జీహెచ్ఎంసీ రిటైర్డ్ మేనేజర్ భారీ చేతివాటం
గతంలో జీహెచ్‌ఎంసీలో పనిచేసి రిటైరైన ఓ మేనేజర్ చేతివాటం చూపించి.. ఏకంగా 50 లక్షల రూపాయల వరకు పక్కదారి పట్టించాడు. కాంట్రాక్టర్లు కట్టే ఈఎండీలను తన సొంత ఖాతాలోకి మళ్లించుకున్నాడు. వాటితో పాటు ఆస్తి పన్ను మొత్తాలను, ఇతర రకాలుగా వచ్చే ఆదాయాలను కూడా తన సొంత ఖాతాలోకి మళ్లించుకున్నట్లుగా అధికారులు ఆలస్యంగా గుర్తించారు. గతంలో రాజేంద్రనగర్ సర్కిల్లో మేనేజర్‌గా పనిచేసి, రిటైరైన తర్వాత కూడా అక్కడే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న పాండురంగం ఈ వ్యవహారం మొత్తం నడిపించారు.
డీడీలు కట్టాల్సిందిగా కాంట్రాక్టర్లు ఇచ్చే మొత్తాలను కూడా ఆయన తన సొంతఖాతాలోకి వేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన దానిపై విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. దాంతో పాండురంగంపై రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తమ్మీద ఈ స్కాం భారీగానే జరిగినట్లు తెలుస్తోంది.