సులభ వాణిజ్యం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) జాబితాలో రాష్ట్రానికి మెరుగైన ర్యాంక్ దక్కేందుకు..
ర్యాంకింగ్ కోసం సన్నద్ధతపై మంత్రి కేటీఆర్ సమీక్ష
సాక్షి, హైదరాబాద్: సులభ వాణిజ్యం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) జాబితాలో రాష్ట్రానికి మెరుగైన ర్యాంక్ దక్కేందుకు.. వివిధ ప్రభుత్వ విభాగాల్లో విప్లవాత్మకమైన విధానాలు అవలంబిస్తున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు వెల్లడించారు. పరిశ్రమల స్థాపన, వాణిజ్యానికి అనుకూలమైన వాతావరణం కల్పించడంలో రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే ర్యాంకింగ్‌లపై.. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాలు సన్నద్ధమవుతున్న తీరుపై మంత్రి కేటీఆర్ సోమవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. మున్సిపల్, పరిశ్రమలు, అటవీ, న్యాయ, విద్యుత్ శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
మెరుగైన ర్యాంక్ సాధించేందుకు అవసరమైన విధానాలను జూన్ నెలాఖరులోగా పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఇందులో చర్చించారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అనుమతులు కోరుతూ వచ్చిన దరఖాస్తులకు సంబంధించి.. తనిఖీలు, సర్వేలను వేగంగా పూర్తి చేస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని 73 మున్సిపాలిటీలకు గాను.. 32 మున్సిపాలిటీలకు సంబంధించిన మాస్టర్ ప్లాన్లను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశామని.. డీటీసీపీ తనిఖీ నివేదికలను కూడా 48 గంటల్లో అప్‌లోడ్ చేయడాన్ని తప్పనిసరి చేశామని మున్సిపల్ విభాగం అధికారులు వెల్లడించారు. కాగా, పరిశ్రమల భవనాల నిర్మాణాలకు 48 గంటల్లో ఆన్‌లైన్ విధానంలో అనుమతి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు.
విద్యుత్ సరఫరాకు సంబంధించి పారిశ్రామిక వాడల్లో స్కాడా విధానం అమలు చేయాలని, విద్యుత్ సేవల పునరుద్ధరణకు ఆటోమేటెడ్ విధానం అనుసరించాలని మంత్రి సూచించారు. కార్మిక, ఉపాధి కల్పన, శిక్షణ, బాయిలర్స్ విభాగాలకు సంబంధించిన సన్నద్ధతను కేటీఆర్ తెలుసుకున్నారు. సులభ వాణిజ్యంలో మెరుగైన ర్యాంకు సాధించేం దుకు న్యాయశాఖ పరిధిలో రూపొందించాల్సిన విధానాలపై హైకోర్టు రిజిస్ట్రార్‌తో పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు సమావేశం కావాలని ఆదేశించారు.