=ప్రమాదాలకు నిలయం.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంతం
=అడ్డగోలు పార్కింగ్‌లు.. కానరాని బస్‌షెల్టర్లు
సాక్షి, సిటీబ్యూరో/ సికింద్రాబాద్, న్యూస్‌లైన్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాల్లో ప్రయాణికులకు రక్షణ కరువవుతోంది. అడ్డదిడ్డంగా నిలుపుతున్న బస్సులు, డ్రైవర్ల దూకుడు ప్రయాణికులను అయోమయానికి గురి చేయడంతోపాటు, నిండు ప్రాణాలను బలిగొంటున్నాయి. ఈ ప్రాంతంలో ఆర్టీసీ బస్సులు ఢీ కొడుతున్న ప్రమాదాల్లో పలువురు మృత్యువాత పడుతుండగా, మరెందరో క్షతగాత్రులవుతున్నారు.
బుధవారం ఉదయం మేడ్చల్ డిపోకు చెందిన ఒక ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఒక ద్విచక్రవాహనం పెకైక్కిన ఆర్టీసీ బస్సు ఏడుగురిని గాయపరిచింది. అదృష్టవశాత్తు ఫుట్‌పాత్‌ను ఢీ కొట్టి బస్సు నిలిచిపోయింది. లేకుంటే పలువురు ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలిసేవి. డ్రైవర్ల నిర్లక్ష్యం, తొందరపాటుతనం ఫలితంగా రేతిఫైల్ బస్‌స్టేషన్ ప్రాంతంలో ప్రయాణికుల ప్రాణాలు కనురెప్ప పాటున గాలిలో కలుస్తున్నాయి.
రహదారులపైనే బస్‌స్టాప్‌లు
రేతిఫైల్ బస్‌స్టేషన్‌తోపాటు రైల్వేస్టేషన్‌ను ఆవరించి ఉన్న ఆరు బస్‌స్టాపుల్లో ఎక్కడా ప్రయాణికులకు కాసేపు నిల్చునేందుకైనా అనువైన వాతావరణం లేదు. స్టేషన్ ప్రాంతంలోని ఉప్పల్ బస్టాప్, చిలకలగూడ చౌరస్తా, గురుద్వార్, 31 బస్టాప్ ప్రాంతాల్లో రహదారులపైనే అడ్డదిడ్డంగా నిలుపుతున్న బస్సులు ఎక్కడానికి మహిళలు, వృద్ధులు పడరాని పాట్లు పడుతున్నారు.
దురాక్రమణలో ఫుట్‌పాత్‌లు
ఆల్ఫా హోటల్ మొదలు, రామకృష్ణ హోటల్ వరకు రైల్వేస్టేషన్ ముందుగల ప్రధాన రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. ఇష్టారాజ్యంగా నిలుపుతూ, తిప్పుతున్న ఆర్టీసీ బస్సుల ద్వారా సంభవిస్తున్న ప్రమాదాలకు దూరంగా ఉండేందుకు ఫుట్‌పాత్‌లు సైతం కనుమరుగయ్యాయి. రహదారికి ఇరువైపులా ఏర్పాటు చేసిన ఫుట్‌పాత్‌లు పూర్తిగా దురాక్రమణలకు గురై వ్యాపార వాణిజ్య కేంద్రాలకు నిలయంగా మారిపోయినా ఆర్టీసీ, పోలీసు అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు.
కానరాని స్కై వాక్
ఆల్ఫా హోటల్ మొదలు, రామకృష్ణ హోటల్ వరకు రైల్వేస్టేషన్ ముందుగల ప్రధాన రహదారి వరకు పాదచారుల కోసం స్కై వాక్ (ఆకాశ వంతెన) నిర్మిస్తామని జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రకటించి రెండేళ్లవుతున్నా ఆ దిశగా కనీసం ప్రతిపాదనలు సైతం నేటికీ సిద్ధం కాలేదు. స్కై వాక్ ప్రతిపాదనలకు ముందే ఈ రహదారిపై రెండు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మించాలన్న ప్రతిపాదనలు సైతం కార్యరూపం దాల్చలేదు. ఈ రహదారిని వన్ వే చేయడం మినహా ఇక్కడ ప్రమాదాలను, ట్రాఫిక్‌ను నియంత్రించడం సాధ్యపడదని నిపుణులు చెబుతున్నారు.
వన్ వే చేయండి
ఎప్పుడూ రద్దీగా ఉండే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ప్రధాన రహదారిని వన్ వే చేసి ప్రమాదాలను నివారించాలని సికింద్రాబాద్ గణపతి దేవాలయం ధర్మకర్తల మండలి కోరింది. ఈ మేరకు మండలి చైర్మన్ పి. సుస్మిత పోలీసు అధికారులకు బుధవారం లేఖ రాశారు.
మచ్చుతునకలివీ... 2013 ఫిబ్రవరి 14
గుంటూరు జిల్లా కొత్తపేటకు చెందిన వ్యాపారి రామారావు భార్య అరుంధతి (61) రైల్వేస్టేషన్‌లోకి వెళ్లేందుకు సికింద్రాబాద్ రేతిఫైల్ చేరుకోగానే హయత్‌నగర్ డిపోకు చెందిన ఏపీ10జడ్7808 నెంబర్‌గల ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం ఫలితంగా ప్రాణాలు కోల్పోయింది.
2013 సెప్టెంబర్ 12
మూసాపేట్ చేపల వ్యాపారి రాందులారి (50) వ్యాపారం పనిమీద సికింద్రాబాద్ చేరుకుని ఒక బస్సు దిగి రోడ్డు దాటే ప్రయత్నం చేస్తుండగా మరోబస్సు రివర్స్ తీయడంతో రెండు బస్సుల మధ్య నలిగిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు.
2013 నవంబర్ 20
రేతిఫైల్ బస్‌స్టేషన్ ఎదురుగా మేడ్చల్ డిపోకు చెందిన ఏపీ 29 జడ్ 1639 నెంబర్‌గల ఆర్టీసీ బస్సును వేగంగా నడిపించడంతో ద్విచక్రవాహనంపై వెళుతున్న ఇరువురు, పాదచారులు ఆరుగురు తీవ్ర గాయాల పాలయారు.
ఆర్టీసీ డ్రైవర్ల దూకుడు
Published Thu, Nov 21 2013 3:48 AM | Last Updated on Fri, Oct 5 2018 8:51 PM
Advertisement