ప్రతిపక్షాలు లేకుండా చేసే కుట్ర | revanth reddy fire on kcr | Sakshi
Sakshi News home page

ప్రతిపక్షాలు లేకుండా చేసే కుట్ర

Published Wed, Jan 20 2016 3:47 AM | Last Updated on Sun, Sep 3 2017 3:55 PM

ప్రతిపక్షాలు లేకుండా చేసే కుట్ర

ప్రతిపక్షాలు లేకుండా చేసే కుట్ర

►  గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు భంగపాటు తప్పదు: రేవంత్‌రెడ్డి
►  హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది తామేనని వ్యాఖ్య

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతిపక్షాలు లేకుండా చేయాలని అధికార టీఆర్‌ఎస్ కుట్ర పన్నిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌రెడ్డి విమర్శించారు. వెనుకబడిన వర్గాలకు వేదికగా ఉన్న టీడీపీని టీఆర్‌ఎస్ నేతలు ఏమీ చేయలే రని.. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఈ విషయాన్ని ప్రజలు తమ ఓటు ద్వారా చాటిచెబుతారని వ్యాఖ్యానించారు. టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు.ప్రజాస్వామ్య చరిత్రలో ప్రతిపక్షం లేకుండా నియంతృత్వ పాలన సాగించిన వారెవరూ మనుగడ సాగించలేదని, ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు.
 
  తెలంగాణలో పేదలు, సామాన్యుల కోసం టీడీపీ పనిచేస్తుందన్నా రు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన చరిత్ర తెలుగుదేశం సొంతమని... ఏటా రూ. 60వేల కోట్ల ఆదాయం వచ్చే విధంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దిన ఘనత తమదేనన్నారు. ఎంపీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయాన్ని మాత్రమే చూస్తున్న మీడియా... టీడీపీ గెలిచిన సర్పంచ్, ఎంపీటీసీ ఉప ఎన్నికల గురించి పట్టించుకోలేదని చెప్పారు. గ్రేటర్‌లో ఎమ్మెల్సీ స్థానంలోనే టీఆర్‌ఎస్ ఓడిందని... జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మరోసారి భంగపాటు తప్పదని రేవంత్ వ్యాఖ్యానించారు.
 
  నారాయణఖేడ్‌లో టీడీపీని ఆంధ్రా పార్టీగా అభివర్ణిస్తూ విమర్శిస్తున్న టీఆర్‌ఎస్ నేతలు... గ్రేటర్‌లో మాత్రం రాష్ట్రం అంబానీ గ్రూప్‌లాగా విడిపోయి అభివృద్ధి చెందుతున్నట్లు మాట్లాడుతుండడం సిగ్గుచేటని, వ్యాపారం కోసం విడిపోయిన అంబానీలతో రెండు రాష్ట్రాలను పోల్చడం శోచనీయమని విమర్శించారు. గ్రేటర్‌లో టీఆర్‌ఎస్-ఎంఐఎం కూటమికి, టీడీపీ-బీజేపీకి కూటమికి మధ్యే పోటీ అన్నారు. వంద సీట్లు గెలిచి మేయర్ సీటు సాధించకుంటే మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్న కేటీఆర్ సవాల్‌ను స్వీకరించామని.. అయితే ఈ విషయంలో ఆయన స్పష్టత ఇవ్వడం లేదని పేర్కొన్నారు.
 
 హెచ్‌సీయూ ఘటన బాధ్యులపై  చర్యలు తీసుకోవాలి...

 హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు సంబంధించి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీల పాత్ర  ఉన్నట్లు ప్రచారం జరుగుతోందని ఓ విలేకరి ప్రస్తావించగా... ఎంతటి హోదా ఉన్నవారైనా తప్పు చేస్తే శిక్షించాల్సిందేనని రేవంత్ పేర్కొన్నారు. ఎన్నికల్లో పొత్తు రాజకీయంగా ఉంటుందే తప్ప ఆ పార్టీకి చెందిన నాయకులు చేసే తప్పులను సమర్థించడానికి కాదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement