- హెచ్‌ఎండీఏలో స్తంభించిన పాలన
- కమిషనర్ లేక 35 ఫైళ్లు మూలకు..
- కీలక ఫైళ్లను తిప్పిపంపిన ప్రదీప్ చంద్ర
- ఇన్‌చార్జి బాధ్యతలు స్వీకరించని జనార్దన్‌రెడ్డి
- త్రిశంకు స్వర్గంలో మహా నగరాభివృద్ధి సంస్థ
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)లో పాలన పూర్తిగా స్తంభించిపోయింది. అత్యవసర ఫైళ్లను సైతం పరిశీలించే నాథుడే కరవయ్యాడు. రెండ్రోజుల వ్యవధిలోనే సుమారు 35 ఫైళ్లు మూలకు పడ్డాయి. ఇటీవల జరిగిన ఐఏఎస్ అధికారుల బదిలీల్లో హెచ్‌ఎండీఏ ఇన్‌చార్జి కమిషనర్‌గా ఉన్న కె.ప్రదీప్ చంద్రను ప్రభుత్వం ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బదిలీ చేసిన విషయం తెలిసిందే. హెచ్‌ఎండీఏ కమిషనర్ (ఎఫ్‌ఏసీ) బాధ్యతలను మునిసిపల్ అడ్మిస్ట్రేషన్ కమిషనర్/డెరైక్టర్‌గా వ్యవహరిస్తున్న బి.జనార్దన్‌రెడ్డికి అప్పగించింది.
అయితే, వారం రోజులు గడిచినా ఇంతవరకు ఆయన బాధ్యతలను స్వీకరించకపోవడంతో హెచ్‌ఎండీఏలో ఎక్కడి ఫైళ్లు అక్కడే నిలిచిపోయాయి. ఇటీవలి వరకు అత్యవసర ఫైళ్లను ప్రదీప్ చంద్ర పరిశీలించి పరిష్కరిస్తుండటంతో పాలన సాఫీగా సాగింది. ఈ క్రమంలోనే గత శనివారం సుమారు 20 ఫైళ్లను సచివాలయంలోని ప్రదీప్ చంద్ర కార్యాలయానికి హెచ్‌ఎండీఏ అధికారులు పంపారు. వాటిలో ఒక్క ఫైల్‌ను కూడా ఆయన పరిశీలించకుండా తిప్పి పంపడం అధికారులను విస్మయానికి గురిచేసింది. ప్రస్తుతం ప్రదీప్ చంద్ర ఆర్థిక శాఖ చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నందున హెచ్‌ఎండీఏకు చెందిన ఆర్థిక పరమైన ఫైళ్లకు అప్రూవల్ ఇస్తే..
ఆర్థిక శాఖలో మళ్లీ తానే వాటిని పరిశీలించాల్సి ఉంటుంది. సాంకేతికంగా ఇందులో కొంత ఇబ్బందులు ఉన్నందున ఆ ఫైళ్లను చూసేందుకు ప్రదీప్ చంద్ర విముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. ఆ 20 ఫైళ్లకు సోమవారం మరో 15 ఫైళ్లు తోడవ్వడంతో మొత్తం 35 ఫైళ్లు పెండింగ్‌లో పడిపోయాయి. వీటిలో 90 శాతం ఫైళ్లు ప్లానింగ్ విభాగానికి చెందినవే కావడంతో వాటిని పరిష్కరించక పోవడం వల్ల సంస్థకు ఫీజు రూపంలో రావాల్సిన ఆదాయం తాత్కాలికంగా నిలిచిపోయింది.
తిరోగమనంలోకి..
హెచ్‌ఎండీఏకు పూర్తిస్థాయి కమిషనర్ లేకపోవడం, ఇన్‌చార్జి కమిషనర్ కూడా బాధ్యతలు స్వీకరించక పోవడంతో సంస్థ తిరోగమనంలో పయనిస్తోంది. కీలకమైన ఆర్థిక ఫైళ్లు ఆగిపోవడం వల్ల ఆ ప్రభావం అన్ని విభాగాలపై పడుతోంది. ప్రధానంగా ప్లానింగ్, ఇంజనీరింగ్, అకౌంట్స్ విభాగాల్లో రోజూవారీ కార్యకలాపాలు స్తంభించిపోతాయి. ఆదాయ మార్గాలు మూసుకుపోవడంతో ఎస్టీపీల నిర్వహణ, కరెంట్ బిల్లులు, జీతాలు, బకాయిలకు వడ్డీలు, ఇతర చెల్లింపుల వంటివి భారంగా మారి సంస్థ మనుగడే ప్రమాదంగా మారింది. ఎలాగూ ఫైళ్లు ఆగిపోతున్నాయి గనుక.. మిగతావి చేయడం ఎందుకన్న ఉద్దేశంతో సిబ్బంది నిర్లక్ష్యంగా పనులు పక్కకు పెట్టే ప్రమాదం ఉంది.
జీహెచ్‌ఎంసీలో విలీనం..?
త్వరలో హెచ్‌ఎండీఏను జీహెచ్‌ఎంసీలోకి విలీనం చేస్తున్నట్టు సోమవార ం ఓ చానెల్ (‘సాక్షి’ కాదు) వార్తాంశాన్ని ప్రసారం చేయడంతో హెచ్‌ఎండీఏ ఉద్యోగుల్లో అలజడి చెలరేగింది. ఇదెలా సాధ్యమంటూ.. సచివాలయం స్థాయి అధికారులను ఆరా తీశారు. యూనిఫైడ్ సర్వీసు రూల్స్ అమల్లోకి తేవడం ద్వారా ఇక్కడి సిబ్బందికి స్థానబ్రంశం కల్పించాలని ప్రభుత్వం యోచిస్తున్న నేపథ్యంలో హెచ్‌ఎండీఏను ఏకంగా జీహెచ్‌ఎంసీలోనే విలీనం చేస్తున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే, దీన్ని కొట్టిపారేయలేమని, హెచ్‌ఎండీఏపై సర్కారు లోతైన అధ్యయనం చేస్తుందని సీనియర్ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలోనే హెచ్‌ఎండీఏ పరిధిలో భూ వినియోగ మార్పిడికి అనుమతిచ్చే విషయమై ప్రభుత్వ పెద్దలు పునరాలోచనలో పడ్డట్టు సమాచారం.