స్వైన్ గణగణ | Resistant rulers are in danger of their lives worse sanitation, public health | Sakshi
Sakshi News home page

స్వైన్ గణగణ

Published Sun, Feb 1 2015 1:23 AM | Last Updated on Mon, Aug 13 2018 3:55 PM

స్వైన్ గణగణ - Sakshi

స్వైన్ గణగణ

మన సర్కారు ఆశ... ఆకాశంలో మెట్రో వేగంతో పరుగెడుతోంది. ‘విశ్వ’మంత ఎదగాలనే ‘కల’ల బండి.....

ప్రమాదంలో ప్రజారోగ్యం  ప్రాణాలు పోతున్నా పట్టని పాలకులు అధ్వానంగా పారిశుద్ధ్యం
 
 
మన సర్కారు ఆశ... ఆకాశంలో మెట్రో వేగంతో పరుగెడుతోంది. ‘విశ్వ’మంత ఎదగాలనే ‘కల’ల బండి...  కళ్ల ముందు నిరంతరం కదులుతోంది. ఈ వేగాన్ని అందుకోలేక ‘వాస్తవం’ చతికిలబడుతోంది. పారిశుద్ధ్యలోపం రూపంలో ప్రజల ప్రాణాలకు ముప్పు తెస్తోంది. స్వైన్ ఫ్లూను జనంపైకి వదిలి... మృత్యువు వికటాట్ట హాసం చేస్తోంది. మహా నగరపు దారి పొడవునా గుండె నెత్తురులు చిమ్ముతూ... ‘స్వైన్’ మృత్యు గంటలు మోగిస్తోంది. నేలపైకి చూడాలని సర్కారుకు స్పృహ వచ్చేలోపు ఇంకెన్ని ప్రాణాలు స్పృహ కోల్పోతాయోనని మహా నగరం బెంగటిల్లుతోంది. ఆదుకోవాలని ప్రభుత్వ పెద్దలను చార్మినార్ శిరస్సు వంచి కోరుతోంది. ఇదే సమయంలో అధికారులతో సమీక్ష సమావేశంలో సాక్షాత్తూ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ‘మహానగరానికి మామూలు వైద్యం కాదు...శస్త్ర చికిత్స చేయాల’నడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
 
స్వైన్ ఫ్లూ.. ఎబోలా.. డెంగీ.. చికున్ గున్యా వంటి ప్రాణాంతక వ్యాధులు సిటీలో విజృంభిస్తున్నాయి.. మూడు నెలలుగా స్వైన్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రోజూ మరణ మృదంగం మోగుతూనే ఉంది.. వందలాది మంది ప్రాణాలతో పోరాడుతున్నారు. ప్రజారోగ్యం ప్రమాదంలో పడింది. అయినా అధికారులు... ప్రజాప్రతినిధుల్లో చలనం లేదు. ఎక్కడ చూసినా చెత్తాచెదారాలు.. రోడ్లపై పరుగులు తీస్తున్న మురుగు.. దోమల విజృంభణతో కంటిమీద కునుకు కరువైంది. పందులు స్వైర విహారం చేస్తున్నాయి.. అనేక ప్రాంతాల్లో మురుగునీరే తాగునీరవుతోంది. నగరాన్ని విశ్వనగరంగా మార్చేస్తాం.. మురుగు వాడలను అద్భుతంగా మార్చేస్తాం.. ఆకాశ హర్మ్యాలను నిర్మిస్తాం.. హైటెక్ హంగులు కల్పిస్తాం.. అంటూ సీఎం కేసీఆర్ నుంచి కేబినేట్ మంత్రులు, జీహెచ్‌ఎంసీ అధికారులు నిత్యం  చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలకు... వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి.. నరగంలో పారిశుద్ధ్యం పరిస్థితిపై శనివారం ‘సాక్షి’ విజిట్‌లో అధికారుల నిర్లక్ష్యంతో పాటు విస్తుపోయే అంశాలు వెలుగుచూశాయి. నగరానికి  శస్త్రచికిత్స చేయాల్సిందేనని సాక్షాత్తూ సీఎం ప్రకటించడం భాగ్యనగరిలో అధ్వాన పరిస్థితికి అద్దం పడుతోంది.
 - సాక్షి, నెట్‌వర్‌‌క
 
స్వాగతం పలుకుతున్న మురుగు నీరు...
 
మన్సూరాబాద్: నగరానికి ముఖద్వారం.. సిటీకి వచ్చేవారికి మురుగునీరు స్వాగతం పలుకుతోంది. డ్రైన్లు పొంగిపొర్లుతున్నాయి.. ఎల్‌బీనగర్ సర్కిల్ పరిధిలోని ప్రాంతాలను పరిశీలిస్తే ఇక్కడ అధికార యంత్రాంగం పనిచేస్తోందా అన్న అనుమానం కలుగుతోంది. చెత్తాచెదారాలు.. పొంగిపొర్లుతున్న మురుగునీరు ఇళ్లల్లోకి సైతం వచ్చేస్తోందని, వ్యాధుల బారిన పడుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. జాతీయ రహాదారిపై డ్రైనేజీ పొంగిపొర్లుతున్నా అధికారుల్లో స్పందన లేదు. మున్సిపల్, జోనల్ కార్యాలయాలకు కూతవేటు దూరంలో అధికారులు నిత్యం ప్రయాణించే రహదారులపై డ్రైనేజీ పొంగిపోర్లుతున్న ఉన్నతాధికారులకాని, శానిటేషన్ అధికారులు పట్టించుకున్న దాఖలాల్లేవు.
 
లక్షలు మింగేస్తున్నారు...
 
కుత్బుల్లాపూర్: పారిశుద్ధ్యం పేరుతో అధికారులు లక్షలు స్వాహా చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. చెత్త సమస్య కుత్బుల్లాపూర్‌వాసులకు పెద్ద గుదిబండగా మారింది. ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా చె త్తాచెదారమే దర్శనమిస్తోంది. ప్రజలు వ్యాధుల బారిన పడి ఆస్పత్రుల పాలవుతున్నారు. చెత్త తరలించేందుకు అధునాతన వాహనాలున్నాయి. డంపర్ బిన్స్ ఉన్నాయి. అయినా నిర్వహణ సరిగా లేకపోవడంతో ఎక్కడి చెత్త అక్కడే దర్శనమిస్తోంది. ప్రజలు రోగాల బారినపడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. పారిశుద్ధ్యం నిర్వహణకు రూ. లక్షలు వెచ్చిస్తున్నామని అధికారులు చెబుతున్నా వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. గాజులరామారం, జగద్గిరిగుట్ట, చింతల్, షాపూర్‌నగర్ రైతు బజార్, సూరారం కాలనీ, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్ పరిధిలోని కాలువల్లో చెత్త పేరుకుపోయింది.
 
ప్రత్యక్ష నరకం    

 
దిల్‌సుఖ్‌నగర్: ఇళ్ల మధ్య మురుగునీరు..చెత్తతో నిండిన రోడ్లు...పొంగిపొర్లుతున్న డ్రైనేజీలు..పందుల స్వైర విహారంతో ప్రజలకు ప్రత్యక్ష నరకం కనిపిస్తోంది.. ఆస్ప్రతుల్లో ఓపీల సంఖ్య పెరిగిపోతోంది. ప్రైవేటు ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి.ప్రజారోగ్యం ప్రమాదంలో పడింది. స్వైన్ ఫ్లూ, డెంగీ, మలేరియా, చికున్ గున్యా, ఎబోలా వంటి ప్రాంణాంతక వ్యాధులు ప్రబలుతున్నాయి. అధికారుల పర్యవేక్షణలోపం, ప్రజలలో అవగాహన లేమి వెరసి కాలనీల్లో అధ్వానంగా ఉంది. దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట్, సైదాబాద్, అక్బర్‌బాగ్, ఐఎస్‌సదన్, అజంపుర, మాదన్నపేట్, ఆర్‌కేపురం, సరూర్‌నగర్ డివిజన్‌ల పరిధిలోని ప్రజలు విషజ్వరాలతో ఆసుపత్రుల పాలవుతున్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కాలనీలలో పారిశుద్ధ్య సేవలు అందించడంలో శానిటేషన్ అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. ఓల్డ్‌మలక్‌పేట్, ఆర్‌కేపురం, సరూర్‌నగర్, ఐఎస్‌సదన్, మూసారంబాగ్,మూసారంబాగ్ తదితర డివిజన్‌లలో అధికశాతం మురికివాడల నిర్వాసితులు డెంగ్యూ, మలేరియాతోపాటు పలురోగాల బారిన పడుతూ ఆందోళనకు గురవుతున్నారు. అధికారుల స్పందన మొక్కుబడిగా ఉందని ప్రజలు ఆరోపిస్తున్నారు.
 
స్వైన్ విజృంభిస్తున్నా...
 
 
మెహిదీపట్నం/గోల్కొండ: ప్రముఖ పర్యాటక కేంద్రం.. నగర శివారు ప్రాంతాలు.. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న కాలనీలు ఎన్నో ఉన్నాయి. శానిటేషన్ అధ్వానంగా ఉంది. దోమలు విజృంభిస్తున్నాయి. కంటిమీద కునుకు కరువైంది. విషజ్వరాలు ప్రబలి ప్రజలు ఆస్పత్రి పాలవుతున్నారు. అధికారులు మాత్రం పట్టించుకున్న పాపాన పోలేదు. పందులు విచ్చలవిడిగా రోడ్లపై తిరుగుతున్నాయి. స్వైన్‌ఫ్లూ భయంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నామని స్థానికులు వాపోతున్నారు. చెత్త తరలింపు పనులను పర్యవేక్షించేందుకు అధికారులు శ్రద్ధ చూపడం లేదు. షేక్‌పేట్, గుడిమల్కాపూర్, షాహిద్‌నగర్, మురాద్‌నగర్ తదితర ప్రాంతాల్లో చెత్త తరలింపు సవ్యంగా జరగడం లేదు. ప్రజాప్రతినిధులు, అధికారుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
 
డంపింగ్‌యార్డ్‌లా  వీధులు

 
ఉప్పల్: చెత్తాచెదారాలతో వీధులన్నీ డంపిగ్ యార్డులను తలపిస్తున్నాయి. శివారు ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. ప్రధాన వీధుల్లో నిత్యం మురుగునీరు పొంగిపొర్లుతూనే ఉంటోంది. పందులు యథేచ్ఛగా తిరుగుతున్నాయి. నాలాలు పొంగిపొర్లుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. ఫిర్యాలు చేసినా అధికారులుల్లో ఉలుకు..పలుకు లేదు.. కాప్రా డివిజన్‌లోని ఎల్లారెడ్డిగూడ, సాయిబాబానగర్, సాయిరాంనగర్‌ల్లో పందుల బెడద అధికంగా ఉంది. ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ కళాశాల వెనుక ప్రధాన రహదారిలో  వారం రోజులుగా మురుగు పరుగులు తీస్తోంది. పలు మార్లుగా ఫిర్యాదుచేసినా శానిటేషన్ విభాగంలో చలనం లేకపోవడం శోచనీయం.  రామంతాపూర్ చిన్న చెరువు ఒడ్డున చెత్త పేరుకుపోయి చెత్త డంపింగ్ యార్డులా మారిపోయింది. సమీపంలోని ఇందిరానగర్, నెహ్రూనగర్, నేతాజీనగర్ ప్రజలు భయాందోళనకు చెందుతున్నారు. వివేక్‌నగర్, రాంశంకర్‌నగర్, సత్యానగర్‌లకు సమీపంలో బైపాస్ రోడ్డులో ఉన్న చెత్త డంపింగ్‌యార్డులో కూడా పందులు సంచరిస్తు స్థానిక బస్తీలోకి వెల్తున్నాయి.  బాలకృష్ణనగర్‌లో కొంతమంది పందుల పెంపకం చేపట్టడంతో అవి విచ్చలవిడిగా వీధుల్లోకి వస్తున్నాయి. సమస్యను పరిష్కరించకపోతే ఆందోళన బాట పడతామని స్థానికులు హెచ్చరిస్తున్నారు.
 
కదలని మురుగు...
 
అల్వాల్/నేరేడ్‌మెట్/యాప్రాల్/మౌలాలి/మల్కాజిగిరి/గౌతంనగర్: అల్వాల్ సర్కిల్ పరిధిలోని మచ్చబొల్లారం, ఏకలవ్యనగర్, జొన్నబండ, సూర్యనగర్, గ్రీన్‌ఫీల్డ్స్, ఖానాజిగూడ, సుభాష్‌నగర్, తుర్కపల్లి, బటన్‌గూడ ప్రాంతాలలో పారిశుద్య నిర్వాహన కొరవడింది. పందులు స్వైర విహారం చేస్తున్నాయి. అల్వాల్‌లో ఇప్పటివరకు ఐదుగురు స్వైన్‌ఫ్లూ బారిన పడ్డారు.  నేరేడ్‌మెట్ పరిధిలోని డిఫెన్స్ కాలనీలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉంది. ఓపెన్ నాలాల్లో చెత్త పేరుకపోవడంతోమురుగు నీరు రోడ్డుపై పారుతోంది. అంతే కాకుండా రామకృష్ణాపురం, కేశవనగర్, నేరేడ్‌మెట్ తదితర ప్రాంతాలలో రోడ్లపై పందులు స్వైరవిహారం చేస్తున్నాయి. గౌతంనగర్ డివిజన్ పరిధిలోని రామాంజనేయనగర్, జేఎల్‌ఎన్‌ఎస్ నగర్. గోపాల్‌నగర్, జ్యోతినగర్ వరకూ ఓపెన్‌నాలలో చెత్త చెదారం రోజుల తరబడి పేరుకుపోయి ఉంది. మౌలాలి డివిజన్ పరిధిలోని ఓల్డు మౌలాలి, ఓల్డు సఫిల్‌గూడా, పీబీ కాలనీ, ద్వారకా మయికాలనీ, భరత్‌నగర్, షఫీనగర్‌లలో ఓపెన్ డ్రైనేజీలలో చెత్త చెదారం పేరుకుపోయి ప్రవాహానికి అడ్డుపడుతుంది. షఫీనగర్‌లో చెత్త డంపింగ్ యార్డుతో దుర్వాసనతో స్థానికులకు ఇబ్బందిగా మారింది. సంతోషిమానగర్, ఎస్‌పినగర్, చందాబాగ్, మౌలాలి, ఎన్‌కృష్ణానగర్,వినాయకనగర్,ప్రగతినగర్ తదితర బస్తీలలో చెత్త కుప్పలుగా పేరుకుపోయి అపరిశుభ్రత నెలకొంది. షఫీనగర్, ఎస్‌పీనగర్, శ్రామికనగర్‌లలో పందులు స్వైరవిహారం చేస్తున్నాయి.
 
కలుషిత నీరే దిక్కు

 
ఆల్విన్ కాలనీ: కూకట్‌పల్లి సర్కిల్ పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది. చెత్తాచెదారం పేరుకుపోయి దుర్గందం వెదజల్లుతోంది. పలు కాలనీల్లో డ్రైనేజీ సౌకర్యం లేదు. దీంతో రోడ్లపై మురుగునీరు పొంగిపొర్లుతోంది. మంజీర, బోర్‌వాటర్ పైపుల్లో, వాల్స్‌లో కలుస్తూ కలుషిత నీరుగా మారిపోతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, ప్రజా ప్రతినిధుల అలసత్వం కారణంగా శానిటేషన్ సమస్య ఎక్కడవేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉంది. వివేకానందనగర్ డివిజన్ పరిధిలోని జగద్గిరిగుట్ట రామకృష్ణానగర్, రిక్షాపుల్లర్స్ కాలనీల్లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పొంగిపొర్లుతూ బోర్‌వాటర్ వాల్ వద్ద కలిసిపోవడంతో సరఫరా అయ్యే నీరు కలుషితం అవుతోంది. ఆస్‌బెస్టాస్ కాలనీలో  ఈగలు, దోమలు విజృంభిస్తున్నాయి. సుమిత్రానగర్, దయారుగూడ, నైనా గార్డెన్ సమీపంలో చెత్త కుప్పలు తెప్పలుగా వేయడంతో ఈగలు, దోమలకు ఆవాసాలుగా మారడంతో అవి వృద్ధి చెంది రాత్రివేళలో కంటిపై కునుకులేకుండా చేస్తున్నాయి.కేపీహెచ్‌బీకాలనీ మొదటిరోడ్డు, ధనలక్ష్మి సెంటర్, బస్టాప్ సెంటర్లలో చెత్తను తరలించేవారు లేరు. ఫాగింగ్ చేసిన పాపాన పోలేదు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement