ ఏజెన్సీ నియమించాం. ప్రతి లావాదేవీని సంబంధిత సిబ్బంది చూసేందుకు వీలుగా ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టంను రూపొందించాం. – సీవీ ఆనంద్, పౌర సరఫరాల శాఖ కమిషనర్