‘సినిమా’ చూపించేవాడిని ..
హైదరాబాద్ : ‘భీమిలి కబడ్డీ జట్టు’ చిత్రం చూసినవారికి బాగా గుర్తుండిపోయిన నటుడు ‘ధన్‌రాజ్’. బక్కపలచగా ఉన్నా వంద చపాతీలు తింటానని పందెం కాసి గెలుస్తాడు. హోటల్ యజమాని లెక్క తప్పాడని మరలా మొదటి నుంచి పందెం ప్రారంబిద్దామని అమాయకంగా మొహం పెట్టి చెప్పడం ప్రతి ఒక్కరికీ ఇప్పటికీ గుర్తే. ధన్‌రాజ్ తన చిన్నప్పుడు వేసవి సెలవుల్లో గడిపిన రోజులను గుర్తు చేసుకున్నారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే..
‘నాన్న లారీ డ్రైవర్ కావడంతో విజయవాడ, నెల్లూరు, తెనాలి, గుంటూరు ఇలా చాలా ఊళ్లలో వేసవి సెలవులు గడిపాను. సెలవులిచ్చారంటే చాలు ఉదయం బయటకు వెళితే ఇంటికి చేరేది రాత్రికే. ఆటలన్నీ సినిమా చుట్టూనే తిరిగేవి. వాడేసిన ఫిల్మ్‌ల్ని సేకరించి ఫిల్మ్ బాక్సులో పెట్టి అందరికీ చూపించేవాడిని.
సినిమా రీళ్లను కత్తిరించి వాటిమధ్య చీపురుపుల్లలు పెట్టి భూతద్దంతో సూర్యకాంతిని ఫోకస్ చేసి తెల్లకాగితంపై అందరికీ చూపించి సరదాపడేవాడిని. సందర్భానుసారం డైలాగ్స్ కూడా నేనే చెప్పేవాడిని. ఎండ తగ్గితే చాలు ఈతపళ్లు ఏరుకుని కాలువ గట్టుని కూర్చుని తినడం మరిచిపోలేని అనుభూతి. ఈత నేర్చుకుందాం అనుకున్నా. ఓ సారి కృష్ణానదిలో మునిగిపోయా. నీటిగండం ఉందని తెలిసి ఈత జోలికి పోలేదు’ అంటూ ముగించారు.