సంగారెడ్డి టౌన్ ఎస్‌ఐ అరెస్ట్
సంగారెడ్డి టౌన్ ఎస్‌ఐ అరెస్ట్
Published Wed, May 31 2017 2:10 AM | Last Updated on Sun, Sep 2 2018 3:51 PM
- వరకట్న వేధింపుల కేసులో అదుపులోకి తీసుకున్న పోలీసులు
- విడాకులివ్వకపోతే అభ్యంతరకర ఫొటోలు బయటపెడతానని బెదిరిస్తున్నాడు: భార్య జ్యోతిరెడ్డి ఆరోపణ
హైదరాబాద్: అదనపు కట్నం కోసం భార్యను వేధింపులకు గురిచేస్తున్న కేసులో సంగారెడ్డి టౌన్ ఎస్‌ఐ పెద్దోళ్ల లక్ష్మారెడ్డిని సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అదనపు కట్నం కోసమే కాకుండా విడాకులు ఇవ్వకపోతే తాము సన్నిహితంగా ఉన్నప్పటి ఫొటోలను బయటపెడతానని తన భర్త బెదిరిస్తున్నాడని, అతడిని కఠినంగా శిక్షించాలని లక్ష్మారెడ్డి భార్య జ్యోతిరెడ్డి డిమాండ్ చేస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. వసంతపురికాలనీకి చెందిన కె.జ్యోతిరెడ్డికి రంగారెడ్డి జిల్లా శంకరపల్లి గాజులగూడేనికి చెందిన లక్ష్మారెడ్డితో 2013లో వివాహమైంది. ప్రసుత్తం లక్ష్మారెడ్డి సంగారెడ్డి టౌన్ ఎస్‌ఐగా పనిచేస్తున్నాడు. వివాహ సమయంలో ఆరు లక్షల నగదు, 40 తులాల బంగారం కట్నకానుకల కింద అందజేశారు. వీరికి రెండున్నరేళ్ల బాబు సృజన్‌రెడ్డి ఉన్నాడు. లక్ష్మారెడ్డి అదనపు కట్నం కోసం వేధిస్తుండడంతో ఆమె మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
నరకం అనుభవించా..: బాధితురాలు
లక్ష్మారెడ్డి వల్ల రెండేళ్లు నరకం అనుభవించానని, ఓ దశలో ఆత్మహత్యాయత్నం చేశానని జ్యోతి ఆవేదన వ్యక్తం చేసింది. పెళ్లైన కొద్ది రోజులు బాగానే ఉన్నా లక్ష్మారెడ్డి పరాయి మహిళలతో పరిచయాలు పెంచుకుని తనను విడాకులివ్వమని వేధించేవాడన్నారు. ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టిన విషయం కూడా తనకు తెలియదని, తామిద్దరం సాన్నిహిత్యంగా ఉన్నప్పుడు ఫొటోలు, వీడియోలు తీశానని విడాకులు ఇవ్వకపోతే వాటిని ప్రచార మాధ్యమాల్లో పెడతానని బెదిరించేవాడన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా తనకు న్యాయం జరగలేదన్నారు. కాగా, జ్యోతి తన ఫిర్యాదులో అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని పేర్కొందని, ఫొటోల గురించి ఫిర్యాదు చేయలేదని మల్కాజిగిరి ఇన్‌స్పెక్టర్ జానకిరెడ్డి తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో లక్ష్మారెడ్డిని అరెస్ట్ చేశామని, అనంతరం స్టేషన్ బెయిల్ ఇచ్చామన్నారు. జ్యోతి మళ్లీ ఏదైనా ఫిర్యాదు ఇస్తే అదనపు చార్జిషీట్ వేస్తామన్నారు.
Advertisement