
అవినీటి దందా
రూ.వంద కోట్ల వ్యాపారం శివార్లలో జోరుగా అక్రమాలు
{పమాదంలో తాగునీటి నాణ్యత చోద్యం చూస్తున్న అధికారులు
ఐఎస్‌ఐ ప్రమాణాలున్న నీటి ఫిల్టర్ ప్లాంట్లు 450...
{పమాణాలు లేనివి సుమారు ఐదు వేలు..!
కుళాయి తిప్పితే అరకొర మంచినీళ్లు... బోరుబావి తవ్వినా కానరాని నీటిబొట్టు... పాతాళానికి చేరిన భూగర్భజలాలు... జలమండలి ట్యాంకర్ బుక్‌చేసుకున్నా తీరని దాహార్తి.. ఎండాకాలం శివార్లలో సుమారు వెయ్యి కాలనీల్లో నివసిస్తున్న 30 లక్షల మంది వరకు పానీపరేషాన్‌తో విలవిల్లాడుతున్నారు. ఇదే అదునుగా భావించిన అక్రమార్కులు నీటి దందాకు తెరలేపారు. కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా శుద్ధి చేయని జలాలను మినరల్ వాటర్ పేరుతో అంటగడుతున్నారు. ఇంట్లోనే ప్లాంట్‌లు ఏర్పాటు చేసి నీళ్లను అమ్మేస్తున్నారు. అక్రమార్కులను కట్టడి చేయాల్సిన సంబంధిత శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. మహానగర పాలక సంస్థలో విలీనమైన శివారు మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో వాస్తవ చిత్రం కన్నీటి వ్యథ గానే మిగులుతోంది. పెరుగుతున్న నిత్యావసరాలకు తోడు మంచినీళ్లను కూడా అధిక ధరలకు కొనుగోలుచేస్తుండడంతో సిటీజనుల ఇంటి బడ్జెట్ చుక్కలను తాకుతోంది.
సిటీబ్యూరో/నెట్‌వర్‌క: గ్రేటర్‌లో నెలకు వంద కోట్ల రూపాయలకు పైగా మంచినీటి వ్యాపారం జరుగుతోందని మార్కెట్ వర్గాలు అంచనావేస్తున్నాయి. భారతీయ ప్రమాణాల సంస్థ(బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) నిర్దేశించిన మేరకు ప్రమాణాలను పాటించకుండానే గుర్తింపులేని ఫిల్టర్‌ప్లాంట్లలో భూగర్భ జలాలను అరకొరగా శుద్ధిచేసి ప్యాకేజ్డ్ నీటి పేరుతో విక్రయిస్తున్న నిర్వాహకులకు అడ్డూఆపూ లేకుండా పోయింది. మహానగరం పరిధిలో ఐఎస్‌ఐ నాణ్యతా ప్రమాణాలున్న ప్లాంట్లు 450 కాగా.. అనధికారికంగా పుట్టగొడుగుల్లా వెలిసినవి ఐదువేలకు పైగానే ఉండడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. బీఐఎస్ సంస్థ నుంచి లెసైన్స్ తీసుకోవడం, ప్లాంట్ నిర్మాణం, నాణ్యతా ప్రమాణాల తనిఖీ ల్యాబ్ నిర్మాణానికి రూ.25 లక్షల వరకు ఖర్చవుతుంది. అదే అనుమతి లేకుండా ఇంట్లోనే నాసిరకం ప్లాంటును ఏర్పాటుచేస్తే రూ.2 లక్షలే వ్యయం అవుతోంది. దీంతో అక్రమార్కులు వీటినే ఏర్పాటుచేస్తుండడం గమనార్హం. ప్రతినెలా జీహెచ్‌ఎంసీ పరిధిలో నెలకు సుమారు 20 లక్షల నీటిక్యాన్లు(20 లీటర్లవి) అమ్ముడవుతున్నాయి. వీటిలో ప్రముఖ బ్రాండ్లకు చెందినవి కేవలం ఐదు లక్షలు మాత్రమే. మరో ఐదు లక్షల క్యాన్లు ఐఎస్‌ఐ గుర్తింపు పొందిన ఫిల్టర్ నీటి ప్లాంట్లలో తయరవుతున్నాయి. ఇక పదిలక్షల క్యాన్లు అనధికారిక ప్లాంట్లలో తయారవుతున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థంచేసుకోవచ్చు.
బస్టాండ్లు,రైల్వేస్టేషన్లు, క్యాంటీన్లు,హోటళ్లలో విక్రయిస్తున్న మంచినీటి బాటిళ్ల సంఖ్య(లీటరువి) సుమారు 50 లక్షల వరకు ఉంటుంది. వీటిలోనూ సగం బాటిళ్లకే ఐఎస్‌ఐ గుర్తింపు ఉంది. మొత్తంగా నీటి వ్యాపారం నెలకు వందకోట్ల మేర ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా. నగరంలో 13 సంవత్సరాల క్రితం ప్రారంభమైన మంచినీటి వ్యాపారం ప్రతి ఏటా 20 శాతం వృద్ధితో పురోగమిస్తుండడం గమనార్హం. జలమండలి సరఫరా చేస్తున్న మంచినీటి నాణ్యత, స్వచ్ఛతపై నమ్మకం లేకపోవడంతో మధ్యతరగతి వర్గం, ఉద్యోగులు, వ్యాపారులు ప్యాకేజీ నీటినే ఆశ్రయిస్తున్నారు. కార్పొరేట్ సంస్థలు మినరల్ వాటర్‌ను కొనుగోలు చేస్తున్నాయి.
చోద్యం చూస్తున్న సర్కారు విభాగాలు
శివారు మున్సిపాల్టీల్లో నీటి వ్యాపారం ఊపందుకున్నా.. అనుమతిలేకుండా బోరుబావులు తవ్వి ట్యాంకర్ల ద్వారా మంచినీటిని విక్రయిస్తున్న ముఠాలను కట్టడిచేయడంలో రెవెన్యూ యంత్రాంగం పూర్తిగా విఫలమౌతోంది. ఫిల్టర్‌ప్లాంట్లలో నీటి నాణ్యతను తనిఖీ చేయడంలో జీహెచ్‌ఎంసీ, జలమండలి, ఇన్సిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ సంస్థలు చోద్యం చూస్తున్నాయి. దీంతో హైటెక్‌సిటీకి నెలవైన శేరిలింగంపల్లికీ కన్నీటి కష్టాలే. ఉప్పల్,మల్కాజ్‌గిరి, ఎల్బీనగర్, రాజేంద్రనగర్, అల్వాల్, కాప్రా తదితర ప్రాంతాల్లో నీటి వ్యాపారం మూడు క్యాన్లు.. ఆరు ట్యాంకర్లు అన్న చందంగా జోరుగా సాగుతోంది. ఉదాహరణకు కూకట్‌పల్లి మున్సిపాల్టీ పరిధిలోని నిజాంపేట్‌రోడ్, ఎల్లమ్మబండ చౌరస్తాల్లో విచ్చలవిడిగా బోరుబావులు తవ్వి బహిరంగంగా నీటివ్యాపారం చేస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. బస్తీలకు ఉచితంగా మంచినీటిని తరలించాల్సిన జలమండలి ఫ్రీ ట్యాంకర్లను హోటళ్లు, హాస్టళ్లకు, బిలర్డర్లకు అధిక ధరలకు సరఫరాచేస్తున్నా జలమండలి మొద్దునిద్ర వీడడంలేదు.
అక్రమాలకు కొన్ని సాక్ష్యాలివిగో..
దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట్, అక్బర్‌బాగ్, అజంపుర, సైదాబాద్, ఐఎస్‌సదన్, మాదన్నపేట్, ఆర్‌కేపురం, సరూర్‌నగర్, ఎన్‌టీఆర్‌నగర్, జిల్లెలగూడ, మీర్‌పేట్, గుర్రంగూడ, బాలాపూర్, బడంగ్‌పేట్, పహాడీషరీఫ్ తదితర ప్రాంతాల్లో అనుమతులు లేని అక్రమ ఫిల్టర్ ప్లాంట్లు నడుస్తున్నాయి. పలు కాలనీలు, గ్రామాలు, బస్తీలలో మినిరల్ వాటర్ పేరుతో కొందరు వాటర్ ప్లాంట్ల నిర్వాహకులు కనీస ప్రమాణాలు, పరిశుభ్రత పాటించకుండా మినరల్‌వాటర్ బాటిళ్లలో అరకొరగా శుద్ధిచేసిన నీటిని నింపుతున్నారు. వీటికి వివిధ రకాల పేర్లతో ఉన్న లేబుళ్లు అంటించి విక్రయిస్తున్నారు. ఒక్కో క్యాను ధర రూ.25 నుంచి రూ.35 వరకు ఉంది.
కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలో వీధికో ఫిల్టర్‌నీటి ప్లాంట్లు ఏర్పాటు చేసి వాటి నిర్వాహకులు జేబులు నింపుకుంటున్నారు. స్థానిక వెంకట్రామిరెడ్డినగర్‌లో రెండు ప్లాంట్లు పూర్తిగా అపరిశుభ్రంగా ఉన్నాయి. కొన్ని ప్లాంట్లలో బాలకార్మికులతో పనులు చేయిస్తుండడం గమనార్హం. భగత్‌సింగ్‌నగర్ చెరువు కట్టపై ఏకంగా నాలుగు ప్లాంట్లు ఉన్నాయి. సూరారం కాలనీలోకి ఎంబీ గ్రామర్ స్కూల్ వెనుక, సూరారం మార్కెట్ రోడ్డులో ఇంట్లోనే ప్లాంట్ ఏర్పాటు చేసి నీటి వ్యాపారం చేస్తుండడంతో సమీపంలో ఉన్న బోరుబావులన్నీ వట్టిపోయాయి.
ఉప్పల్ సర్కిల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో బోరు నీళ్లను అరకొరగా శుద్ధిచేసి మినరల్ వాటర్ పేరిట విక్రయిస్తున్నారు. రామంతాపూర్, నాచారం, మల్లాపూర్, కుషాయిగూడ, చర్లపల్లి, బోడుప్పల్, హబ్సిగూడ, పర్వాతాపూర్, పిర్జాదిగూడ, మేడిపల్లి తదితర ప్రాంతాల్లో నిర్వహించే అక్రమ వాటర్ పిల్టర్స్‌లో బోర్ నీరునే నింపుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల్లో బోర్లు వేసి మరి దర్జాగా ట్యాంకర్లకొద్దీ నీటిని విక్రయిస్తున్నారు. మల్లాపూర్ బాబానగర్‌లో ప్రాతంలో ఇళ్లలో వేసిన బోర్లకు వాటర్ ప్లాంట్లు బిగించి జోరుగా వ్యాపారం కోనసాగిస్తున్నారు. మరి కొన్ని ప్లాంటు నేరుగా ఐఎస్‌ఐ ముద్రను సైతం ముద్రించి ప్రజలను నిలువునా దోపిడీ చేస్తున్నాయి. బోర్ల నుంచి వచ్చిన ఉప్పల్ నియోజకవర్గం పరిధిలో దాదాపు వందకు పైగానే అక్రమ ప్లాంట్లు ఉన్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థంచేసుకోవచ్చు.
ఫిల్టర్ ప్లాంట్ల నీటితో జాగ్రత్త...
నగరంలో ప్రమాణాలు పాటించని ప్లాంట్లలో తయారు చేస్తున్న ప్యాకేజీ వాటర్‌లో కోలిఫాం, పాథోజెన్స్, ఇ.కోలి, సిట్రోబ్యాక్టర్ ఆనవాళ్లున్నాయి. ఈ నీటిని తాగిన వారికి వాంతులు, విరేచనాలు, కామెర్లు, జీర్ణసంబంధిత వ్యాధులు సంభవిస్తున్నాయి. జంటనగరాలు, శివారు ప్రాంతాల్లో ఐఎస్‌ఐ గుర్తింపు పొందిన వాటర్ ప్లాంట్లు 450 వరకు ఉన్నాయి. ఇక పుట్టగొడుగుల్లా వీధికొకటి వెలిసిన ప్లాంట్లు ఐదువేలకు పైగానే ఉన్నాయి. ఐఎస్‌ఐ గుర్తింపు లేని ప్లాంట్లలో నీటినమూనాలను పరీక్షించే ల్యాబ్, నిపుణులు, మైక్రోబయాలజిస్ట్‌లు లేరు. అపరిశుభ్ర పరిసరాలు,పారిశ్రామిక వాడలు, మురికివాడలు, ఇరుకైన గదుల్లో వెలిసినవే అధిక సంఖ్యలో ఉన్నాయి.
అనధికారిక ప్లాంట్లలో ప్రతి 20 లీటర్ల నీటి శుద్ధికి నిర్వాహకులు రూ. 4 ఖర్చుచేస్తున్నారు. జనం నుంచి రూ. 25 నుంచి రూ. 30 వరకు దోచుకుంటున్నారు. ఐఎస్‌ఐ ప్రమాణాలున్న నీటికి రూ. 15 వ్యయం చేయాలి. వీటి ధర బహిరంగ మార్కెట్లో రూ. 35 నుంచి రూ. 80 వరకు పలుకుతోంది. ఐఎస్ ప్రమాణాల ప్రకారం నీటిని నింపే సీసాలు, క్యాన్లు పాలీ ఇథిలిన్, పాలివినైల్ క్లోరైడ్, పాలీప్రొపిలీన్‌లతో తయారైన వాటిని వినియోగించాలి. వీటి ధర రూ.280 నుంచి రూ.400(20 లీటర్ల డబ్బా) వరకు ఉం టుంది. కానీ ధర ఎక్కువన్న కారణంతో తక్కువ ధరకు దొరికే నాసిరకం పెట్‌బాటిల్స్‌ను వినియోగిస్తున్నారు. వీటి ధర రూ.100 నుంచి రూ.120 లోపుగానే ఉంటుంది. వీటిలో త్వరలో బ్యాక్టీరియా వృద్ధి చెందుతోంది.
భూగర్భజలాన్ని శుద్ధిచేసే సమయంలో ఫిల్ట్రేషన్,ఏరేషన్, కార్బన్‌ఫిల్ట్రేషన్..ఇలా 12 రకాల శుద్ధిప్రక్రియలు నిర్వహిస్తున్న వారు వేళ్లమీద లెక్కపెట్టే సంఖ్యలోనే ఉన్నారు.శుద్ధిచేసిన 48 గంటల తరవాతనే బాటిళ్లలో మంచినీటిని నింపాలి. కానీ వెంటనే నింపుతున్నారు. దీంతో నీటి గాఢత పడిపోతుంది. ఈనీటిని తాగిన వారికి గొంతు సంబంధిత సమస్యలు వస్తున్నాయి.
వందకోట్ల నీళ్లవ్యాపారం లెక్క ఇదీ..
{Vేటర్ పరిధిలో నివాస సముదాయాలు : సుమారు 25 లక్షలు
జలమండలి నల్లా కనెక్షన్లున్న భవనాలు: 8.90 లక్షలు
నల్లా కనెక్షన్లు లేని కుటుంబాలు: సుమారు 16.10 లక్షలు
{Vేటర్ పరిధిలో బోరుబావులు: సుమారు 22 లక్షలు
ఈ వేసవిలో వట్టిపోయిన బోరుబావులు: సుమారు 14 లక్షలు
నెలకు నీళ్లకోసం గ్రేటర్ వాసుల ఖర్చు: సుమారు వందకోట్లు
(బీఐఎస్)ప్రమాణాలు పాటిస్తున్న ఫిల్టర్ ప్లాంట్లు: సుమారు 450
బీఐఎస్ గుర్తింపు లేని ప్లాంట్లు: సుమారు ఐదువేలు
ఒక్కో కుటుంబం ఫిల్టర్ నీళ్లు కోసం చేస్తున్న వ్యయం
( నెలకు): రూ. వెయ్యి నుంచి ఐదు వేలు
ప్యాకేజీ నీటిని కొనేముందు...
మీరు కొనుగోలు చేస్తున్నది బాటిల్ లేదా క్యాన్, ప్యాకెట్ అయినా సరే ఐఎస్‌ఐ మార్కు, దానికింద 14543 నెంబరు, బ్యాచ్‌నెంబరును పరిశీలించాలి. లేబుల్‌పై తయారీదారు పూర్తిచిరునామా ఉండాల్సిందే. ఇవి లేకుండా కొనుగోలుచేస్తే మీరు రోగాలను కొనితెచ్చుకున్నట్లేనని గుర్తించాలి.
ఐఎస్‌ఐ నిబంధనలు
ప్యాకేజీ వాటర్ ఎలా ఉండాలన్న అంశంపై భారతీయ ప్రమాణాల సంస్థ 60 రకాల ప్రమాణాలను రూపొందించింది. వీటిని ఐఎస్14543:2004 నిబంధనలుగా పేర్కొంటారు. భూగర్భజలాన్ని సేకరించి శుద్ధిచేస్తున్న వాటర్‌ప్లాంట్ల నిర్వాహకులు ఈ ప్రమాణాల ప్రకారమే ప్లాంట్లు నెలకొల్పాల్సి ఉంటుంది. అప్పుడే బీఎస్‌ఐ సంస్థ ఐఎస్‌ఐ మార్కును కేటాయిస్తుంది. కేవలం ఐఎస్‌ఐ ధ్రువీకరణకే నిర్వాహకులు ఏటా లక్ష రూపాయలు ఖర్చుచేయాలి. ఈ వ్యయంతో తయరు చేస్తున్న మంచినీటికి బీఐఎస్ సంస్థ 60 రకాల పరీక్షలు నిర్వహిస్తుంది. కానీ ఇవేవీ లేకుండా మహానగరంలో సుమారు ఐదువేల ఫిల్టర్‌ప్లాంట్లు నాణ్యతకు నీళ్లొదిలి యథేచ్ఛగా నీటివ్యాపారం చేస్తున్నాయి.