
ముందడుగుకు ‘నవ కేరళ’
‘సాక్షి’ ఇంటర్వ్యూలో కేరళ సీఎం పినరయి విజయన్
- సామాజిక న్యాయం కోసం కార్యాచరణ ప్రణాళిక అమలు
- తమ్మినేని పాదయాత్ర దేశంలోనే రికార్డని కితాబు
సాక్షి, హైదరాబాద్: సామాజిక న్యాయాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు ‘నవ కేరళ’ పేరిట కార్యాచరణ ప్రణాళికను రూపొందించి ముందుకెళ్తున్నట్లు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వెల్లడించారు. విద్యారంగం పటిష్టత, మెరుగైన వైద్యం, లక్షలాది మందికి ఇళ్లు, సేంద్రియ పద్ధతుల్లో ఉద్యానవన పంటలు, కూర గాయల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధన వంటివి ఈ ప్రణాళికలో భాగమన్నారు. వైద్య, ఆరోగ్య కేంద్రాల బలోపేతం, పెద్ద జబ్బులకు అందరికీ ఉచిత వైద్యం, తాలుకా స్థాయిలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తామన్నారు. సొంత ఇళ్లు లేని లక్షలాది మందికి ఇళ్లు సమకూర్చడం తోపాటు ఉపాధి అవకాశాల కల్పన ద్వారా రాష్ట్రాభి వృద్ధికి బాటలు వేయాలని నిర్ణయించామన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చేపట్టిన మహాజన పాద యాత్ర ముగింపు సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు వచ్చిన నేపథ్యంలో పినరయి విజయన్ ‘సాక్షి’ ప్రతినిధికి ఇంటర్వ్యూ ఇచ్చారు.
ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
మాది పేదల అనుకూల రాష్ట్రం. దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే కేరళ ప్రజలు మెరుగైన జీవన ప్రమాణాలు కలిగి ఉన్నారు. గౌరవప్రదమైన వేతన విధానమే అందుకు కారణం. తెలంగాణతో మాకు సత్సంబం ధాలే ఉన్నాయి. తెలంగాణలో 4.5 లక్షల మంది మలయాళీలున్నారు. కేరళలోనూ తెలుగువారు చాలా మందే ఉన్నారు. శబరి మలకు ఏటా 3.5 లక్షల మంది రాష్ట్రం నుంచి వస్తుంటారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సబ్‌ప్లాన్‌నే కాకుండా పంచవర్ష ప్రణాళిక, మరెన్నింటినో రద్దు చేసింది. అయినా కేరళలో సబ్‌ప్లాన్‌ను కచ్చితంగా అమలు చేస్తు న్నాం. జనాభా ప్రాతిపదికనే కాకుండా అంత కు మించి ఈ వర్గాలకు కేటాయింపులు కేరళ ప్రత్యేకత. మేము పంచవర్ష ప్రణాళికనూ అమలు చేస్తున్నాం. అధికారాల వికేంద్రీక రణ, నిధుల కేటాయింపు, ప్రభుత్వ జోక్యం లేకపోవడం వంటి కారణాలు కేరళలో స్థానిక సంస్థల సమర్థ నిర్వహణకు దోహదపడుతు న్నాయి.
ప్రపంచ బ్యాంకుతోపాటు ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) నుంచి రుణం తీసుకోవడానికి మాకు అభ్యంతరం లేదు. కానీ రుణాలిచ్చేందుకు ఇష్టారీతిన నిబంధనలు పెట్టడమే మాకు అంగీకారం కాదు. తమ్మినేని నేతృత్వంలో 9 మంది సభ్యుల సీపీఎం బృందం 154 రోజులపాటు 4,200 కి.మీ పాదయాత్ర చేపట్టడం స్వతం త్ర భారతదేశ చరిత్రలో కొత్త రికార్డు. దీనికి ప్రజలు, మేధావులు, సామాజిక సంఘాల నుంచి పెద్ద ఎత్తున స్పందన రావడం హర్షణీయం. ఈ పరిణామం రాష్ట్రంలో సీపీఎంపై, మొత్తంగా వామపక్ష శక్తులకు అనుకూలంగా ఉంటుంది. అధికారంలోకి రాకముందు నేనూ కేరళలో పాదయాత్ర చేపట్టా. వివిధ వర్గాల ప్రజలను కలసి క్షేత్రస్థాయి సమస్యలను తెలుసుకునేందుకు పాదయాత్ర దోహదపడింది.