దేశవ్యాప్తంగా హిందువులందరినీ ప్రాంతాలకతీతంగా సంఘటిత పరిచి, జాతీయ సమైక్యతకు ఆర్‌ఎస్‌ఎస్ పునాదిగా నిలిచిందని బీడీఎల్ సీనియర్ సైంటిస్ట్ ఎన్.సంపత్ కుమార్ అన్నారు.
- బీడీఎల్ సీనియర్ సైంటిస్ట్ సంపత్ కుమార్
హైదరాబాద్: దేశవ్యాప్తంగా హిందువులందరినీ ప్రాంతాలకతీతంగా సంఘటిత పరిచి, జాతీయ సమైక్యతకు ఆర్‌ఎస్‌ఎస్ పునాదిగా నిలిచిందని బీడీఎల్ సీనియర్ సైంటిస్ట్ ఎన్.సంపత్ కుమార్ అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం కాచిగూడ నెహ్రూనగర్ ప్లే గ్రౌండ్‌సలో విజయదశమి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సంపత్‌కుమార్ మాట్లాడుతూ భారతదేశాన్ని కొన్ని శక్తులు విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు చేస్తున్నాయని అన్నారు. వాటిని తిప్పికొట్టేందుకు హిందువులంతా సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. ఆర్‌ఎస్‌ఎస్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఎక్కా చంద్రశేఖర్ మాట్లాడుతూ లక్ష ప్రాంతాల్లో ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమాలన్నీ దేశంలో మార్పు కోసమేనని అన్నారు.
కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ యువతలో దేశభక్తిని పెంపొందించడంలో ఆర్‌ఎస్‌ఎస్ ఎంతగానో కృషి చేస్తుందన్నారు. భారత్‌ను విచ్ఛిన్నం చేయడానికి పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని ఆరోపించారు. భారత సైన్యానికి యావత్ యువత అండగా నిలవాలని కోరారు. ఈ సందర్భంగా కాచిగూడ, బర్కత్‌పుర, నెహ్రూనగర్ తదితర ప్రాంతాల్లో ఆర్‌ఎస్‌ఎస్ స్వయం సేవకులు మార్చ్‌ఫాస్ట్ నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి, బర్కత్‌పుర భాగ్ సంఘచాలక్ రావి రామలింగారెడ్డి, సురేశ్ మంజునాథ్, డీఆర్‌ఎస్ నరేంద్ర, కన్నె రమేశ్ యాదవ్, ఎ.సూర్యప్రకాశ్ సింగ్ పాల్గొన్నారు.