
రోహిత్ మృతికి వీసీ, కేంద్రానిదే బాధ్యత: రాహుల్
హైదరాబాద్ : దళిత విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య దురదృష్టకరమని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. అతని మృతికి హెచ్సీయూ వైస్ ఛాన్సలర్, కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. పీహెచ్డీ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో రాహుల్ గాంధీ మంగళవారం హెచ్సీయూ పర్యటించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ తాను రాజకీయాలు చేయడానికి ఇక్కడకు రాలేదని, యూనివర్సిటీల్లో పక్షపాత ధోరణి సరికాదన్నారు. వర్సిటీ విద్యార్థులు తమ భావాలను వెల్లడించే స్వేచ్ఛ విద్యార్థులకు ఉందన్నారు. అందుకు విశ్వవిద్యాలయాలు వేదికగా ఉండాలన్నారు.
రోహిత్ మృతికి కారణమైనవారిని కఠినంగా శిక్షించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. అలాగే అతని కుటుంబానికి పరిహారం చెల్లించడంతో పాటు ఉద్యోగం ఇవ్వాలని అన్నారు. విద్యార్థుల గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. విద్యార్థులకు హక్కులు కల్పించే చట్టాలను తీసుకురావాలన్నారు. ఎప్పుడు అవసరం అయినా విద్యార్థులకు తాము అండగా ఉంటామని రాహుల్ హామీ ఇచ్చారు. వీసీకి డీసెన్సీ, డిగ్నిటీ లేవని, యూనివర్సిటీ విద్యార్థి చనిపోతే పరామర్శించే బాధ్యత వీసీకి బాధ్యత లేదా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. దళిత విద్యార్థులను వీసీ అణగదొక్కారని రాహుల్ ఆరోపించారు. అంతకు ముందు రాహుల్...రోహిత్ తల్లి రాధికను పరామర్శించారు. అనంతరం సస్పెండ్ అయిన పీహెచ్డీ విద్యార్థులతో ఆయన మాట్లాడారు. సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు.