ఐక్యవేదికకే తొలి ప్రాధాన్యం
- సమస్యల ప్రాతిపదికగా ఆందోళనలు: సీపీఎం
- ఆ తర్వాతే రాజకీయ సమీకరణలపై దృష్టి...
- భేటీకి హాజరైన ఏచూరి, కారత్, రాఘవులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ముఖ్యమైన ప్రజాసమస్యలపై వామపక్షాలు, ప్రజా, సామాజిక సంఘాలతో ఐక్యవేదికను ఏర్పాటు చేసుకోవాలని సీపీఎం నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సంబంధించిన సమస్యలపై కార్యాచరణను రూపొందించు కుని ముందుకు సాగాలని తీర్మానించింది. ఆయా సమస్యల ప్రాతిపదికన వివిధ రూపా ల్లో ఆందోళనలను నిర్వహించాలని నిర్ణయిం చింది. ఈ కృషిని కొనసాగిస్తూనే రాజకీయ అంశాలు, వైఖరికి సంబంధించి కలిసొచ్చే శక్తులను కలుపుకుని ఉమ్మడి రాజకీయ వేదిక నిర్మాణానికి కృషి చేయాలని భావిస్తోంది.
బుధవారం ఇక్కడ ఎంబీ భవన్‌లో పార్టీ నాయకుడు చుక్క రాములు అధ్యక్షతన జరిగిన ఆ పార్టీ కార్యదర్శివర్గ సమావేశానికి పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్ కారత్, బీవీ రాఘవులు హాజరయ్యారు. రాష్ట్రంలో 90 శాతంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ, మైనారిటీలకు అభివృద్ధిలో, అవకాశాల్లో, ఇతరత్రా సమాన వాటా అందేలా చేసేందుకు పార్టీ రూపొందించిన ప్రత్యామ్నాయ ఆర్థిక ప్రణాళికపై చర్చించనున్నారు. దీని అమలుకు సంబంధించి గురువారం పార్టీ నాయకత్వం తన నిర్ణయాలను ప్రకటించనుంది.
ఆర్థిక అంశాలపై పోరు...
రాష్ట్రంలో వివిధ వర్గాలకు సంబంధించిన ఆర్థికపరమైన అంశాలు, జీవన ప్రమాణాలను పెంచేందుకు అవసరమైన ఆయా అంశాలు, సమస్యలపై ఉద్యమించాలని ఈ సమావేశం లో నిర్ణయించారు. ప్రధానంగా అత్యధిక శాతం ప్రజలపై ప్రభావం చూపే అంశాలు, నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పన, కార్మికులు, కాంట్రాక్ట్, ఇతర వర్గాలకు తగిన జీతభత్యాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు భూమి పంపిణీ, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని పేద లకు ఇళ్లు, ఇంటిస్థలాలు, సంబంధిత అంశా లపై దృష్టి పెట్టాలని తీర్మానించారు.
సర్కార్ నిరంకుశ చర్యలను వీడాలి
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా నిరంకుశ చర్యలను విడనాడాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గం విజ్ఞప్తి చేసింది. ప్రజా సమస్యలను పరిష్కరించి, అసంతృప్తిని తగ్గించే చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా ప్రజా ఉద్యమాలను ఉక్కుపాదంతో అణచి వేస్తోందని ధ్వజమెత్తింది. సమా వేశ నిర్ణయాలను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఒక ప్రకటనలో తెలియజేశారు. సీఎం కేసీఆర్ వెంటనే జోక్యం చేసుకుని కనీసం రూ.వెయ్యికోట్ల మార్కెట్ నిధిని కేటాయించి రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చి ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఈ సమావేశం కోరింది. ఉపాధి హామీ పనిదినాలు 200 రోజులకు పెంచి, రోజు వేతనం రూ.400 చెల్లించాలని విజ్ఞప్తి చేసింది. ధర్నాచౌక్ పరిరక్షణ కోసం జరిగే భవిష్యత్ ఉద్యమానికి పూర్తి మద్దతును ప్రకటించింది.