
స్పీకర్ నిర్ణయంపై కోర్టును ఆశ్రయిస్తాం
తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే టీ టీడీఎల్పీ కార్యాలయాన్ని ఇతరులకు కేటాయిస్తూ తెలంగాణ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి చెప్పారు.
టీ టీడీపీ కార్యాలయం వ్యవహారంపై రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే టీ టీడీఎల్పీ కార్యాలయాన్ని ఇతరులకు కేటాయిస్తూ తెలంగాణ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి చెప్పారు. అసెంబ్లీ ప్రాంగణంలో టీ టీడీఎల్పీ కార్యాలయం కొనసాగుతున్న 107, 110 నంబర్ గదులను అసెంబ్లీ క మిటీల చైర్మన్లకు కేటాయించడాన్ని నిరసించారు. మంగళవారమిక్కడ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, పార్టీ నేత రమేశ్‌రాథోడ్‌లతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు.
తమకు నోటీసులు ఇవ్వకుండా, గదులను తాము ఖాళీ చేయకుండానే ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. 107 నంబర్ గదిని ఉమెన్ వెల్ఫేర్ కమిటీ చైర్‌పర్సన్ రేఖానాయక్‌కు, 110 నంబరు గదిని మైనారిటీ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ షకీల్‌కు కేటాయిస్తూ ఈనెల ఒకటో తేదీన స్పీకర్ మధుసూదనాచారి నిర్ణయం తీసుకున్నారని వివరించారు.తమకు జరిగిన అన్యాయంపై కాంగ్రెస్, బీజేపీ నేతలు సంఘీభావం తెలిపారని, దీనిపై న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు.