చెల్లని మాఫీ చితి పేర్చింది | sakshi survey on farmer loans in telangana state | Sakshi
Sakshi News home page

చెల్లని మాఫీ చితి పేర్చింది

Published Mon, Dec 21 2015 1:30 AM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM

sakshi survey on farmer loans in telangana state

రుణాలు మాఫీ కాక.. బ్యాంకులు అప్పులివ్వక అన్నదాత అరిగోస

అప్పులే యమపాశాలవడంతో ఆత్మహత్యల బాట.. ‘సాక్షి’ సర్వేలో వెల్లడైన చేదు నిజాలు

బ్యాంకులు కొత్త రుణాలివ్వలేదన్నవారు 80 శాతం
ప్రైవేటుగా అప్పులు తెచ్చుకున్నవారు 83 శాతం
బలవన్మరణాలకు పాల్పడుతున్నవారిలో
అత్యధిక శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలే...
రూ. 8,080 కోట్లకు ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చినా
రైతులకు మొండిచేయి చూపిన బ్యాంకులు
12 లక్షల మందికి రుణాలివ్వని వైనం
రూ.8 వేల కోట్ల మేర  ప్రైవేటు అప్పులు చేసిన రైతులు

రాష్ట్ర ప్రభుత్వం చేసిన రుణమాఫీ ప్రకటనపై భరోసాతో రైతులు రుణాలు తిరిగి చెల్లించలేదు. ఒకేవిడతగా కాకుండా ప్రభుత్వం విడతలవారీగా చెల్లించడంతో బ్యాంకులు రైతులకు కొత్త రుణాలివ్వలేదు. మొదటి విడతగా ప్రభుత్వం ఇచ్చిన సొమ్ములో ఎక్కువ మొత్తాన్ని వడ్డీ కిందకే జమ చేసుకున్నాయి. ఇంకా సగానికిపైగా రుణ భారం రైతు నెత్తినే ఉండడంతో బ్యాంకులు అన్నదాతకు మొండిచేయి చూపాయి. స్వయంగా ప్రభుత్వం హామీ ఇచ్చినా బ్యాంకులు నమ్మలేదు. గత్యంతరం లేక రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పులు చేయాల్సి వచ్చింది.

ఈ మొత్తం సుమారు రూ.8 వేల కోట్ల దాకా ఉంటుందని అంచనా. అప్పులు చేసి సాగు చేసినా.. కాలం కలసిరాక పంటలు ఎండిపోయాయి. ప్రైవేటు వడ్డీ వ్యాపారి కాలయముడిలా కళ్ల ముందు నిలిచాడు. 782 మంది రైతులు ప్రాణాలు తీసుకున్నారు. వీరిలో 80 శాతానికిపైగా బ్యాంకు రుణాలు దొరక్క ప్రైవేటుగా అప్పులు చేసినవారే! బ్యాంకులు కనికరించి ఉంటే వాళ్లంతా బతికి ఉండేవాళ్లని వారి కుటుంబసభ్యులు చెబుతున్నారు.

 

సాక్షి నెట్‌వర్క్:

పెరిగిపోతున్న పెట్టుబడి ఖర్చులు, కొండలా పేరుకుపోతున్న అప్పుల కుప్పలు, సకాలంలో అందని బ్యాంకు రుణాలు, ఆదుకోని రుణమాఫీ పథకం.. అనుకూలించని కాలం.. ఇవే రైతు ఉసురును తీస్తున్నాయి! ఆత్మహత్య చేసుకున్న రైతుల్లో ఎక్కువ మంది సన్న, చిన్నకారు రైతులే ఉన్నారు. వారిలోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందినవారే అధికంగా ఉన్నారు. రైతు కన్నీళ్లను తెలుసుకునేందుకు ‘సాక్షి’ తెలంగాణలో తొమ్మిది జిల్లాల్లో క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసింది. ఆత్మహత్యకు పాల్పడిన 100 మంది రైతుల ఇళ్లకు వెళ్లి వారి కన్నీటి గాథలను తెలుసుకుంది. బలవన్మరణాలకు దారి తీసిన దుర్భర పరిస్థితులపై ఆరా తీసింది. అందరూ చెప్పింది ఒకటే మాట.. అప్పులు! రుణాలే తమ పాలిట యమపాశాలయ్యాయంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

 ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ హామీతో బ్యాంకులకు అప్పులు చెల్లించలేదని, తీరా అప్పులు పూర్తిగా మాఫీ కాకపోవడంతో కొత్త అప్పులు ఇవ్వలేదని, దీంతో గత్యంతరం లేక ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయించామని గోడు వెళ్లబోసుకున్నారు. అప్పులు కట్టాలంటూ బ్యాంకు అధికారులు, ప్రైవేటు అప్పుల్లోళ్లు ఒత్తిడి తేవడంతో కుంగిపోయి కొందరు, బంధువుల దగ్గర అడిగినా అప్పు పుట్టక మరికొందరు.. పంటలు ఎండాయన్న బాధతో ఇంకొందరు బలవన్మరణాలకు పాల్పడ్డట్టు ‘సాక్షి’ సర్వేలో వెల్లడైంది. వ్యవసాయంలో పీకల్లోతు కష్టాలకు తోడు పిల్లల చదువులు, పెళ్లికి ఎదిగిన కూతుళ్లు, అనారోగ్య పరిస్థితులు కూడా రైతులను ఆత్మహత్యల వైపు పురిగొల్పినట్టు తేలింది.

 

‘చితి’కిపోతున్న చిన్న రైతు

బలవన్మరణాలకు పాల్పడుతున్నవారిలో చిన్న, సన్నకారు రైతులే ఎక్కువగా ఉన్నారు. వీరంతా తమకున్న ఒకట్రెండు ఎకరాలకు తోడు మరికొంత భూమిని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నారు. కౌలు భూమి కావడంతో బ్యాంకుల్లో అప్పులు పుట్టడం లేదు. దీంతో బ్యాంకు రుణానికి దూరమవుతున్న ఆ రైతులు.. ప్రైవేటు అప్పుల వైపు చూస్తున్నారు. వందకు రూ.2, రూ.3 వడ్డీ చొప్పున అప్పులు తెస్తూ సాగు చేస్తున్నారు. ఆశలన్నీ పంటపైనే పెట్టుకుంటున్నారు. పంట ఎండిపోయినా, తెగుళ్లు సోకి దిగుబడి తగ్గినా మనోవేదనకు గురవుతున్నారు. ఆర్థికంగా అంతంతమాత్రం పరిస్థితి కావడంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

ఆత్మహత్యలకు పాల్పడిన 100 మందిలో 90 శాతానికిపైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన చిన్న, సన్నకారు రైతులే ఉన్నారు. కాస్త స్థితిమంతులైన పెద్ద రైతులు వ్యవసాయంలో ఒకట్రెండు సార్లు నష్టాలు వచ్చినా తట్టుకుంటున్నారు. అదీగాకుండా వారికి కష్టకాలంలో అప్పులు పుడుతున్నాయి. బంధువుల నుంచి సాయం అందుతోంది. ఎస్సీ, ఎస్టీ, బడుగు వర్గాలకు చెందినవారికి అటు అప్పులు పుట్టడం లేదు.. ఇటు బంధువుల నుంచి సాయం కూడా అంతంతే ఉంటున్నట్లు సర్వేలో తేలింది.

 ఆత్మహత్యలపై అశాస్త్రీయ లెక్కలు

తెలంగాణ ఏర్పడిన గత ఏడాది జూన్ రెండో తేదీ నుంచి ఈ ఏడాది అక్టోబర్ 8వ తేదీ వరకు రాష్ట్రంలో 782 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. అయితే అందులో కేవలం 342 మంది రైతులవి మాత్రమే నిజమైన ఆత్మహత్యలుగా తేల్చింది. మిగిలిన బలవన్మరణాలు వ్యవసాయ సంబంధమైనవి కావని అంటోంది. మరోవైపు రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 1,700 మందికిపైగా ఆత్మహత్యలు చేసుకున్నారని రైతు సంఘాలు చెబుతున్నాయి.

 

12 లక్షల మందికి రుణాల్లేవ్!

 సాక్షి, హైదరాబాద్:  తెలంగాణ ప్రభుత్వం గతేడాది రూ.లక్ష లోపు పంట రుణాలకు రుణమాఫీ ప్రకటించింది. మొత్తంగా రూ.17 వేల కోట్లు మాఫీ చేయాలని నిర్ణయించింది. రుణమాఫీకి అర్హులుగా 35.82 లక్షల రైతులను గుర్తించింది. రుణమాఫీలో మొదటి విడతగా గతేడాది రూ.4,230 కోట్లు ప్రకటించి బ్యాంకులకు అందజేసింది. ఆ సొమ్ములో రూ.4,040 కోట్లు రైతుల ఖాతాలో మాఫీ అయినట్లుగా బ్యాంకులు జమ చేశాయి. ఆ తర్వాత రెండో విడత రుణమాఫీ కింద రెండు విడతలుగా మరో రూ.4,040 కోట్లు విడుదల చేసింది. మిగిలిన సొమ్ము రూ.8,080 కోట్లను ఒకేసారి బ్యాంకులకు అందజేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా ఆ దిశగా అడుగులు పడలేదు. దీంతో బ్యాంకులు రైతులకు కొత్త రుణాలివ్వడానికి నిరాకరిస్తున్నాయి.

 

 రుణమాఫీకి అర్హులుగా గుర్తించిన 35.82 లక్షల మందిలో 2015-16 ఖరీఫ్‌లో 23.75 లక్షల మందికి మాత్రమే కొత్త రుణాలిచ్చారు. మిగిలిన 12.07 లక్షల మంది రైతులకు మొండిచేయి చూపాయి. ఇక ఖరీఫ్ పంట రుణ లక్ష్యం రూ.18,032 కోట్లు కాగా... రూ.14 వేల కోట్ల మేరకు ఇచ్చారు. 2015-16 రబీ పంట రుణ లక్ష్యం రూ.9,707 కోట్లు కాగా... ఇప్పటివరకు బ్యాంకులు కేవలం రూ.300 కోట్లు మాత్రమే ఇచ్చాయి. 35.82 లక్షల మంది రుణమాఫీ రైతుల్లో కేవలం 20 వేల మందికి మాత్రమే బ్యాంకులు రబీ పంట రుణాలిచ్చాయని వ్యవసాయాధికారి ఒకరు ‘సాక్షి’కి వెల్లడించారు. దీంతో రైతులు ప్రైవేటు అప్పులకు వెళ్లారు. ఖరీఫ్, రబీల్లో ఇప్పటివరకు రైతులు దాదాపు రూ. 8 వేల కోట్ల ప్రైవేటు అప్పులు చేశారని రైతు సంఘాలు చెబుతున్నాయి.

 

 తండ్రి మరణం.. ఆగిన కొడుకు చదువు

 వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తిమ్మంపేట గ్రామానికి చెందిన నేదురు కుమారస్వామి తనకు ఉన్న ఎకరంన్నరతో పాటు మరో మూడు ఎకరాలను కౌలుకు తీసుకున్నాడు. మూడేళ్లు భార్య యాక లక్ష్మీతో కలిసి వ్యవసాయం చేశాడు. గిట్టుబాటు కాక.. రూ.3 లక్షల అప్పు మిగిలింది. కూతురు పెళ్లికి మరో రూ.2 లక్షలు అప్పు చేశాడు. గతేడాది వ్యవసాయం కరువుతో పంటంతా పోయింది. దీంతో జీవితంపై విరక్తి చెందిన 2014 సెప్టెంబర్ 27న గ్రామంలోని చెరువు వద్ద తూముకు ఉరివేసుకుని మృతి చెందాడు. దీంతో కుమారుడి ఇంటర్ చదువు మధ్యలోనే ఆగిపోయింది. తల్లి, కొడుకు కలిసి ఎకరంన్నర భూమిలో వ్యవసాయానికి తోడు కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. గ్రామంలోని ఓ ఆసామికి చెందిన పశువుల పాకపై పరదా వేసుకుని బతుకుబండి లాగిస్తున్నారు.

 

 రైతుగా మారిన పెద్ద కొడుకు...

 తండ్రిని కోల్పోయిన ఆ కుటుంబంలో పెద్ద కొడుకే రైతుగా మారాడు. ఆదిలాబాద్ జిల్లా కుంటాల మండలం గొల్లమాడకు చెందిన ఎకిలేరి బోజన్న.. వ్యవసాయంలో అప్పుల పాలవడంతో నాలుగేళ్ల క్రితం గల్ఫ్ దేశానికి వెళ్లాడు. అక్కడ పని దొరక్క తిరిగి వచ్చి తనకున్న ఎనిమిదెకరాల భూమిలో మళ్లీ వ్యవసాయం మొదలుపెట్టాడు. పత్తి, వరి, సోయా పంటలు వేశాడు. నాలుగు బోర్లు వేయించాడు. మూడింట్లో నీరు రాలేదు. ఉన్న ఒక్క బోరు నుంచి సరిపడ నీరు రాలేదు. బ్యాంకుల్లో రూ. 1.80 లక్షలు, ప్రై వేటుగా రూ. 3.50 లక్షలు అప్పులయ్యాయి,. దీంతో బోజన్న ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య లక్ష్మి మంచం పట్టింది. ముగ్గురు పిల్లల్ని ఎలా సాకాలని కన్నీటి పర్యంతమవుతోంది. పదో తరగతి వరకు చదివిన పెద్ద కొడుకు సుధాకర్ వ్యవసాయం పనులు చూసుకుంటున్నాడు.

ఒకేరోజు తల్లిదండ్రుల ఆత్మహత్య..

తల్లిదండ్రుల చేత గోరు ముద్దలు తినాల్సిన ఈ చిన్నారులిద్దరూ (జశ్వంత్-7, నరేశ్‌కుమార్-3) అనాథలయ్యారు. అప్పులు బాధతో అమ్మానాన్న ఆత్మహత్య చేసుకోవడంతో రోడ్డున పడ్డారు. రంగారెడ్డి జిల్లా పూడూరు మండలంలోని పెద్ద ఉమ్మెంతాల్‌కు చెందిన చిల్కమర్రి తిరుమలయ్య(30), రమాదేవి(28) తమకున్న మూడెకరాల పొలంలో అప్పులు చేసి పత్తి, మొక్కజొన్న పంట సాగు చేశారు. వర్షాల్లేక పంటలు ఎండిపోయాయి. బ్యాంకుల్లో, ప్రైవేటుగా తీసుకున్న అప్పులు రూ.1.50 లక్షలు ఎలా తీర్చాలని మనోవేదనకు గురయ్యారు. దీంతో ఈ ఏడాది జూన్‌లో ఒకరు వ్యవసాయ బావిలో, మరోకరు రాకంచర్ల కొలనులో పడి ప్రాణాలు తీసుకున్నారు. వారి కుమారులిద్దరూ దిక్కులేని వారయ్యారు. ప్రభుత్వం పిల్లల పేరిట రూ.లక్ష బ్యాంకులో డిపాజిట్ చేసింది. అధికారులు చిన్నారులను అనాథాశ్రమంలో చేర్పించారు.

నా కుటుంబానికి దిక్కెవరయ్యా..

‘ఆరు బోర్లు వేసిన చుక్కనీరు పడలేదు.. వానల్లేక వేసిన పంటలు ఎండిపోయాయి. అప్పులకు తట్టుకోలేక నా పెనిమిటి ఊరేసుకొని సచ్చిపోయిండయ్యా.. నాకు, నా కుటుంబానికి దిక్కెవరయ్యా..’ అని బోదుకం సుగుణ కన్నీళ్లు పెట్టుకుంది. ఈమెది కరీంనగర్ జిల్లా మేడిపెల్లి మండలం మాచాపూర్. భర్త గంగారాం(60) అప్పుల బాధతో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. గంగారాం తనకున్న 4 ఎకరాల భూమిలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. నీళ్ల కోసం ఆరు బోర్లు వేసినా ఒక్కదాంట్లో కూడా.. చుక్క నీరు పడలేదు. రెండెకరాల్లో వేసిన మొక్కజొన్న కూడా ఎండిపోయింది. సాగు కోసం చేసిన అప్పులు రూ.5 లక్షల వరకు చేరుకొన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement