సభలోకి రానివ్వకపోవడంపై నిరసన
సాక్షి, హైదరాబాద్: కీలక అంశమైన ముస్లిం రిజర్వేషన్ల పెంపుపై ఏర్పాటు చేసిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి తమను అనుమతించకపోవడం అప్రజాస్వామికమని టీటీడీపీ ఎమ్మెల్యేలు విమర్శించారు. బడ్జెట్ సమావేశాల్లో సస్పెండైన టీటీడీపీ ఎమ్మెల్యేలు ఎ.రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్యను ఆదివారం శాసనసభ సమా వేశంలో పాల్గొనకుండా చేయడంపై వారు ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. అసెంబ్లీ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట బైఠాయించి, తమ నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ నేతలతో కలసి రోడ్డుపైకి వచ్చి, సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముస్లింలకు రిజర్వేషన్ల పెంపుతో బీసీలకు అన్యాయం జరగకుండా జనాభా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు 52 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. కొద్దిసేపటి తర్వాత పోలీసులు రేవంత్‌రెడ్డితో పాటు సండ్ర వెంకటవీరయ్య, వేం నరేందర్‌రెడ్డి తదితరులను అరెస్టు చేసి, రాంగోపాల్‌పేట పోలీసుస్టేషన్‌కు తరలించారు.
రాష్ట్రాన్ని నిలువుదోపిడీ చేస్తున్న సీఎం
టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ ధ్వజం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ భూములు, ఆస్తులను కొల్లగొడుతూ సీఎం కె.చంద్రశేఖర్‌రావు నిలువుదోపిడీ చేస్తున్నారని టీటీడీఎల్పీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో కీలకమైన వారసత్వ భూములను మైహోమ్ రామేశ్వర్‌రావుకు అప్పగించడానికే వారసత్వ చారిత్రక కట్టడాల చట్టంలో సవరణలు తెస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణ ప్రజల సంపదను కేసీఆర్ తనకు కావాల్సినవారికి ఎలా దోచిపెడుతోంది ఆధారాలతో సహా ఇస్తానని, అన్ని మార్గాల్లో విచారణ చేసి ప్రజలకు అర్థమయ్యే విధంగా వెల్లడించాల్సిన బాధ్యత మీడియా ప్రతినిధులపై ఉందని అన్నారు. తెలంగాణ వారసత్వ సంపదను కొల్లగొడుతున్న విషయాన్ని తెలంగాణ సమాజం దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. ఇలాగే వదిలేస్తే తెలంగాణను ఓ రోజు కళేబరంలా చూడాల్సి వస్తుందని రేవంత్ హెచ్చరించారు.
ఇది అప్రజాస్వామికం: టీడీపీ
Published Mon, Apr 17 2017 1:17 AM | Last Updated on Tue, Oct 16 2018 5:59 PM
Advertisement