సాక్షికి ప్రత్యేక ధన్యవాదాలు: లక్ష్మారెడ్డి
హైదరాబాద్ : కొన్ని పత్రికలు అనవసరమైన రాతలు రాస్తున్నాయని, అయితే ప్రజల ఆరోగ్యం కోసం సాక్షి మీడియా లివ్ వెల్ ఎక్స్పో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం మంచి పరిణామమని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. ఆయన శనివారం హైదరాబాద్ హైటెక్స్లో సాక్షి ది 'లివ్ వెల్ ఎక్స్పో' కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన లివ్ వెల్ ఎక్స్ప్రోను చేపట్టిన సాక్షికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ, ప్రతిరోజై ఆరోగ్య సలహాలు, సూచనలు పాటించాల్సిందేనని, వాటిని పాటిస్తే రోగాలు రాకుండా ఉంటాయన్నారు.
గత ప్రభుత్వాలు ...ప్రభుత్వ ఆస్పత్రులను నిర్లక్ష్యం చేశాయని, దానివల్ల వైద్యం కోసం బీద ప్రజలు ఇబ్బంది పడుతున్నారని లక్ష్మారెడ్డి అన్నారు. ఆరోగ్యశ్రీ పథకం పేద ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉందన్నారు. అన్ని రకాల వ్యాధులకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స అందించే ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేస్తోందన్నారు. దీనికోసం ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయించామని తెలిపారు. జిల్లా స్థాయి ప్రభుత్వాస్పత్రిల్లో వెంటిలేటర్లు, ఐసీయూలు లేని పరిస్థితి ఉందని, వాటని కూడా త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. కొన్ని ప్రయివేట్ ఆస్పత్రుల్లో అవసరం ఉన్నా లేకున్నా సర్జరీలు చేస్తున్నారని లక్ష్మారెడ్డి వ్యాఖ్యానించారు.