నర్సుగా చెప్పుకుని ఇంట్లో చేరి.. నగలు, ఖరీదైన వస్తువులను తస్కరించే ఓ మహిళను జూబ్లీహిల్స్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు.
నర్సుగా చెప్పుకుని ఇంట్లో చేరి.. నగలు, ఖరీదైన వస్తువులను తస్కరించే ఓ మహిళను జూబ్లీహిల్స్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. బంజారాహిల్స్ ఏసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్లు కె. ముత్తు, సామల వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాలివీ.. గుంటూరు జిల్లా గురజాల మండలం రెంటచింతల గ్రామానికి చెందిన మేరి సునీత(38) నర్సుగా పని చేస్తూ మెహిదీపట్నం అయోధ్య నగర్‌లో నివసిస్తోంది. వృద్ధాశ్రమాల్లో తన పేరును నమోదు చేయించుకొని ఎవరికైనా నర్సుగా సేవలు కావాలంటే అందిస్తానంటూ చెప్పేది.
ఈ మేరకు ఆమెను ఎవరికైనా నర్సుగా సేవలు కావాలన్నప్పుడు పంపించేవారు. అలా, ఈ నెల 9వ తేదీన జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-44లో నివసించే రత్న అనే వృద్ధురాలికి సేవల కోసం వాళ్లింట్లో చేరింది. ఆమెకు స్నానం చేయించేందుకు బాత్‌రూంలోకి తీసుకెళ్లింది. టవల్ తెస్తానంటూ బయటకు వచ్చి బాత్‌రూం తలుపులు మూసి బయట నుంచి గడియవేసి రత్న మంగళసూత్రంతో పాటు గొలుసును తస్కరించి పరారైంది.
అదే రోజు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నెల 23న వెంగళ్‌రావునగర్‌లో ల్యాప్‌టాప్‌ను, ఏప్రిల్ 30న మరో ఇంట్లో ఐపాడ్‌ను దొంగిలించింది. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఆమె సెల్ నంబర్లను ట్రేస్ చేశారు. ఆమె రాజమండ్రిలోని ఓ లాడ్జిలో బస చేసినట్లు తెలుసుకొని అరెస్టు చేశారు. ఇప్పటి వరకు ఆమె 13 దొంగతనాల్లో నిందితురాలుకాగా అయిదుసార్లు జైలుకు వెళ్లివచ్చినట్లు విచారణలో వెల్లడైంది. ఆమె నుంచి 12 తులాల బంగారు ఆభరణాలు, ల్యాప్‌టాప్, ఐపాడ్‌లను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు.