టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ భేటీలో తీసుకున్న నిర్ణయాలను మంగళవారం ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్, సంఘ నేతలు విరాహత్ అలీ, మాజిద్‌లతో కలసి ఆయన విలేకరులకు తెలియజేశారు. హెల్త్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం చేసిన అనేక వాగ్దానాలు ఆచరణలో అమలు కావడం లేదన్నారు. కొత్త అక్రెడిటేషన్లు ఇచ్చిన వారి కి, అక్రెడిటేషన్లు లేనివారికి, డెస్క్ జర్నలిస్టులకు ఇవి ఇంతవరకు అందలేదన్నారు. జిల్లాల విభజనకు అనుగుణంగా పంచాయతీరాజ్ వ్యవస్థను విభజించనందున పాత జిల్లాల ప్రాతిపదికనే బస్సుపాస్ విధానాన్ని వెంటనే అమలు చేయాలన్నారు.
గత 3, 4 ఏళ్లలో వివిధస్థాయిల్లోని 330 మంది జర్నలిస్టులు చనిపోయారని, వారిలో ప్రభుత్వపరంగా 60 మందికే సహాయం అందిందన్నారు. మిగతా వారందరికీ సహాయం అందేలా చూడాలన్నారు. జర్నలిస్టుల సంక్షేమం, అక్రెడిటేషన్లు, హెల్త్‌కార్డులు ఇలా అన్ని వ్యవస్థలను ప్రెస్ అకాడమీకి అప్పగించకుండా ఏ వ్యవస్థకు ఆ వ్యవస్థ పనిచేసేలా ప్రభుత్వం చూడాలని ఐజేయూ నేత అమర్ సూచించారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య సుప్రీంకోర్టులో తేలినందున ప్రస్తుతం సమాచారశాఖ ఆధ్వర్యంలోని ఆయా స్థలాలను జవహర్‌లాల్ హౌసింగ్ సొసైటీకి అప్పగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.